
మన భారతదేశంలో ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. కానీ కొన్ని కట్టడాలు చూస్తే 'అసలు ఆ కాలంలోనే ఇలాంటి టెక్నాలజీ ఎలా సాధ్యమైంది?' అనే ప్రశ్నలు వస్తుంటాయి. సరిగ్గా అలాంటి ఒక మైండ్ బ్లోయింగ్ కట్టడమే ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్న లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయం. శిల్పుల అద్భుత సృష్టికి, విజయనగర రాజుల శిల్పకళా వైభవానికి ఈ గుడి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.
ఈ ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే అడుగడుగునా మన భారతీయుల పురాతన సంస్కృతి, అరుదైన ఫ్రెస్కో వర్ణచిత్రాలు, రామాయణ, మహాభారత ఘట్టాలు కనిపిస్తాయి. ఈ అసాధారణమైన శిల్పకళా నైపుణ్యాల వల్లే లేపాక్షి ఆలయం యునెస్కో (UNESCO) ప్రపంచ వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాలో స్థానం సంపాదించుకుంది.
లేపాక్షి ఆలయంలో ముఖ్యంగా నాట్యమండపాన్ని దాదాపు 70 స్తంభాలతో నిర్మించారు. కానీ అందులో అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే.. ఆగ్నేయ దిశలో ఉండే ఒకే ఒక్క స్తంభం అసలు నేలకు ఆనదు.. అవును, మీరు చదివింది నిజమే. ఈ స్తంభానికి, నేలకు మధ్య సుమారు పావు అంగుళం ఖాళీ ఉంటుంది.
అంటే ఈ భారీ రాతి స్తంభం గాలిలో తేలుతూ, పైకప్పు నుంచి కిందకు వేలాడుతున్నట్లు కనిపిస్తుంది. అక్కడికి వెళ్లే భక్తులు, టూరిస్టులు ఈ వింతను స్వయంగా పరీక్షించడానికి స్తంభం కింద నుంచి ఒక పలుచని గుడ్డను లేదా క్లాత్‌ను ఒకవైపు నుంచి ఇంకోవైపుకు సులువుగా తీస్తారు. గురుత్వాకర్షణ సిద్ధాంతానికే సవాల్ విసురుతున్న ఈ పిల్లర్ నిజంగా ఒక అద్భుతమే అని చెప్పాలి.
స్వాతంత్య్రానికి పూర్వం, అంటే 1903 ప్రాంతంలో హామిల్టన్ అనే ఒక బ్రిటీష్ ఇంజనీర్ ఈ స్తంభం వెనుక ఉన్న మిస్టరీని ఛేదించాలని అనుకున్నాడు. అసలు ఆధారమే లేకుండా ఒక స్తంభం పైకప్పును ఎలా మోస్తుందో చూద్దామని, దాన్ని బలవంతంగా పక్కకు జరిపి నేలకు ఆనించే ప్రయత్నం చేశాడు. కానీ ఆయన ఆ స్తంభాన్ని కొద్దిగా కదిలించగానే ఊహించని షాక్ తగిలింది.. ఆ ఒక్క స్తంభం కదలగానే నాట్యమండపంలోని మిగతా 69 స్తంభాల పైభాగాలు కూడా కదిలిపోయాయి.
మధ్యలో ఉన్న భృంగీశ్వరుడు, భిక్షాటన మూర్తి శిల్పాలున్న స్తంభాలు పైభాగంలో బాగా దగ్గరకు వచ్చేసాయి. మొత్తం మండపమే కూలిపోతుందేమోనన్న భయంతో ఆ ఇంజనీర్ తన ప్రయత్నాన్ని మధ్యలోనే ఆపేసి వెనక్కి తగ్గాడు. నాట్యమండప భారాన్ని మొత్తం బ్యాలెన్స్ చేసే కీలకమైన పిల్లర్ అదేనని ఆయన గ్రహించాడు. ఇప్పటికీ ఆ ఇంజనీర్ జరిపిన గుర్తును, కదిలిన స్తంభాల దిశను మనం అక్కడికి వెళ్తే గమనించవచ్చు.
అసలు నాటి శిల్పులు ఈ స్తంభాన్ని నేలకు ఆనకుండా గాలిలో ఎందుకు ఉంచారు? దీని వెనుక ఉన్న అసలు సైన్స్ ఏంటి? అనే దానికి సైంటిస్టులు ఒక ఆసక్తికరమైన వివరణ ఇస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు వంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు నిర్మాణంలో ఏర్పడే ప్రకంపనల వల్ల నాట్యమండపం దెబ్బతినకుండా ఉండేందుకు దీన్ని ఒక షాక్ అబ్జార్బర్ లేదా బ్యాలెన్సింగ్ పిల్లర్ లాగా డిజైన్ చేశారు.
ప్రమాదం జరిగినప్పుడు ఈ వేలాడే స్తంభం బరువును సమానంగా పంచుకుని, కిందకు ఆని, మొత్తం కట్టడం కూలిపోకుండా రక్షణ గోడలా నిలబడుతుంది. నాటి కట్టడాల్లో సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలో పడటం ఎంతటి ఇంజనీరింగ్ అద్భుతమో, లేపాక్షిలోని ఈ బ్యాలెన్సింగ్ సిస్టమ్ కూడా అంతే గొప్ప సాంకేతిక విజ్ఞానానికి నిదర్శనం.
లేపాక్షికి ఆ పేరు ఎలా వచ్చిందో చెప్పే స్థల పురాణం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. రావణాసురుడు సీతమ్మవారిని అపహరించి ఆకాశ మార్గాన లంకకు తీసుకువెళ్తుండగా, జటాయువు అనే పక్షి రాజు రావణుడిని అడ్డుకుని భీకరంగా పోరాడుతుంది. ఆ పోరాటంలో రెక్కలు తెగి తీవ్రంగా గాయపడిన జటాయువు ఈ ప్రదేశంలోనే కింద పడిపోతుంది. సీతాన్వేషణలో అక్కడకు వచ్చిన శ్రీరాముడు, గాయపడిన జటాయువును చూసి జాలితో "లే.. పక్షి" అని సంబోధించి మోక్షం ప్రసాదించాడని పురాణాలు పేర్కొంటున్నాయి. అలా 'లే పక్షి' అనే పదమే కాలక్రమేణా 'లేపాక్షి'గా మారింది.
16వ శతాబ్దంలో విజయనగర రాజుల దగ్గర పనిచేసిన విరుపన్న, వీరన్న అనే సోదరులు ఈ వీరభద్రాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అగస్త్య మహర్షి ఇక్కడ పాపనాశేశ్వర స్వామిని ప్రతిష్ఠించారని, ఆయనకు ఎదురుగా రఘునాథమూర్తి ఉంటారని ప్రతీతి. ఇక ఆలయానికి దాదాపు 200 మీటర్ల దూరంలో ఒక చిన్న గుట్టపై చెక్కిన అతిపెద్ద 'ఏకశిలా నంది' విగ్రహం ఠీవీగా కూర్చున్న భంగిమలో కనిపిస్తుంది. 15 అడుగుల ఎత్తు, 22 అడుగుల పొడవు ఉండే ఈ బసవయ్య విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా నందులలో ఒకటిగా పేరుగాంచింది. అలాగే ఆలయంలో ఉండే ఏడు పడగల భారీ నాగేంద్రుడి శిల్పం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.