
షుగర్ పేషెంట్లు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని రకాల ఆహారాలు బ్లడ్ షుగర్ ను పెంచుతాయి. అందుకే గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలను షుగర్ పేషెంట్లు తినకూడదు.
అయితే డయాబెటీస్ పేషెంట్లకు రాగులు, ఓట్స్ రెండూ ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ రెండింటిలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కానీ ఈ రెండింటిలో షుగర్ పేషెంట్లు ఉదయాన్నే ఏం తింటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
రాగులను ఎన్నో ఏండ్లుగా తింటున్నారు. చూడటానికి చిన్నగా ఉన్నా వీటిలో ఫైబర్, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. అలాగే వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. రాగులు డయాబెటీస్ పేషెంట్లకు చాలా మంచివి. వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు వెంటనే పెరగవు. అలాగే దీనిలో పుష్కలంగా ఉండే ఫైబర్ కంటెంట్ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. హెవీగా తినకుండా కడుపును తొందరగా నింపుతుంది. ఇవి జీర్ఱక్రియను మెరుగుపర్చడానికి కూడా సహాయపడతాయి.
రాగుల్లో పాలీఫెనాల్స్ కూడా మెండుగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి సహాయపడతాయి. అయితే రాగుల ప్రయోజనాలను పొందాలనుకుంటే మాత్రం వీటితో డీప్ ఫ్రై వంటకాలను చేసుకుని తినకండి. వీటి ప్రయోజనాలను పొందాలనుకుంటే రాగి జావ, రాగి దోశ వంటివి చేసుకుని తినాలని ఆరోగ్య నిపుణులు సలహానిస్తున్నారు
ఓట్స్ షుగర్ ఉన్నవారికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిని తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. సులువుగా బరువు తగ్గడంతో పాటుగా ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. అందుకే చాలా మంది ఓట్స్ ను రోజూ తింటుంటారు. ఓట్స్ లో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే బీటా గ్లూకాన్ కూడా మెండుగా ఉంటుంది. ఓట్స్ ను తింటే గ్లూకోజ్ శోషణ నెమ్మదిస్తుంది. షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. షుగర్ పేషెంట్లకు ఓట్స్ చాలా మంచివి. ఎందుకంటే వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కూడా కరుగుతుంది. దీంతో గుండె జబ్బులొచ్చే ప్రమాదం తగ్గుతుంది.
షుగర్ పేషెంట్లకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్లు ఓట్స్ ను తింటే ఈ రిస్క్ తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే టేస్టీ ఓట్స్ మంచివి కావు. ఎందుకంటే వీటిలో షుగర్స్ ఉంటాయి. అందుకే మీరు ఓట్స్ ను తినాలనుకుంటే రోల్డ్ లేదా స్టీల్ కట్ ఓట్స్ ను తినడం మంచిది. వీటిని మీరు ఉప్మా లేదా స్మూతీల్లో తినొచ్చు.
నిపుణుల ప్రకారం.. మీ శరీర అవసరాన్ని బట్టి మీరు రెండింటిలో ఏదో ఒకదాన్ని తినొచ్చు. కాల్షియం కావాలనుకుంటే మీరు రాగులను తినొచ్చు. కొలెస్ట్రాల్ తగ్గాలన్నా, జీర్ణక్రియ బాగా పనిచేయాలన్నా మీరు ఓట్స్ ను తినొచ్చు. అయితే మీరు ఈ రెండింటి పోషకాలను పొందాలనుకుంటే మాత్రం ఈ రెండింటిని వేర్వేరు రోజుల్లో తినొచ్చు. ఏదేమైనా డయాబెటీస్ పేషెంట్లు వీటి ప్రయోజనాలను పొందాలనుకుంటే చక్కెర, ఉప్పును తగ్గించాలి. ప్రాసెస్ చేసిన వాటిని తినకూడదు.