
అన్నంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి కారణమవుతాయి. అందుకే అన్నాన్ని ఎక్కువగా తినేవారు వెయిట్ బాగా పెరుగుతారు. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు మాత్రం అన్నాన్ని తగ్గించి చపాతీలను ఉదయం, రాత్రి వేళల్లో తింటుంటారు.
నిజానికి చపాతీ బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది. అయినా చపాతీ తిన్నంత మాత్రానా బరువు తగ్గడమనేది ఉండదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే చపాతీని కొన్ని పద్దతుల్లో అస్సలు తినకూడదు. దీనివల్ల మీరు ఏ మాత్రం బరువు తగ్గరు. పైగా బరువు పెరిగే అవకాశం కూడా ఉంది.
గోధుమ పిండితో చేసిన చపాతీలను తింటే చాలా మంచిది. ఎందుకంటే దీనిలో మన శరీరానికి అవసరమైన జింక్, ఐరన్, మెగ్నీిషియం, ఫాస్పరస్ వంటి ముఖ్యమైన ఖనిజాలు మెండుగా ఉంటాయి. చపాతీల్లో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్దకం సమస్య నుంచి ఉపశమనం కలిగించడానికి సహాయపడతుంది.
అలాగే జీర్ణక్రియ మెరుగ్గా జరగడానికి తోడ్పడుతుంది. చపాతీలను తినడం వల్ల కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. దీనితో మీరు అనవసరమైన ఆహారాలను తినకుండా ఉంటారు. ఈ విధంగా చపాతీలు బరువు తగ్గడానికి సహాయపడతాయి.
వైట్ రైస్ తో పోలిస్తే గోధుల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను వెంటనే పెంచదు. కాబట్టి చపాతీలు డయాబెటీస్ పేషెంట్లకు చాలా మంచివని ఆరోగ్య నిపుణులు చెప్తారు. ఇది బరువు తగ్గేవారికి కూడా మంచిది.
గోధుమల్లో కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని ఎక్కువ సేపు శక్తివంతంగా ఉంచడానికి సహాయపడతాయి. చపాతీలను తిన్న వెంటనే మన శారీరానికి శక్తి అంది అలసట బలహీనత తగ్గుతుంది. అందుకే వీటిని ఉదయం, మధ్యహ్న భోజనంలో తినాలని ఆరోగ్య నిపుణులు చెప్తారు.
గోధుమల్లో ఉండే ఫైబర్ కంటెంట్ శరీరంలో ఎక్కువగా ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. దీనివల్ల గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ఈ గోధుమల్లో ఉండే పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు అధిక రక్తపోటును నియంత్రించేందుకు సహాయపడతాయి.
గోధుమల్లో ఉండే ఫైబర్ మలబద్దకాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి జీర్ణ సమస్యలు లేకుండా చేస్తుంది. రోజూ చపాతీలను తినే వారికి కడుపు ఆరోగ్యంగా ఉంటుంది. ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు రావు.
గోధుమ చపాతీల్లో మెగ్నీషియం, ఐరన్, జింక్, విటమిన్ బి వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా ఉంచడానికి, రక్తహీనత సమస్యను తగ్గించడానికి, నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి.
అంతేకాదు పోషకాలు ఎక్కువగా ఉన్న చపాతీని తింటే చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ ను తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి.
కొంతమంది చపాతీని తిన్నా బరువు పెరుగుతారు. కారణం పిండిని కలిపేటప్పుడు, కాల్చేటప్పుడు అందులో నూనె లేదా నెయ్యిని వేయడమే. ఇదే మనం చేసే అతిపెద్ద తప్పు. దీనివల్ల చపాతీలను తిన్నా లాభం ఉండదు. రెండు చపాతీల్లో 140 కేలరీలు ఉంటాయి.
మీరు ఈ చపాతీలకు నెయ్యిని లేదా నూనెను యాడ్ చేసినప్పుడు ఈ కేలరీల సంఖ్య మరింత పెరుగుతుంది. దీంతో మీరు బరువు తగ్గడం ఉండదు. పెరగడమే ఉంటుంది. చపాతీలను నూనె లేదా నెయ్యితో కాల్చి తింటే టేస్టీగా ఉంటాయి. కానీ వీటిని తినడం వల్ల బరువు తగ్గరు. బరువు తగ్గాలనుకునేవారు చపాతీలను ఇలా మాత్రం తినకూడదు.
- బరువు తగ్గాలనుకునేవారు చపాతీ పిండిలో లేదా చపాతీలను కాల్చేటప్పుడు నూనె లేదా నెయ్యిని కలపకూడదు. వీటిని అలాగే పెనం మీద వేసి కాల్చండి. దీనివల్ల కేలరీలు పెరగవు.
- చపాతీ ఆరోగ్యానికి చాలా మంచిది. అయినప్పటికీ దీన్ని ఎక్కువగా మాత్రం తినకూడదు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు. బరువు తగ్గాలనుకునేవారు ఒక పూటకు రెండు చపాతీలను మాత్రమే తింటే మంచిది.
- అలాగే చపాతీలను వేయించిన కూరగాయలతో తినకూడదు. ఎందుకంటే వీటిలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా చపాతీలను తింటే మీరు అస్సలు బరువు తగ్గరు. చపాతీలను ఉడికించిన, ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న పప్పు కూరలతో తినండి. ఈ విధంగా చపాతీలను తింటే గనుక మీరు ఈజీగా బరువు తగ్గుతారు.