USA: మన దగ్గర తాగి బండి నడిపితే ఏం జరుగుతుందో అందరికి తెలుసు? డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు ఎలా జరుగుతాయి.. అనేది అందరికి అనుభవమే. కానీ అమెరికాలో డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తే ఏం జరుగుతుంది? ఏం చేస్తారు? శిక్షలు ఎలా ఉంటాయి?
అమెరికాలో డ్రైవింగ్ చేయడం అనేది కేవలం ఒక సౌకర్యం మాత్రమే కాదు, అది అత్యంత బాధ్యతతో కూడుకున్న విషయం. ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలో ట్రాఫిక్ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ముఖ్యంగా మద్యం సేవించి వాహనం నడిపే విషయంలో అమెరికా ప్రభుత్వం- పోలీసులు "జీరో టాలరెన్స్" వైఖరిని అవలంబిస్తారు. సోషల్ మీడియాలో నిత్యం చూస్తున్నట్లుగా, అమెరికాలో మద్యం తాగి డ్రైవింగ్ చేస్తూ దొరికిపోతే జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది.
25
బాడీ-క్యామ్ రికార్డింగ్
అమెరికాలో మద్యం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు చిక్కితే అక్కడ సర్దుబాట్లు ఉండదు, రాజీపడే అవకాశమే లేదు. వారితో వాదించడం, గొడవపడటం లాంటివి చేయకూడదు. చేస్తే విషయం ఇంకా సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది. పోలీసులు కారును ఆపిన క్షణం నుంచే తమ 'బాడీ కెమెరా' (Body Cam) ఆన్ చేసి ప్రతీ విషయాన్ని రికార్డ్ చేస్తారు. సస్పెక్ట్‌కు నేలపై నడవమని చెప్పడం (Field Sobriety Test) లేదా బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహిస్తారు. రక్తంలో ఆల్కహాల్ శాతం (BAC) 0.08% లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, అక్కడికక్కడే చేతులకు సంకెళ్లు (Handcuffs) వేసి అరెస్ట్ చేస్తారు. వాహనాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తారు.
35
భారీ జరిమానాలు - జైలు శిక్ష
DUI కేసు నమోదైతే మొదటిసారి నేరానికి కూడా భారీగా ఫైన్ తో పాటు క్రిమినల్ శిక్షలు పడతాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ నేరం తీవ్రతను బట్టి $1,000 నుండి $10,000 డాలర్ల వరకు జరిమానా విధిస్తారు. అంతే కాదు మొదటిసారి నేరానికైనా కొన్ని రోజుల నుండి కొన్ని నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఒకవేళ మద్యం మత్తులో యాక్సిడెంట్ జరిగి ఎవరికైనా గాయాలైతే అది 'ఫెలోని' (Felony) నేరంగా మారి ఏళ్ల తరబడి జైలు శిక్షకు దారితీస్తుంది. కేసు వాదించడానికి లాయర్ల ఫీజులు, కోర్టు ఖర్చులకు మరో $5,000 నుండి $15,000 వరకు అయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.
డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారా?
DUI కేసు పడిన వెంటనే సదరు వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ కొన్ని నెలల నుండి సంవత్సరాల పాటు రద్దవుతుంది. లైసెన్స్ పునరుద్ధరించుకోవాలంటే కోర్టు ఆదేశాల ప్రకారం కారులో 'ఇగ్నిషన్ ఇంటర్‌లాక్ డివైజ్' (Ignition Interlock Device) అమర్చుకోవాలి. ఈ పరికరంలో ఊదితే ఆల్కహాల్ లేదని తేలితేనే కారు స్టార్ట్ అవుతుంది. దీని నెలవారీ నిర్వహణ ఖర్చు కూడా వాహనదారుడే భరించాలి.
అమెరికాలో నివసిస్తున్న భారతీయ విద్యార్థులు ఉద్యోగులు (H-1B, L-1) DUI కేసుల్లో ఇరుక్కుంటే వారి వీసా స్టేటస్ తీవ్ర ప్రమాదంలో పడుతుంది. U.S. స్టేట్ డిపార్ట్‌మెంట్ నిబంధనల ప్రకారం DUI అరెస్ట్ కాగానే వీసా ఆటోమేటిక్‌గా రద్దయ్యే (Visa Revocation) అవకాశం ఉంటుంది. తిరిగి భారతదేశం వచ్చినప్పుడు వీసా స్టాంపింగ్ కావడం అత్యంత కష్టమవుతుంది. అంతేకాకుండా, గ్రీన్ కార్డ్ (PR) లేదా పౌరసత్వం పొందడంలో శాశ్వత అవరోధాలు ఏర్పడతాయి. భవిష్యత్తులో మంచి ఉద్యోగం రావడం కూడా కష్టమవుతుంది.
55
నేరం మాత్రమే కాదు
అమెరికాలో "డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం" అనేది కేవలం చట్టపరమైన నేరం మాత్రమే కాదు, అది మీ కెరీర్, ఆర్థిక స్థితి , భవిష్యత్తు ఆశయాలను నాశనం చేసే ఒక పెద్ద ప్రమాదం. అందుకే మద్యం సేవించినప్పుడు డ్రైవింగ్ చేయకుండా ఊబర్ (Uber), లైఫ్ట్ (Lyft) వంటి క్యాబ్ సేవలను ఉపయోగించడం లేదా ఆల్కహాల్ తీసుకోని స్నేహితుడిని (Designated Driver) వాహనం నడపమని చెప్పడం ఏకైక సురక్షితమైన మార్గం.