అతి సమాచారం ప్రమాదకరం.. 'ఇన్ఫోబేసిటీ' రోగం ఖాయం..!

Published : Feb 07, 2026, 05:53 PM IST

మెదడుకు ఎక్కువగా సమాచారం అందించడం చాలా ప్రమాదకరం. దీనివల్ల ‘ఇన్ఫోబేసిటీ’ రోగం వస్తుంది. ప్రస్తుత సమాజంలో అత్యధికులు ఈ అతి సమాచార రోగంతోనే బాధపడుతున్నారు.   

PREV
15
మెదడుకు అతి సమాచారం వద్దు..

డిజిటల్ యుగంలో రోజంతా వాట్సాప్ , సోషల్ మీడియా, వెబ్సైట్స్ ద్వారా జిగాబైట్ల సమాచారం బుర్రలోకి పంపిస్తున్నారు.

దీని వల్ల మెదడు అలసిపోతుంది.

ఏది నిజమో? ఏది అబద్దమో? ఏది ముఖ్యమో? ఏది అప్రస్తుతమో? తెలియకుండా పోతుంది.

దీన్నే ఇన్ఫోబేసిటీ అంటారు.

నేటి సమాజంలో అధికులు అతిసమాచార రోగగ్రస్తులే.

మనిషికి ఇంగితజ్ఞానం పోయినప్పుడు మోసగాళ్లకు పండగే.

ఈజీగా మోసం చేసేస్తారు.

మీకు ఒక ఉదాహరణ..

ప్రభుత్వం అధికారికంగా "డిజిటల్ అరెస్ట్ అనేదే లేదు" అని పదేపదే చెప్పినా పగటి వేషం వేసుకొని ఎవడో గొట్టంగాడు ఫోన్ చెయ్యగానే భయపడిపోయి ఆస్తులు దారబోసుకొంటున్నారు.

కావాలి కుశాగ్ర బుద్ధి..!

అనవసరమయిన దాన్ని చదవకూడదు/ చూడకూడదు.

విన్న/ కన్న దాన్ని వెంటనే నమ్మకూడదు.

వినినంతనే వేగపడక వివరింపతగున్.

క్రిటికల్ థింకింగ్ అంటే సత్య శోధన.

సత్య శోధన , సత్య సాధన .. నిరంతరం జరగాలి

లేకుంటే ఈ డిజిటల్ యుగంలో బతుకు గల్లంతే .

25
అమ్మ నేర్పిన పాఠం

బాల్యంలో జరిగిన ఒక సంఘటన వివరిస్తాను .

మా అమ్మానాన్న ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు. గ్రామంలో నివాసం.

ఒక సారి దారిలో వెళుతూ ఒక వ్యక్తి ఇంటిదగ్గరకు వచ్చి .. తన పర్సును ఎవరో కొట్టేసారు .. తినడానికి తిండి లేదు .. ఇంటికి పోవాలంటే చార్జీలకు డబ్బులు లేవు అన్నాడు .

సినిమాల్లో గుమ్మడిలాంటోడు మా నాన్న బోళాతనం .. గుడ్డిగా నమ్మేస్తాడు . జాలి గుండె .

వెంటనే పది రూపాయిలు { ఆ రోజుల్లో పది అంటే .. ఇప్పుడు వెయ్యి } ఇచ్చేసాడు .

కాసేపటికి మా అమ్మ వచ్చి " వాడి పర్సు ను టౌన్ లో ఎవడో కొట్టేస్తే 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఈ వూరికి ఎందుకు వచ్చినట్టు ? ఏదైనా పని చేసేముందు కనీసం ఒక సారి ఆలోచించాలి కదా ?" అంది .

అది నా మనసులో బలంగా నాటుకొని పోయింది .

దీనికి తోడు నేను బాల్యంలో తెనాలి రాముడు , అక్బర్- బీర్బల్ లాంటి కథల్ని తెగ చదివే వాడిని .

