చెవిలోకి చీమలు, పురుగులు దూరడం చాలా ఇబ్బంది పెట్టే విషయం. అవి చెవి నుంచి బయటకు వచ్చే వరకు మనం ప్రశాంతంగా ఉండలేము. ముఖ్యంగా ఇది పిల్లలకు ఎక్కువగా జరుగుతుంటుంది. చెవిలోపలికి వెళ్లిన కీటకాలు చెవిలోని భాగాలను కొరికి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి.
చెవి లోపలి భాగాలు చాలా సన్నితంగా ఉంటాయి. కాబట్టి చెవికి ఎలాంటి సమస్య రాకుండా జాగ్రత్తగా ఉండాలి. చెవిలోకి పురుగులు, చీమలు వెళ్తే వాటిని ఈజీగా ఎలా బయటకు తీయాలో ఇక్కడ తెలుసుకుందాం.
చీకటి గది:
చెవిలో పురుగు ప్రవేశిస్తే, మొదట చీకటి గదిలోకి వెళ్లి టార్చ్ లేదా మొబైల్ లైట్‌ను చెవిలో చూపించాలి. ఎందుకంటే కొన్ని పురుగులు వెలుతురు చూసి వెంటనే బయటకు వస్తాయి.
ఆలివ్ లేదా బేబీ ఆయిల్:
మీ చెవిలోకి చీమలు, పురుగులు ఏమైనా వెళ్లినప్పుడు ఆలివ్ లేదా బేబీ ఆయిల్ చుక్కలను చెవిలో వేస్తే, పురుగులు చెవిలో ఉండలేక ఆ నూనెతో కలిసి బయటకు వస్తాయి.
ఉప్పు నీరు:
గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి కొన్ని చుక్కలు చెవిలో వేయాలి. ఉప్పు కలిపిన నీరు పురుగుకు సహించదు. కాబట్టి వెంటనే చెవి నుంచి బయటకు వస్తుంది.
ఆల్కహాల్:
చెవిలో ఉన్న పురుగు బయటకు రావడానికి, దూదిని ఆల్కహాల్‌లో ముంచి చెవి బయటి భాగంలో ఉంచితే, పురుగులు చెవి నుంచి బయటకు వస్తాయి. ఒకవేళ ఇలా చేసినా బయటకు రాకపోతే, కొన్ని చుక్కలు మాత్రమే ఆల్కహాల్‌ను చెవిలో వేయండి! పురుగు వచ్చేస్తుంది.
ఇవి గుర్తుంచుకోండి:
- చెవిలోకి పురుగు వెళ్తే బడ్స్ లేదా ఇతర వస్తువులను ఉపయోగించి పురుగులను తీయడానికి ప్రయత్నించవద్దు. ఇలా చేస్తే పురుగు మరింత లోపలికి వెళ్తుంది. అంతేకాకుండా చెవి లోపలి భాగాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.
- చెవిలోకి పురుగు వెళ్తే వెంటనే వేలు పెట్టకండి. దీని వల్ల చెవి నొప్పి పెరుగుతుంది.
- కొంతమంది చెవిలోకి పురుగు వెళ్తే అగ్గిపుల్లతో తీయడానికి ప్రయత్నిస్తారు. కానీ అలా చేయడం తప్పు. దీని వల్ల చెవికి సమస్య వచ్చి, కొన్నిసార్లు వినికిడి శక్తి కూడా పోవచ్చు.
- నీరు, నూనె వేసినా చెవిలో ఉన్న పురుగు బయటకు రాకపోతే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ముఖ్యంగా పిల్లలు ఈ సమస్యను ఎదుర్కొంటే వెంటనే వారిని డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లండి.
- పురుగులు చెవిలోకి వెళ్లకుండా ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండండి.