lunch box
ఆరోగ్యకరం అనే ఉద్దేశంతో కొందరు లంచ్ లో పండ్లను మాత్రమే తీసుకుంటుంటారు. వాటిని ముక్కలుగా కోసి బాక్సులో సర్దుకుంటారు. కానీ ఇది సరైన పద్దతి కాదు. పండ్లు ఎంత తాజాగా ఉన్నప్పటికీ వాటిని ముక్కలుగా కోసి బాక్సులో పెట్టుకుంటే వెంటనే రుచి మారిపోతుంది. పండ్లను ముక్కలుగా కోయకుండా వాటిని అలాగే బాక్సులో పెట్టుకుని తీసుకెళ్లడం మంచిది. తినేటప్పుడే కోసుకోవాలి.
యోగర్ట్, నిమ్మ, మయోనైజ్ లాంటి వాటిని ఉపయోగించి తొందరగా వంట పూర్తి చేయవచ్చు. కానీ వీటికి తొందరగా పాడయ్యే గుణం ఉంటుంది. టమాటా, దోసకాయ, బంగాళాదుంపలతో చేసిన కూరలు కూడా తొందరగా చెడిపోతాయి. వీటికి బదులు పప్పు, పచ్చడి, పులుసు లాంటి వాటిని లంచ్ బాక్స్‌లో పెట్టుకోవచ్చు. అలాగే అన్నానికి బదులు చపాతీ, పుల్కా, శాండ్‌విచ్‌లాంటివి పెట్టుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.
ఆప్పుడే వండిన వేడివేడి ఆహారాన్ని వెంటనే బాక్సుల్లో సర్దేయకూడదు. అలా సర్దితే.... వేడి వల్ల ఆహార పదార్థాలు తొందరగా పాడవుతాయి. పైగా ప్లాస్టిక్ బాక్సుల్లో వేడి వేడి పదార్థాలు పెట్టడం క్యాన్సర్ కి కారణం అవుతుంటాయి. కాబట్టి అన్నం, కూరలను చల్లార్చి విడివిడిగా బాక్సుల్లో సర్దాలి. అప్పుడే అవి చాలాసేపటి వరకూ తాజాగా ఉంటాయి.
సమయం లేకనో, ఆహారాన్ని వేస్ట్ చేయకూడదనో.. కొంతమంది రాత్రి వంటలను ఫ్రిజ్‌లో ఉంచి ఉదయాన్నే వాటిని బాక్సుల్లో సర్దుకుంటూ ఉంటారు. ఇలా రాత్రి వేళ ఆహారం మరుసటి రోజు మధ్యాహ్నం వరకు నిల్వ ఉండదు. ఎండాకాలంలో తొందరగా పాడవుతుంటాయి. అందుకే ఉదయం పూట తాజాగా వండిన ఆహారాన్ని మాత్రమే లంచ్ బాక్స్‌లో తీసుకెళ్లాలి.
ఆఫీసుకైనా, పిల్లల లంచ్ బాక్స్ లు అయినా ప్లాస్టిక్ కి బదులు స్టీలు బాక్సులు వాడాలి. వీటిలోనే ఆహారం ఎక్కువకాలం తాజాగా ఉంటుంది. పైగా ఆరోగ్యకరం కూడా. మామూలు స్టీల్ బాక్స్‌లు కాకుండా గాలి చొరబడని విధంగా గట్టి మూత ఉన్న బాక్స్‌లు వాడుకుంటే ఆహారం ఎక్కువసేపు నిల్వ ఉంటుంది.