
రోజూ పాలను తాగడమే కాదు.. పెరుగును తినడం కూడా ఆరోగ్యానికి మంచిదే. ఎందుకంటే పెరుగులో మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే కాల్షియం, ప్రోబయోటిక్స్, విటమిన్ బి12, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఎముకల్ని, దంతాల్ని బలంగా ఉంచడం నుంచి బరువు తగ్గడం, గుండెను ఆరోగ్యంగా ఉంచడం వరకు ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తాయి. అసలు రోజూ ఒక కప్పు పెరుగును తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది
జీర్ణసమస్యలు ఉన్నవారు రోజూ కప్పు పెరుగును తినడం మంచిది. ఎందుకంటే పెరుగులో మంచి బ్యాక్టీరియా బిలియన్ల కొద్దీ ఉంటుంది. ఇది మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది.
ఇది మన కడుపులోపలి బ్యాక్టీరియాను సమతుల్యంగా ఉంచుతుంది. మీకు గ్యాస్, అజీర్థి, మలబద్దకం వంటి జీర్ణ సమస్యలు ఉంటే పెరుగును రోజూ తినండి. ఇది ఈ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పెరుగును తింటే జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపడుతుంది. కడుపు సమస్యలు రావు.
ఎముకలు, దంతాలు బలంగా ఉంటాయి
పెరుగులో కాల్షియం, భాస్వరంలు పుష్కలంగా ఉంటాయి. ఈ రెండు పోషకాలు మన దంతాల్ని, ఎముకల్ని బలంగా ఉంచేందుకు సహాయపడతాయి. మీరు రోజూ కప్పు పెరుగును తింటే గనుక బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అలాగే శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన పోషణ కూడా అందుతుంది.
రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటేనే మనం దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధులకు దూరంగా ఉంటాం. అయితే పెరుగు మన ఇమ్యూనిటీ పవర్ పెరిగేందుకు సహాయపడుతుంది. పెరుగులో ఉండే ఖనిజాలు, ప్రోబయోటిక్స్ మన రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడతాయి. దీంతో మీరు ఇన్ఫెక్షన్లకు కూడా దూరంగా ఉంటారు.
గుండె ఆరోగ్యంగా ఉంటుంది
పెరుగు మన గుండెను హెల్తీగా ఉంచేందుకు కూడా సహాయపడుతుంది. పెరుగును తింటే అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. అలాగే శరీరంలో ఎక్కువగా ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గడం మొదలవుతుంది. దీంతో మీకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. మీరు రోజూ పెరుగును తింటే స్ట్రోక్, గుండెపోటు వచ్చే ముప్పు తగ్గుతుంది. మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
పెరుగులో లాక్టిక్ యాసిడ్, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన చర్మానికి ఎంతో అవసరం. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. రోజూ కప్పు పెరుగును తింటే మన చర్మం లోపలి నుంచి శుభ్రపడుతుంది.
అలాగే చర్మం పొడిబారడం తగ్గుతుంది. మీ చర్మం కాంతివంతంగా మెరిసిపోతుంది. పెరుగును రోజూ తింటే చర్మం ఆరోగ్యంగా, మంచి గ్లో వస్తుంది. దీనిని జుట్టుకు మాస్క్ గా వేసుకుంటే మీ జుట్టు మంచి షైనీ గా కనిపిస్తుంది. వెంట్రుకలు పొడుగ్గా కూడా పెరుగుతాయి.
బరువు తగ్గుతారు
బరువు తగ్గాలనుకునే వారికి కూడా పెరుగు ప్రయోజనకరంగా ఉంటుంది. పెరుగులో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీన్ని తింటే మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. దీంతో మీరు హెవీగా తినలేరు. బరువును పెంచే అనారోగ్యకరమైన ఆహారాలను తినకుండా ఉంటారు. బరువు తగ్గాలనుకుంటే మీరు ఫుల్ ఫ్యాట్ పెరుగుకు బదులుగా లో ఫ్యాట్ పెరుగును తింటే మంచిది. ఇది మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
పిల్లల ఆరోగ్యానికి మంచిది
పిల్లలు కూడా పెరుగును రోజూ తినొచ్చు. ఇది వీరి ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. రోజూ పెరుగును తినే పిల్లల జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది. అలాగే పెరుగుతో పిల్లల శరీరానికి అవసమరైన కాల్షియం, విటమిన్ బి12, ప్రోటీన్లు, ఫాస్పరస్ వంటి పోషకాలు అందుదతాయి. దీంతో పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు.
అధిక రక్తపోటు గుండెపోటుకు కారణమవుతుంది. బీపీ పేషెంట్లకు గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే ముప్పు ఉంది. అయితే ఈ సమస్యను నియంత్రించడానికి పెరుగు కూడా సహాయపడుతుంది.
పెరుగుతో పాటుగా పాల ఉత్పత్తులను రెగ్యులర్ గా తీసుకుంటే మీ రక్తపోటు స్థాయిలు అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. దీనిలో ఉండే కాల్షియం, పొటాషియంలు గుండె పనితీరును మెరుగుపర్చడానికి సహాయపడతాయి.
రక్తంలో చక్కెర నియంత్రణ
డయాబెటీస్ ఉన్నవారికి కూడా పెరుగు సహాయపడుతుంది. బ్లడ్ షుగర్ ను కంట్రోల్ లో ఉంచుకోవాలంటే రోజూ కప్పు పెరుగును తినండి. పెరుగులో ఉండే ప్రోటీన్లు చక్కెర శోషణను నెమ్మదింపజేయడానికి సహాయపడతాయి. సమతుల్య భోజనంతో పెరుగును తింటే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. అలాగే మీరు శక్తివంతంగా కూడా ఉంటారు.