White Towel : ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల కుర్చీలపై తెల్లటి టవల్ ఎందుకు ఉంటుందో తెలుసా? బ్రిటిష్ కాలం నాటి ఆసక్తికరమైన చరిత్ర, దాని వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
ప్రభుత్వ కుర్చీపై తెల్లటి టవల్.. దీని వెనుక పెద్ద కథే ఉందా?
దేశంలో ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా, అక్కడ మనకు అందరికీ కామన్ గా కనిపించే ఒక దృశ్యం ఉంది. అదే.. ఉన్నతాధికారుల కుర్చీలపై పరచి ఉండే ఆ తెల్లటి టవల్. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల నుంచి మొదలుకొని స్థానిక తహశీల్దార్ కార్యాలయం వరకు ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. అయితే, ప్రస్తుతం ఖరీదైన ఎర్గోనామిక్ కుర్చీలు వచ్చినా, ఏసీ గదులు ఉన్నా కూడా ఈ టవల్ వాడకం ఎందుకు తగ్గలేదు? దీని వెనుక ఉన్న చారిత్రక, సామాజిక కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
25
బ్రిటిష్ కాలం నాటి వారసత్వం
ఈ తెల్లటి టవల్ సంప్రదాయం ఈరోజుల్లో మొదలైంది కాదు. దీని మూలాలు బ్రిటీష్ పాలనలో ఉన్నాయి. అప్పట్లో అధికారులు ఎక్కువగా గుర్రాలపై లేదా ఎడ్ల బండ్లపై ప్రయాణించి కార్యాలయాలకు చేరుకునేవారు. భారతదేశంలోని విపరీతమైన ఎండలు, దుమ్ము ధూళి వల్ల వారు ఆఫీసుకి వచ్చేసరికి పూర్తిగా చెమటతో తడిసిపోయేవారు. ఆ చెమట కుర్చీలకు అంటకుండా ఉండటానికి, అలాగే వెన్ను భాగానికి హాయిగా ఉండటానికి టవల్స్ వాడటం ప్రారంభించారు. కాలక్రమేణా బ్రిటిష్ వారు వెళ్లినా, వారు వదిలివెళ్లిన ఈ టవల్ సంస్కృతి మాత్రం భారతీయ బ్యూరోక్రసీలో భాగమైపోయింది.
35
పరిశుభ్రత, నిర్వహణ కష్టంగా ఉండేది..
పాత కాలంలో ఆఫీసు కుర్చీలు ఎక్కువగా చెక్కతో లేదా లెదర్‌తో తయారయ్యేవి. వీటిని ప్రతిరోజూ శుభ్రం చేయడం కష్టమయ్యేది. ముఖ్యంగా తలకి నూనె రాసుకునే అలవాటు ఉన్నవారి వల్ల కుర్చీ వెనుక భాగం త్వరగా జిడ్డుగా మారిపోయేది. అదే ఒక టవల్ వేస్తే, అది మురికిని పీల్చుకుంటుంది. వారం వారం ఆ టవల్‌ను ఉతికితే సరిపోతుంది. ఇది కుర్చీ లైఫ్ ను పెంచడమే కాకుండా, కార్యాలయంలో పరిశుభ్రతను కూడా కాపాడేది.
చాలా కాలం తర్వాత, ఈ తెల్లటి టవల్ కేవలం అవసరం కోసం కాకుండా ఒక స్టేటస్ సింబల్ గా మారిపోయింది. ఒక గదిలోకి వెళ్ళినప్పుడు ఏ కుర్చీపై అయితే తెల్లటి టవల్ ఉంటుందో, అది ఆఫీసర్‌కి చెందినదని, మిగిలినవి సందర్శకులవని ఇట్టే అర్థమైపోయేది. అంటే, అధికారాన్ని, హోదాని గుర్తించడానికి ఇది ఒక గుర్తుగా కూడా మారింది. ఈ విషయం ఎంత సీరియస్ అంటే.. కొన్నిసార్లు ప్రజా ప్రతినిధులు తమ కుర్చీలపై టవల్ లేకపోవడాన్ని అవమానంగా భావించి గొడవ పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీనివల్ల ప్రభుత్వాలు ప్రత్యేకంగా ప్రోటోకాల్‌ను కూడా రూపొందించాల్సి వచ్చింది.
55
తెలుపు రంగు వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి?
రంగులన్నింటిలో తెలుపు రంగు స్వచ్ఛతకు, శాంతికి నిదర్శనం. అలాగే తెలుపు రంగు మీద మురికి పడితే వెంటనే కనిపిస్తుంది. దీనివల్ల ఆ టవల్‌ను ఎప్పటికప్పుడు మార్చాల్సి వస్తుంది. ఇది కార్యాలయంలోని క్రమశిక్షణను, అధికారి నిబద్ధతను సూచిస్తుంది. నేడు ఏసీలు, ఆధునిక సౌకర్యాలు ఉన్నా, ఈ సంప్రదాయం ఒక అలవాటుగా మారిపోయింది. పాత తరం అధికారుల నుంచి కొత్త తరం అధికారులకు ఈ సంస్కృతి వారసత్వంగా అందుతోంది. అందుకే, ఆ తెల్లటి టవల్ నేడు భారతీయ ప్రభుత్వ వ్యవస్థలో ఒక విడదీయలేని భాగంగా మారిపోయింది.