Published : Aug 04, 2026, 10:57 AM ISTUpdated : Aug 04, 2026, 11:15 AM IST
సొంత ఇల్లు కట్టుకోవాలనే కలను నెరవేర్చుకోవడానికి చాలామంది హోమ్ లోన్ తీసుకుంటారు. కానీ లోన్ గడువు ముగియకముందే అప్పు తీసుకున్న వ్యక్తి చనిపోతే పరిస్థితి ఏంటి? ఆ అప్పు ఎవరు కట్టాలి? హోంలొన్ కి ఇన్సూరెన్స్ ఉంటుందా? ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుందాం.
హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే బ్యాంకులు ఏం చేస్తాయి?
సొంత ఇల్లు అనేది చాలామందికి జీవితకాలపు కల. ధనవంతులకు ఇది పెద్ద విషయం కాదు కానీ సామాన్య పేద, మధ్యతరగతి ప్రజలకు ఇల్లు కట్టడం చాలా పెద్ద విషయం... అందుకే ''ఇల్లు కట్టిచూడు, పెళ్లి చేసిచూడు'' అని పెద్దలు అనేవారు. అంటే జీవితంలో ఇల్లు కట్టడం, పెళ్లి చేయడం చాలా కష్టతరమైన పనులన్నమాట… వీటికి భారీగా డబ్బులు ఖర్చు అవడమే కాదు శారీరక, మానసిక శ్రమ ఉంటుంది.
అయితే ఇటీవల కాలంలో ఇల్లు కట్టడం చాలా ఈజీ అయిపోయింది. ఇల్లు కట్టుకోడానికి బ్యాంకులు లోన్ ఇస్తున్నాయి, కాంట్రాక్టర్లు మనకు కష్టం లేకుండానే రెడీ చేసి ఇస్తున్నారు... ఇంకేముంది నేరుగా ఫ్యామిలీతో ఇంట్లోకి వెళ్లడమే. కొత్త ఇంటి కలను నెరవేర్చుకోవడం హోమ్ లోన్ తో చాలా ఈజీ అయిపోయింది.
ఇటీవల కాలంలో ఉద్యోగులు, వ్యాపారులు తమ ఆదాయాన్ని బట్టి 15 నుంచి 30 ఏళ్ల కాలపరిమితితో బ్యాంకుల్లో హోమ్ లోన్లు తీసుకోవడం సాధారణమైపోయింది. అయితే ఇక్కడ మనందరికి ఒక డౌట్ వస్తుంది... 15-30 ఏళ్లు అంటే చాలా ఎక్కువ కాలం... ఈ మధ్యలో ఊహించని విధంగా హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే?
25
బ్యాంకు ఇంటిని వేలం వేయగలదా?
హోంలోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే వారి వారసులు అప్పు చెల్లించాలి. అంటే హోంలోన్ EMI యధావిధిగా కొనసాగించాలి. ఒకవేళ చాలాకాలం పాటు లోన్ చెల్లించకుండా, వాయిదాలు కట్టడం మానేస్తే బ్యాంకు చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. తాకట్టు పెట్టిన ఆస్తిని స్వాధీనం చేసుకుంటుంది. అవసరమైన చట్టపరమైన ప్రక్రియల తర్వాత ఆస్తిని వేలం వేయవచ్చు. వేలం ద్వారా వచ్చిన డబ్బుతో బకాయిలను రాబట్టుకుని, మిగిలిన మొత్తం ఉంటే చట్టపరమైన హక్కుదారులకు అందిస్తారు.
35
జాయింట్ హోమ్ లోన్ (Joint Home Loan) అంటే ఏమిటి?
భార్యాభర్తలు లేదా కుటుంబ సభ్యులు కలిసి జాయింట్ హోమ్ లోన్ తీసుకోవచ్చు. అంటే హోమ్ లోన్ ఇద్దరి పేరుమీద ఉంటుంది. కాబట్టి ఈ ఇద్దరిలో ఎవరు మరణించినా లోన్ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. లోన్ అగ్రిమెంట్ ప్రకారం EMI లు చెల్లించాల్సిన బాధ్యత రెండో వ్యక్తిపై ఉంటుంది. లోన్ కాలం పూర్తవకముందే ఇద్దరూ చనిపోతే వారి చట్టపరమైన వారసులు లోన్ చెల్లించాలి.
చాలా బ్యాంకులు హోమ్ లోన్‌తో పాటు హోమ్ లోన్ ప్రొటెక్షన్ ప్లాన్ (HLPP) లేదా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే అవకాశం కల్పిస్తాయి. ఇలాంటి భీమా ఉంటే హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తి మరణించినా కుటుంబంపై ఆర్థికభారం పడదు. నిబంధనలకు లోబడి ఇన్సూరెన్స్ కంపెనీయే లోన్ మొత్తాన్ని చెల్లిస్తుంది. హోమ్ లోన్ ఇన్సూరెన్స్ షరతులు కంపెనీ, పాలసీని బట్టి మారుతూ ఉంటాయి.
ఒకవేళ ఎలాంటి ఇన్సూరెన్స్ లేకపోతే బ్యాంకు సాధారణంగా చట్టపరమైన వారసులను లేదా ఆస్తిని పొందిన వారిని సంప్రదిస్తుంది. వారే లోన్ చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకు నిబంధనల ప్రకారం లోన్‌ను పునర్‌వ్యవస్థీకరించడం లేదా పేరు మార్పు చేయడం జరగవచ్చు.
55
హోమ్ లోన్ ముందస్తు ప్రణాళిక ఎందుకు ముఖ్యం?
హోమ్ లోన్ తీసుకునేటప్పుడే తగినంత లైఫ్ ఇన్సూరెన్స్ లేదా హోమ్ లోన్ ఇన్సూరెన్స్ తీసుకోవడం గురించి ఆలోచించడం మంచిది. ఇది ఊహించని పరిస్థితుల్లో కుటుంబానికి ఆర్థిక భద్రతను ఇస్తుంది. మీరు ఎంతో ప్రేమించే మీ కుటుంబానికి ఇబ్బందుల నుండి బయటపడేస్తుంది.
గమనిక : ప్రతి బ్యాంకు లోన్ అగ్రిమెంట్, ఇన్సూరెన్స్ పాలసీ, చట్టపరమైన పరిస్థితులు వేర్వేరుగా ఉండవచ్చు. మీ లోన్‌కు వర్తించే నిబంధనలను తెలుసుకోవడానికి సంబంధిత బ్యాంకు లేదా ఆర్థిక సలహాదారుని సంప్రదించడం ఉత్తమం.