ఆరోగ్యంగా ఉండడానికి ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో.. టైంకి తినడం కూడా అంతే ముఖ్యం. మనలో చాలామంది రకరకాల కారణాలతో రాత్రిపూట లేటుగా తింటుంటారు. కానీ రాత్రి ఆలస్యంగా తినడం ఆరోగ్యానికి మంచిదేనా? దానివల్ల శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో మీకు తెలుసా?
రాత్రిపూట లేటుగా భోజనం చేయడం చాలా మందికి అలవాటుగా ఉంటుంది. పని, చదువు, ఫ్రెండ్స్, టీవీ చూడటం వంటి అలవాట్ల వల్ల రాత్రి భోజనం ఆలస్యంగా చేస్తుంటారు. మొదట్లో ఇది పెద్ద సమస్యగా అనిపించకపోవచ్చు. కానీ దీర్ఘకాలంలో ఇది ఆరోగ్యానికి హానికరం అవుతుంది. రాత్రి సమయంలో మన శరీరం ఎక్కువ శక్తిని ఉపయోగించదు. కాబట్టి ఎక్కువగా తినడం, లేటుగా తినడం వల్ల ఆహారం శరీరంలో ఫ్యాట్‌గా పేరుకుపోతుంది. అది రకరకాల సమస్యలకు కారణమవుతుంది.
25
జీర్ణక్రియపై ప్రభావం
రాత్రిపూట లేటుగా భోజనం చేయడం జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. రాత్రి సమయంలో జీర్ణక్రియ మందగిస్తుంది. ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల గ్యాస్, ఉబ్బరం, కడుపునొప్పి, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, ఇన్సులిన్ స్థాయిల్లో మార్పులు కూడా వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల దీర్ఘకాలంలో డయాబెటిస్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. గుండె సంబంధిత సమస్యల రిస్క్ కూడా పెరుగుతుంది.
35
నిద్రపై ప్రభావం
రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం వల్ల నిద్రకు ఆటంకం కలుగుతుంది. సాధారణంగా తిన్న వెంటనే చాలామందికి నిద్ర రాదు. కాబట్టి లేటుగా నిద్రలోకి జారుకుంటారు. దానివల్ల ఉదయం సమయానికి నిద్రలేవలేరు. లేచినా ఆ రోజంతా అలసట, నీరసం, ఫోకస్ సమస్యలు వెంటాడుతాయి. దానివల్ల ఏ పని సరిగ్గా చేయలేరు. కొందరికి నిద్రలేమి వల్ల డిప్రెషన్ లక్షణాలు కూడా పెరగవచ్చు.
రాత్రిపూట ఎక్కువ తినడం, లేటుగా తినడం మానసిక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. బరువు పెరగడం, జీర్ణ సమస్యలు, నిద్ర లోపం వల్ల ఒత్తిడి, ఆందోళన, కోపం లాంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
55
ఏ టైంకి తినాలంటే?
రాత్రిపూట భోజనం వీలైనంత త్వరగా చేయాలి. కనీసం 9 గంటలకు ముందు పూర్తిచేయడం ఉత్తమం. లేదా పడుకునే రెండు, మూడు గంటల ముందు తినడం మంచిది. రాత్రి తేలికపాటి భోజనం, కూరగాయలు, సూప్, ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. భోజనం తర్వాత చిన్న నడక లేదా తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పొట్ట తేలికగా ఉంటుంది. నిద్ర నాణ్యత కూడా పెరుగుతుంది.