ఒక చిన్న స్పెర్మ్ నుంచి పూర్తి మనిషి ఎలా తయారవుతాడు.? అసలు ప్రక్రియ తెలిస్తే ఆశ్చర్యపోతారు

Published : Nov 10, 2026, 08:55 PM IST

Sperm: మనిషి పుట్టుక వెనుక ప్రకృతి సృష్టించిన అద్భుతమైన ప్రక్రియ ఉంటుంది. ఒక చిన్న స్పెర్మ్ (శుక్రకణం), మహిళలోని అండంతో కలిసినప్పుడు కొత్త జీవి ఏర్పడే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఒకే ఒక్క కణం నుంచి పూర్తి మనిషి ఎలా ఏర్పడతాడో తెలుసుకుందాం.

PREV
15
పురుషుడి శరీరంలో స్పెర్మ్ ఎక్కడ తయారవుతుంది?

పురుషుల శరీరంలో స్పెర్మ్ తయారయ్యే ప్రక్రియ వృషణాల్లో (Testes) జరుగుతుంది. వృషణాల్లో ఉండే ప్రత్యేకమైన చిన్న గొట్టాల వంటి నిర్మాణాలను సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ అంటారు. వీటిలో స్పెర్మ్ కణాలు నిరంతరం తయారవుతుంటాయి. యుక్తవయస్సు వచ్చిన తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. స్పెర్మ్ తయారైన వెంటనే పూర్తిగా పరిపక్వం చెందదు. మొదట ఎపిడిడిమిస్ (Epididymis) అనే భాగానికి చేరుకుంటుంది. అక్కడ కొంతకాలం ఉండి పరిపక్వత పొందుతుంది. ఈ సమయంలో స్పెర్మ్‌కు కదిలే సామర్థ్యం కూడా అభివృద్ధి చెందుతుంది. పురుషుడి శరీరంలో ప్రతిరోజూ లక్షల సంఖ్యలో స్పెర్మ్‌లు తయారవుతుంటాయి.

25
స్పెర్మ్ మహిళ అండం దగ్గరకు ఎలా చేరుతుంది?

పురుషుడు లైంగిక చర్య సమయంలో వీర్యాన్ని (Semen) బయటకు విడుదల చేస్తాడు. వీర్యంలో లక్షల నుంచి కోట్ల సంఖ్యలో స్పెర్మ్‌లు ఉంటాయి. ఇవి గర్భాశయంలోకి ప్రవేశిస్తాయి. అక్కడి నుంచి ఫెలోపియన్ ట్యూబ్స్ (Fallopian Tubes) వైపు ప్రయాణిస్తాయి. మహిళ అండాశయాల నుంచి విడుదలైన అండం ఫెలోపియన్ ట్యూబ్‌లోకి చేరుతుంది. స్పెర్మ్‌లు ఈ అండాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తాయి. అయితే అన్ని స్పెర్మ్‌లు అక్కడికి చేరుకోలేవు. చాలావరకు మార్గమధ్యంలోనే నశిస్తాయి. చివరకు కొన్నే అండం దగ్గరకు చేరుకోగలుగుతాయి. వాటిలో సాధారణంగా ఒక స్పెర్మ్ మాత్రమే అండంలోకి ప్రవేశించి ఫలదీకరణ ప్రక్రియను పూర్తి చేస్తుంది.

35
స్పెర్మ్, అండం కలిస్తే ఏం జరుగుతుంది?

ఒక స్పెర్మ్ మహిళ అండంతో కలిసినప్పుడు ఫలదీకరణ (Fertilization) జరుగుతుంది. ఈ సమయంలో స్పెర్మ్‌లోని 23 క్రోమోజోములు, అండంలోని 23 క్రోమోజోములతో కలుస్తాయి. దీంతో మొత్తం 46 క్రోమోజోములతో ఒక కొత్త కణం ఏర్పడుతుంది. దీనినే జైగోట్ (Zygote) అంటారు. ఈ జైగోట్‌లో భవిష్యత్తులో ఏర్పడబోయే శిశువుకు సంబంధించిన జన్యు సమాచారం ఉంటుంది. అంటే శిశువు శరీర నిర్మాణం, కళ్ల రంగు, జుట్టు లక్షణాలు, శరీరానికి సంబంధించిన అనేక అంశాలపై ప్రభావం చూపే జన్యువులు ఇందులో ఉంటాయి. తల్లి నుంచి సగం, తండ్రి నుంచి సగం జన్యు సమాచారం అందుతుంది.

45
ఒక్క కణం నుంచి శరీరంలోని అవయవాలు ఎలా తయారవుతాయి?

ఫలదీకరణ తర్వాత ఏర్పడిన జైగోట్ కణ విభజన ప్రారంభిస్తుంది. మొదట రెండు కణాలుగా, ఆ తర్వాత నాలుగు, ఎనిమిది.. ఇలా క్రమంగా కణాల సంఖ్య పెరుగుతుంది. ఈ కణాలు విభజించుకుంటూ పిండంగా (Embryo) అభివృద్ధి చెందుతాయి. కొన్ని రోజుల తర్వాత ఈ పిండం గర్భాశయ గోడకు అతుక్కుంటుంది. దీనిని ఇంప్లాంటేషన్ అంటారు. ఆ తర్వాత కణాలు వేర్వేరు పనులకు అనుగుణంగా ప్రత్యేక రూపాలను సంతరించుకుంటాయి. కొన్ని కణాలు మెదడు, నాడీ వ్యవస్థగా.. మరికొన్ని గుండె, ఊపిరితిత్తులు, ఎముకలు, కండరాలుగా అభివృద్ధి చెందుతాయి. గర్భధారణ ప్రారంభ దశలోనే గుండె, మెదడు, వెన్నుపాము వంటి ముఖ్యమైన అవయవాల నిర్మాణం మొదలవుతుంది. ఆ తర్వాత వాటి ఎదుగుదల కొనసాగుతుంది. ఇలా ఒకే ఒక్క కణంతో మొదలైన ప్రయాణం క్రమంగా పూర్తి శరీర నిర్మాణానికి దారితీస్తుంది.

55
తొమ్మిది నెలల్లో శిశువు ఎలా పూర్తిగా అభివృద్ధి చెందుతుంది?

గర్భధారణ సమయంలో శిశువు ఎదుగుదల మూడు ప్రధాన దశల్లో కొనసాగుతుంది. మొదటి మూడు నెలల్లో మెదడు, గుండె, చేతులు, కాళ్లు వంటి ముఖ్యమైన శరీర భాగాల నిర్మాణం ప్రారంభమవుతుంది. ఈ దశలోనే పిండం ఆకారం స్పష్టంగా మారుతుంది. రెండో మూడు నెలల్లో శిశువు ఎముకలు, కండరాలు బలపడతాయి. చేతులు, కాళ్లు కదిలించడం ప్రారంభిస్తుంది. ఈ సమయంలో తల్లి కూడా శిశువు కదలికలను గుర్తించగలుగుతుంది. మూడో మూడు నెలల్లో శిశువు బరువు పెరుగుతుంది. మెదడు, ఊపిరితిత్తులు సహా ఇతర అవయవాలు మరింత అభివృద్ధి చెందుతాయి. పుట్టిన తర్వాత బయట ప్రపంచంలో జీవించడానికి శరీరం సిద్ధమవుతుంది. సాధారణంగా గర్భధారణ కాలం చివరి నెలసరి మొదటి రోజు నుంచి లెక్కిస్తే సుమారు 40 వారాలు ఉంటుంది. ఈ కాలం పూర్తయ్యే సరికి శిశువు జననానికి సిద్ధమవుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories