
మన శరీరంలో ప్రతి అవయవం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం ఆరోగ్యవంతులుగా ఉన్నట్లు. అందుకే ప్రతి విషయంలో చిన్నచిన్న జాగ్రత్తలు చాలా అవసరం. కానీ ఆరోగ్యం గురించి మాట్లాడేటప్పుడు మనం ఎక్కువగా పట్టించుకోని అంశం..దంతాల ఆరోగ్యం. అవి ఆరోగ్యంగా ఉంటేనే కదా..మన చిరునవ్వు బాగుండేది. ఒక చిన్న చిరునవ్వు..మన అందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. మరి మనం బ్యూటీఫుల్ గా కనిపించాలంటే టీత్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. అయితే పళ్లపై ఉండే ఎనామెల్ పొరే మన చిరునవ్వును, పళ్ల బలాన్ని, వాటి ఆయుష్షును డిసైడ్ చేస్తుంది. ఎనామిల్ దెబ్బతింటే పళ్లు పసుపుగా మారిపోవడం, మెత్తబడిపోవడం ఇలాంటి సమస్యలు నెమ్మదిగా బయటడతాయి. ఈ దంతాల సమస్యలపై డెంటిస్టులు ఆందోళనకరమైన మార్పును గమనించారు.
ఈ రోజుల్లో ఏ డెంటల్ క్లినిక్‌కి వెళ్లినా, పళ్ల సున్నితత్వం, ఎనామెల్ పలుచబడటం, పళ్ల అంచులు జారిపోవడం వంటి సమస్యలతో వచ్చే రోగులే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇవి ఒకప్పుడు వయసు పెరిగినవారిలో లేదా దంత సమస్యలు ఉన్నవారిలో మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే..ఇది మనకు మనం తెలియక చేసుకుంటున్న నష్టం. అతిగా బ్రష్ చేయడం, ఆమ్ల పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, ఇంట్లోనే వైట్‌నింగ్ ప్రయోగాలే అసలు కారణాలని డెంటిస్టులు చెబుతున్నారు. చిన్న చిన్న అలవాట్లే దీర్ఘకాలంలో పెద్ద సమస్యలకు దారి తీస్తాయి. అవేంటో చూద్దాం.
చాలామంది ఉదయం లేచిన వెంటనే గట్టిగా, వేగంగా బ్రష్ చేస్తారు. అలా చేస్తేనే పళ్లు బాగా శుభ్రం అవుతాయన్న నమ్మకం చాలా మందిలో ఉంది. కానీ ఇది పూర్తిగా తప్పు. హార్డ్ బ్రిసిల్స్ ఉన్న బ్రష్‌తో, అతిగా ఒత్తిడి పెట్టి బ్రష్ చేయడం వల్ల ఎనామెల్ క్రమంగా అరిగిపోతుంది. ఎనామెల్ తొలగిపోవడం మొదట్లో మనకు కనిపించకపోయినా..కాలక్రమంలో ఎనామెల్ పలుచబడి, పళ్లు సున్నితంగా మారతాయి. ఇంకో విషయం ఒకసారి ఎనామెల్ పోతే మళ్లీ తిరిగి రాదన్న విషయం గుర్తుంచుకోవాలి.
ప్రెజెంట్ లైఫ్ స్టైల్ లో కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, నిమ్మరసం, జ్యూసులు, టీ, కాఫీ, స్వీట్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇవన్నీ పళ్లపై ఎనామెల్‌ను నెమ్మదిగా కరిగిస్తాయి. ఒకవేళ ఇలాంటి పదార్థాలు తీసుకున్న తర్వాత వెంటనే నోరు కడగడం లేదా స్ట్రా ఉపయోగించడం లాంటి చిన్న అలవాట్లు కూడా ఎనామెల్‌ను కాపాడటానికి ఉపయోగపడతాయి.
