Mercy Killing : మనిషి ప్రాణాలు తీసే హక్కు ఎవరికి ఉంది? అసలు కారుణ్య మరణం అంటే ఏమిటి? ప్రపంచ దేశాల్లో దీనిపై ఉన్న భిన్నమైన చట్టాలు, భారతదేశంలో లివింగ్ విల్ నిబంధనల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
మానవ జీవితం ఎంతో విలువైనది. కానీ, కొన్ని పరిస్థితుల్లో బతుకు భారమైనప్పుడు, మరణమే శరణ్యం అనిపిస్తుంది. తీవ్రమైన అనారోగ్యం, భరించలేని నొప్పి.. ఇక కోలుకునే అవకాశం లేదని తెలిసినప్పుడు మనిషి కోరుకునేది ఒక్కటే శాంతి. ఆ శాంతి మరణం రూపంలో వస్తే? దానినే కారుణ్య మరణం అంటారు. వైద్య పరిభాషలో దీనిని యూతనేషియా అంటారు. ఈ కారుణ్య మరణం ఏయే దేశాల్లో చట్టబద్ధం? భారత సుప్రీంకోర్టు దీనిపై ఇచ్చిన చారిత్రాత్మక తీర్పులేంటి?
24
కారుణ్య మరణంలో రకాలు
కారుణ్య మరణాన్ని ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి.
1. యాక్టివ్ యూతనేషియా: ఇక్కడ వైద్యులు రోగికి ప్రాణాంతకమైన ఇంజెక్షన్ లేదా మందులు ఇచ్చి నేరుగా ప్రాణం తీస్తారు. ఇది ప్రపంచంలోని మెజారిటీ దేశాల్లో నేరంగా పరిగణిస్తారు. చాలా దేశాల్లో ఇది లీగల్ కాదు.
2. పాసివ్ యూతనేషియా : ఇందులో రోగిని బతికించడానికి ఇచ్చే కృత్రిమ చికిత్సను నిలిపివేస్తారు.ఉదాహరణకు వెంటిలేటర్, ఫీడింగ్ ట్యూబ్, లైఫ్ సపోర్ట్ ఇవ్వరు. అంటే ప్రకృతి సిద్ధంగా మరణం సంభవించేలా వదిలేయడం. ఈ విషయంలో శరీరం స్పందనలను పరిగణలోకి తీసుకుంటారు.
34
ఏ దేశంలో ఎలా ప్రాణాలు తీస్తారు?
కారుణ్య మరణంపై ఒక్కో దేశానిది ఒక్కో విధానం. నెదర్లాండ్స్, బెల్జియంలలో కఠిన నిబంధనల మధ్య యాక్టివ్ యూతనేషియాకు అనుమతి ఉంది. రోగి పూర్తి స్పృహతో ఉండాలి, కోలుకోలేనంత నొప్పిని అనుభవిస్తూ ఉండాలి. ఇక స్విట్జర్లాండ్ లో అసిస్టెడ్ స్యూసైడ్ ఫేమస్. రోగి స్వయంగా తనే ప్రాణాంతక మందును తీసుకునేలా ఏర్పాట్లు చేస్తారు. దీని కోసం ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు స్విట్జర్లాండ్ వెళ్తుంటారని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే దీనికి పరిమితంగా అనుమతి ఉంది.
2018లో భారత అత్యున్నత న్యాయస్థానం ఒక సంచలన తీర్పునిచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం వ్యక్తికి గౌరవంగా మరణించే హక్కు కూడా ఉందని పేర్కొంది. ఇందులో భాగంగా లివింగ్ విల్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం, ఒక వ్యక్తి తాను స్పృహలో ఉన్నప్పుడే.. భవిష్యత్తులో తనకు నయం కాని వ్యాధి వస్తే లేదా తాను కోమాలోకి వెళ్తే, కృత్రిమంగా తనను బతికించవద్దని ముందుగానే లిఖితపూర్వక విజ్ఞప్తి చేయవచ్చు.
భారతదేశంలో కారుణ్య మరణం గురించి చర్చ వస్తే మొదట గుర్తొచ్చే పేరు అరుణా షాన్‌బాగ్. 1973లో ముంబైలోని కేఈఎం ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న ఆమెపై జరిగిన దారుణమైన అఘాయిత్యం ఆమె జీవితాన్ని ఛిద్రం చేసింది. మెడకు చైన్ బిగించి దాడి చేయడంతో మెదడుకు ఆక్సిజన్ అందక ఆమె పర్సిస్టెంట్ వెజిటేటివ్ స్టేట్ లోకి వెళ్ళిపోయారు. దాదాపు 42 ఏళ్ల పాటు ఆమె కేవలం బెడ్‌పై ఒక జీవచ్ఛవంలా ఉండిపోయారు. ఆమె స్నేహితురాలు పింకీ విరానీ అరుణకు విముక్తి ప్రసాదించాలని కోర్టును ఆశ్రయించగా, 2011లో సుప్రీంకోర్టు మొదటిసారిగా పాసివ్ యూతనేషియా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.