హిందూ సంస్కృతిలో కార్తీక మాసానికి చాలా ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో చాలామంది భక్తులు శాకాహారాన్ని పాటిస్తూ.. దైవారాధనలో ఉంటారు. కాబట్టి ఈ నెలలో చికెన్ ధరలు గణనీయంగా తగ్గిపోతాయి. కానీ మటన్ ధరలు మాత్రం అంతగా తగ్గవు. దీనికి వెనుక ఉన్న కారణమేంటో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో కార్తీక మాసంలో.. వాతావరణంతో పాటు ఆహారపు అలవాట్లు కూడా మారుతాయి. ఈ పవిత్ర మాసంలో చాలా మంది శాకాహారం పాటించడం వల్ల మాంసాహార వినియోగంలో క్రమంగా మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా చికెన్ ధరలు గణనీయంగా పడిపోతాయి. అదే సమయంలో మటన్ ధరల్లో మాత్రం పెద్దగా తేడా కనిపించదు. దానికి కారణమేంటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
26
చికెన్ వినియోగం భారీగా తగ్గిపోవడం
కార్తీక మాసంలో చాలామంది భక్తులు మాసం మొత్తం లేదా కనీసం కొన్ని వారాలపాటు మాంసాహారాన్ని మానేస్తారు. ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో చికెన్ ప్రధానంగా తినే మాంసాహారం. వారు కార్తీక మాసంలో చికెన్ కొనకుండా ఉండిపోతే మార్కెట్ లో డిమాండ్ తగ్గిపోతుంది. డిమాండ్ తగ్గితే.. స్టాక్ ఎక్కువ మిగిలిపోతుంది. కాబట్టి ఆటోమెటిక్ గా చికెన్ ధరలు పడిపోతాయి.
36
చికెన్ ఉత్పత్తి
సాధారణంగా కోళ్లు చాలా తక్కువకాలంలో పెరుగుతాయి. చికెన్ అంటే బ్రాయిలర్ కోళ్లు. ఇవి 35–45 రోజుల్లో పెరుగుతాయి. అంటే ప్రతి నెలా కొత్త స్టాక్ మార్కెట్లోకి వస్తుంది. చాలామంది రైతులు ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల కార్తీక మాసంలోనూ ఎప్పటిలాగే కోళ్లను అమ్మకానికి పెడుతుంటారు. ఉత్పత్తి ఎక్కువగా ఉండి వినియోగం తక్కువగా ఉండటం వల్ల కూడా ధరలు తగ్గించి అమ్మాల్సి వస్తుంది.
మటన్ అంటే గొర్రె, మేక మాంసం. దీన్ని కాస్త డబ్బులున్న వాళ్లే ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. మటన్ ధరలు ఎక్కువగానే ఉంటాయి కాబట్టి ఈ మాంసాన్ని చాలామంది రెగ్యులర్ గా కొనుగోలు చేయరు. కార్తీక మాసంలో.. మటన్ కొనేవాళ్లు కొంత మంది ఆచారం నిమిత్తం ఆపినా, దాని వినియోగం పూర్తిగా తగ్గదు. కొన్ని కుటుంబాలు, ముఖ్యంగా కార్పొరేట్ ఉద్యోగుల వంటివారు కార్తీకమాస ఆచారాలను పాటించకపోవచ్చు. దానివల్ల మటన్‌కు స్థిరమైన డిమాండ్ ఉంటుంది.
56
గొర్రెలు, మేకల ఉత్పత్తి
గొర్రెలు లేదా మేకల పెంపకానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. ఒక గొర్రె పూర్తిగా పెరగడానికి కనీసం 6 నెలల నుంచి సంవత్సర కాలం పడుతుంది. అందువల్ల రైతులు ముందుగానే వాటిని ప్లాన్ చేసి మార్కెట్‌లోకి తీసుకువస్తారు. ఒక వేళ కార్తీక మాసం కారణంగా డిమాండ్ తక్కువ అని.. ధర తగ్గించినా.. వారు గొర్రెలను విక్రయించరు. వెనక్కి తీసుకెళ్తారు. మరో నెలపాటు వాటిని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి కార్తీక మాసం ప్రభావం మటన్ ధరలపై ఎక్కువగా పడదు.
66
శుభకార్యాల కారణంగా..
కార్తీక మాసంలో చాలా చోట్ల కుటుంబ సమావేశాలు, సామాజిక సమావేశాలు, విందులు జరుగుతుంటాయి. ఇలాంటి ఫంక్షన్లలో మటన్‌ను ప్రధానంగా వండడం సంప్రదాయం. అలాగే కొన్ని ప్రాంతాల్లో కార్తీక మాసం పాటించని కుటుంబాలు కూడా మటన్ కొనుగోలు కొనసాగిస్తుంటాయి. దానివల్ల మార్కెట్ లో మటన్ కి డిమాండ్ తగ్గకుండా ఉంటుంది.
ఫైనల్ గా..
చికెన్ ఉత్పత్తి వేగంగా ఉంటుంది. రైతులు కూడా ప్రాసెసింగ్ వ్యవస్థపై పెద్దగా ఆధారపడరు. వారు కోళ్లను డైరెక్ట్ గా విక్రయిస్తారు. వాటిని నిల్వచేయడం కష్టం. కానీ మటన్ ఉత్పత్తి కాలం ఎక్కువ. దీన్ని కొన్ని సందర్భాల్లో నిల్వ చేయవచ్చు. లేదా కొంత వరకు సరఫరాను నియంత్రించవచ్చు. కాబట్టి ధరలు స్థిరంగా ఉండే అవకాశాలు ఎక్కువ.