లాలాజలం మన పళ్లకు సహజ రక్షణ. ఇది ఆమ్లాలను తగ్గించి, ఎనామెల్‌కు అవసరమైన ఖనిజాలను తిరిగి అందిస్తుంది. కానీ నీరు తక్కువ తాగడం, కాఫీ లేదా ఆల్కాహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల లాలాజల ఉత్పత్తి తగ్గుతుంది. దాంతో ఎనామెల్ మరింత బలహీనమవుతుంది. రోజంతా సరిపడా నీరు తాగడం, ఇది పళ్ల ఆరోగ్యానికి చాలా మంచి అలవాటు. కానీ ఎవరూ పట్టించుకోరు. ఎక్కువ నీరు తాగడం వల్ల అన్ని ఆరోగ్యం సమస్యలను దూరం చేస్తుంది. ధూమపానం, ఆల్కహాల్ కూడా ఎనామెల్ పై ప్రభావం చూపిస్తుంది.
ఈ సోషల్ మీడియా పెరిగిపోవడం వల్ల సొంత వైద్యం పెరిగిపోయింది. అందుకే ఇంట్లో వైట్ నింగ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నిమ్మరసం, బేకింగ్ సోడా, యాక్టివేటెడ్ చార్కోల్ లాంటి వాటితో ఇంట్లోనే పళ్లు తెల్లగా చేసుకోవాలని తెగ కష్టపడిపోతుంటారు. ఈ ప్రయత్నాలు తాత్కాలిక ఫలితం ఇచ్చినా...కానీ ఇవి ఎనామెల్‌ను వేగంగా దెబ్బతీస్తాయి. చివరికి పళ్లు మరింత పసుపు రంగులోకి మారి, మెత్తబడిపోతాయి. డెంటిస్ట్ సూచించిన వైట్‌నింగ్ ట్రీట్మెంట్స్ లేదా మైల్డ్ ఫ్లోరైడ్ టూత్‌పేస్టులు మాత్రమే సురక్షిత మార్గమని వైద్యులు చెబుతున్నారు.
చాలామంది ఏ టూత్‌పేస్ట్ అయినా క్యావిటీ ప్రొటెక్షన్ ఉంటే చాలు అనుకుంటారు. కానీ చాలా సాధారణ టూత్‌పేస్టులు కేవలం శుభ్రపరచడం లేదా వైట్ నింగ్ పైనే దృష్టి పెడతాయి. ఈ టూత్ పేస్టు కూడా ఎనామెల్‌ను స్ట్రాంగ్ చేయవు. ఎనామెల్ ఆరోగ్యానికి ఉపయోగపడే టూత్‌పేస్టులు చాలా అవసరం. ఇవి ఎనామెల్‌ను రీ మినరలైజ్ చేసి, రోజువారీ సమస్యల నుంచి రక్షిస్తాయి.
ఎనామెల్ అరిగిపోవడం అనేది క్రమంగా జరుగుతుంది. దాని విషయంలో ఎలాంటి హెచ్చరికలు ఉండవు. కొంచెం గట్టిగా బ్రష్ చేసినా, ఎక్కువసార్లు టీ, కాఫీలు తాగడం, సాధారణ టూత్‌పేస్ట్ మీదే ఆధారపడడం, ఇలాంటి చిన్న అలవాట్లే ఎనామెల్‌ను నెమ్మదిగా బలహీనపరుస్తాయి.
ఎనామిల్ విషయంలో గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే… అది ఒకసారి పోతే తిరిగి రాదు. అందుకే ముందస్తు జాగ్రత్తే ఒక్కటే మార్గం. సాఫ్ట్ బ్రిసిల్స్ ఉన్న బ్రష్‌తో మృదువుగా బ్రష్ చేయడం, ఆమ్ల పదార్థాల తర్వాత నోరు కడగడం, సరిపడా నీరు తాగడం, ముఖ్యంగా ఎనామెల్‌ను బలపరిచే ప్రత్యేక టూత్‌పేస్ట్ వాడడం అవసరం. ఎనామెల్ ప్రొటెక్షన్ టూత్‌పేస్టులు కేవలం శుభ్రం చేయడమే కాకుండా పునరుద్ధరించి, దాని సహజ బలాన్ని తిరిగి అందిస్తాయి. సరైన జాగ్రత్తలు తీసుకుంటే మంచి చిరునవ్వు, అందం మీ సొంతం.