Top 10 Hottest Temperatures : బాబోయ్ ఎండలు.. ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రత ఎక్కడో తెలుసా?

Published : Apr 24, 2026, 10:59 PM IST

Top 10 Hottest Temperatures : ప్రపంచంలోనే అత్యంత గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైన టాప్ 10 ప్రాంతాల్లో డెత్ వ్యాలీ టాప్ లో ఉంది. డెత్ వ్యాలీ నుండి కువైట్ వరకు సూర్యుడు తన ప్రతాపం చూపించే ఆ ప్రదేశాల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
17
ఆ ప్రాంతాల్లో ఎండలు మామూలుగా లేవు

ప్రస్తుతం ఎండకాలం కావడంతో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటేశాయి. భానుడి భగభగలకు జనం అల్లాడిపోతున్నారు. సామాన్యుల జీవితం భారంగా మారింది. అయితే, మనకు ఇప్పుడు తగులుతున్న ఎండలు ఒక ఎత్తు అయితే, ప్రపంచ చరిత్రలో కొన్ని ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు చూస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. భూమి మీద ఇప్పటివరకు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదైన టాప్ 10 ప్రాంతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

27
1. ఫర్నేస్ క్రీక్, డెత్ వ్యాలీ (అమెరికా)

ప్రపంచంలోనే అత్యంత వేడి ప్రదేశంగా అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ఫర్నేస్ క్రీక్ (డెత్ వ్యాలీ) మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ 1913 జూలై 10వ తేదీన ఏకంగా 56.7°C (134°F) ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పటి వరకు అధికారికంగా భూమిపై నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే కావడం విశేషం.

2. కెబిలి (ట్యునీషియా)

అత్యంత గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైన జాబితాలో ట్యునీషియాలోని కెబిలి రెండో స్థానంలో ఉంది. 1931 జూలై 7వ తేదీన ఇక్కడ 55°C (131°F) ఉష్ణోగ్రత రికార్డు అయింది. ఆఫ్రికా ఖండంలోనే ఇది అత్యధిక ఉష్ణోగ్రతగా అని చెప్పాలి.

37
3. అహ్వాజ్ (ఇరాన్)

మూడో స్థానంలో ఇరాన్‌లోని అహ్వాజ్ నగరం ఉంది. 2017 జూన్ 29న ఇక్కడ ఉష్ణోగ్రత 54°C (129.2°F) కు చేరుకుంది. ఆధునిక కాలంలో నమోదైన అత్యంత వేడి రోజులలో ఇది ఒకటిగా నిలిచింది.

4. తిరత్ త్స్వి (ఇజ్రాయెల్)

ఇజ్రాయెల్‌లోని తిరత్ త్స్వి ప్రాంతం నాలుగో స్థానంలో ఉంది. 1942 జూన్ 21న ఇక్కడ 54°C (129°F) ఉష్ణోగ్రత నమోదైంది. ఆసియా ఖండంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలలో ఇది ఒకటి.

47
5. మిత్రిబా (కువైట్)

కువైట్‌లోని మిత్రిబా ఐదో స్థానంలో నిలిచింది. 2016 జూలై 21న ఇక్కడ ఉష్ణోగ్రత 53.9°C (129°F) గా నమోదైంది. మధ్యప్రాచ్య దేశాల్లో ఎండలు ఎంత తీవ్రంగా ఉంటాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణ.

6. బస్రా (ఇరాక్)

ఇరాక్‌లోని బస్రా ఆరో స్థానంలో ఉంది. 2016 జూలై 22న ఇక్కడ కూడా కువైట్‌ తరహాలోనే 53.9°C (129°F) ఉష్ణోగ్రత రికార్డు అయింది. కువైట్, ఇరాక్ ప్రాంతాలు వరుస రోజుల్లో ఈ గరిష్ఠ ఉష్ణోగ్రతలను చూశాయి.

57
7. తుర్బత్ (పాకిస్తాన్):

మన పొరుగు దేశమైన పాకిస్తాన్‌లోని తుర్బత్ నగరం ఏడో స్థానంలో ఉంది. 2017 మే 28వ తేదీన ఇక్కడ 53.7°C (128.7°F) ఉష్ణోగ్రత నమోదైంది. ఆ వేసవిలో పాకిస్తాన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

8. అల్ జజీరా బోర్డర్ గేట్ (యూఏఈ)

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అల్ జజీరా బోర్డర్ గేట్ వద్ద 2002 జూలైలో 52.1°C (125.8°F) ఉష్ణోగ్రత నమోదై ఎనిమిదో స్థానంలో నిలిచింది.

67
9. మెక్సికాలి (మెక్సికో):

మెక్సికోలోని మెక్సికాలి నగరం తొమ్మిదో స్థానంలో ఉంది. 1995 జూలై 28న ఇక్కడ 52°C (125.6°F) ఉష్ణోగ్రత రికార్డు అయింది. ఉత్తర అమెరికాలో డెత్ వ్యాలీ తర్వాత అత్యంత వేడి నమోదైన ప్రాంతం ఇదే.

10. జెడ్డా (సౌదీ అరేబియా)

ఈ జాబితాలో పదో స్థానంలో సౌదీ అరేబియాలోని జెడ్డా నగరం ఉంది. 2010 జూన్ 22న ఇక్కడ 52°C (125.6°F) ఉష్ణోగ్రత నమోదైంది.

77
ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణాలేంటి?

భూమిపై ఉష్ణోగ్రతలు ఇలా పెరగడం వెనుక భౌగోళిక కారణాలతో పాటు వాతావరణ మార్పులు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అటవీ ప్రాంతాలు తగ్గడం, కాంక్రీట్ కట్టడాలు పెరగడం వల్ల ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. పైన పేర్కొన్న చాలా ప్రాంతాలు ఎడారి లేదా పాక్షిక ఎడారి ప్రాంతాలు కావడం వల్ల అక్కడ సూర్యుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మధ్యాహ్నం వేళల్లో బయటకు రాకపోవడం, ఎక్కువగా నీళ్లు తాగడం, వదులైన కాటన్ దుస్తులు ధరించడం వంటివి చేయాలి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లో నివసించే వారు వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం మన దేశంలో కూడా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల దిశగా వెళ్తున్న తరుణంలో ఈ ముందస్తు జాగ్రత్తలు ఎంతో అవసరం అని నిపుణులు చెబుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories