
జ్వరం వచ్చినప్పుడు లేదా శస్త్రచికిత్స తర్వాత శరీరంలో ఆకలి తగ్గడం సాధారణమే. అలాంటి సమయంలో ఎక్కువ మసాలాలు, నూనెతో కూడిన ఆహారం తినడం కొందరికి ఇబ్బందిగా అనిపించవచ్చు. సాధారణంగా టోస్ట్ చేసిన తెల్ల బ్రెడ్ వంటి తేలికపాటి ఆహారాన్ని కొద్దిమొత్తంలో తీసుకోవడం సులభంగా ఉంటుంది. మెత్తగా ఉండటం, నమలడానికి పెద్దగా శ్రమ అవసరం లేకపోవడం వల్ల కూడా చాలామంది దీనిని ఎంచుకుంటారు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి ఆపరేషన్ తర్వాత బ్రెడ్ తినడం అందరికీ సరిపోతుందని చెప్పలేం. ఆపరేషన్ రకం, రోగి ఆరోగ్య పరిస్థితి, వైద్యుల సూచనలను బట్టి ఆహారం మారుతుంది.
జ్వరం వచ్చినప్పుడు శరీరానికి విశ్రాంతితో పాటు తగినంత డ్రింక్స్, శక్తి అవసరం. కానీ జ్వరం కారణంగా ఆకలి తగ్గిపోవడం, నోటికి రుచి తగ్గుతుంది. ఇలాంటి సమయంలో హెవీ మీల్స్ కంటే కొద్దికొద్దిగా తినడం కొంత సులభంగా ఉంటుంది. బ్రెడ్‌లో ప్రధానంగా కార్బోహైడ్రేట్లు ఉండటంతో కొంత శక్తిని అందిస్తుంది. అందుకే టీ, పాలు లేదా ఇతర తేలికపాటి పదార్థాలతో బ్రెడ్ తినడం చాలామందికి సులభంగా అనిపిస్తుంది. అయితే జ్వరం ఉన్న వ్యక్తికి బ్రెడ్ ఒక్కటే సరిపోదు. శరీరానికి అవసరమైన ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు, ద్రవాలు కూడా అవసరమే.
శస్త్రచికిత్స తర్వాత రోగికి ఆహారం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా కొన్ని ఆపరేషన్ల తర్వాత జీర్ణవ్యవస్థ సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం పడుతుంది. అందుకే వైద్యులు రోగి పరిస్థితిని బట్టి మొదట డ్రింక్స్, ఆ తర్వాత తేలికపాటి ఆహారం, అనంతరం సాధారణ ఆహారం వైపు తీసుకెళ్లవచ్చు. ఈ నేపథ్యంలో బ్రెడ్ వంటి సులభమైన ఆహార పదార్థాలు కొందరికి ఉపయోగపడవచ్చు. అయితే ఆపరేషన్ అయిన వెంటనే మన ఇష్టానుసారం బ్రెడ్, బిస్కెట్లు లేదా ఇతర ఆహార పదార్థాలు ఇవ్వడం సరికాదు. డాక్టర్ లేదా డైటీషియన్ సూచించిన ఆహారాన్నే ఇవ్వాలి. ముఖ్యంగా పేగులు, కడుపు, నోరు, గొంతుకు సంబంధించిన శస్త్రచికిత్సల తర్వాత ఆహార నియమాలు వేర్వేరుగా ఉండవచ్చు.
బ్రెడ్‌ను రోగిని పరామర్శించడానికి తీసుకెళ్లడం వెనుక కేవలం ఆరోగ్య కారణమే ఉండదు. ఇది చాలా సౌకర్యవంతమైన ఆహార పదార్థం కూడా. ప్యాకెట్‌లో లభిస్తుంది కాబట్టి ప్రత్యేకంగా వండాల్సిన అవసరం ఉండదు. తీసుకెళ్లడం, నిల్వ చేయడం కూడా సులభం. ఒకేసారి మొత్తం తినాల్సిన అవసరం లేకుండా అవసరమైనంత మాత్రమే ఉపయోగించుకోవచ్చు.
అదే సమయంలో ఆస్పత్రిలో ఉన్నవారికి ఇంట్లో తయారు చేసిన వంటకాలు తీసుకెళ్లడం ప్రతిసారీ సాధ్యం కాదు. రోగి ఏం తినగలడో కూడా స్పష్టంగా తెలియకపోవచ్చు. అందుకే ఎక్కువగా పరిచయం ఉన్న, సులభంగా ఉపయోగించగల ఆహార పదార్థంగా బ్రెడ్‌ను ఎంచుకుంటారు. ఈ కారణంగానే అనారోగ్యంతో ఉన్నవారిని పరామర్శించేటప్పుడు బ్రెడ్ ప్యాకెట్ ఒక సాధారణ ‘గెట్ వెల్ సూన్’ కానుకగా మారిపోయింది.
బ్రెడ్ తీసుకెళ్లడం అనేది ఒక సామాజిక అలవాటుగా మారిపోయింది కానీ బ్రెడ్ అనేది జ్వరం లేదా ఆపరేషన్‌కు ప్రత్యేకమైన మందు కాదు. అలాగే బ్రెడ్ తింటే రోగి త్వరగా కోలుకుంటాడని చెప్పడానికి కూడా ఆధారం లేదు. సాధారణ బ్రెడ్ ప్రధానంగా కార్బోహైడ్రేట్లను అందిస్తుంది. ఆపరేషన్ తర్వాత గాయం మానడానికి, కండరాల పునరుద్ధరణకు ప్రోటీన్ వంటి పోషకాలు కూడా ఎంతో ముఖ్యమైనవి.
అందుకే రోగి పరిస్థితిని బట్టి గుడ్లు, పాలు, పెరుగు, పప్పులు, చేపలు, చికెన్ వంటి ప్రోటీన్ వనరులు లేదా వైద్యులు సూచించిన ఇతర పోషకాహారం అవసరం కావచ్చు. జ్వరం ఉన్నవారికి కూడా తగినంత నీరు, ద్రవాలు, సులభంగా జీర్ణమయ్యే సమతుల ఆహారం ముఖ్యం.
గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.