ఒక సారి ఆలోచించండి . ఇన్ని వేలమందితో వ్యవహరిస్తున్నాను . ఎన్ని సార్లు మోసగాళ్లు తారసపడివుంటారు ?

మోసం చేసే ప్రయత్నాలు ఎన్ని జరిగి ఉంటాయి ?

జీవితం లో ఒక్కసారి కూడా మోసపోలేదు .

ఇప్పుడైతే కారులో ప్రయాణం .

ఒకప్పుడు సిటీ బస్సులు, రైళ్లు .. నా పాకెట్ ను ఎవడూ కొట్టేయలేదు .

కారణం .. క్రిటికల్ థింకింగ్ .... జాగ్రత్తలు తీసుకోవడం .

35
క్రిటికల్ థింకింగ్ అవసరం...

క్రిటికల్ థింకింగ్ ఎలా సాధన చెయ్యాలో మీకు ఒక ఉదాహరణ . న్యూస్ రిపోర్టర్స్ గ్రూప్ లో వచ్చిన ఒక ఐటెం ను ఇదిగో కాపీ పేస్ట్ చేస్తున్నా. బాగా చదవండి .

*_లక్ష రూపాయల సాఫ్ట్ వేర్ ఉద్యోగం.. 26 ఏళ్ల అమ్మాయి..అమ్మపై బెంగతో ఆత్మహత్య_*

_హైదరాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ నెలకు లక్షరూపాయలు సంపాదిస్తూ హాయిగా జీవితం ఎంజాయ్ చేయాల్సిన అమ్మాయి హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది._

_పెళ్లి చేసుకుంటే అనారోగ్యంతో ఉన్న తన తల్లి.. ఎక్కడ ఒంటరై పోతుందేమోనని బెంగతో ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలిచివేస్తోంది._

_అసలేం జరిగిందంటే..?_

_ఆదివారం హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్న యువతిని పోలీసులు సోమవారం ట్రేస్ అవుట్ చేశారు. లేక్ ఇన్స్పెక్టర్ ఆర్. వెంకటేశ్వర్లు వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ బైంసాకు చెందిన విజయలక్ష్మి (26) తన తండ్రి చనిపోవడంతో తల్లితో కలిసి కూకట్పల్లిలోని మోతి నగర్లో అద్దెకు ఉంటోంది. ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ నెలకు లక్ష రూపాయల జీతం తీసుకుంటోంది._

_తల్లి పూర్తిగా అనారోగ్యంతో ఉండడంతో ఆమె బాగోగులు చూసుకుంటోంది. కజిన్ బ్రదర్స్ వీరికి అండగా ఉంటూ విజయలక్ష్మికి పెండ్లి సంబంధాలు చూస్తున్నారు. దీంతో 'నేను పెండ్లి చేసుకుని వెళ్లిపోతే తల్లికి చాలా ఇబ్బంది అవుతుంది' అనే ఆలోచనతో ఆమె అనేకసార్లు మదన పడేదని బాధిత కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో ఏం చేయాలో తెలియక తన ల్యాప్టాప్లో 'ఆత్మహత్య ఎలా చేసుకోవాలి' అని సెర్చ్ చేసింది._

_జనవరి 31న రాపిడో టూ వీలర్ బుక్ చేసుకుని మధ్యాహ్నం 12:30 గంటలకు ట్యాంక్ బండ్ చేరుకుని అన్నమయ్య విగ్రహం వద్ద హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె కజిన్బ్రదర్స్ కూకట్‌పల్లి పీఎస్లో ఫిర్యాదు చేయగా, డెడ్బాడీని ట్రేస్ చేశారు. ల్యాప్టాప్లో ఆత్మహత్య ఎలా చేసుకోవాలనే సెర్చ్ కనిపించినట్లు లేక్ పోలీసులు తెలిపారు. తల్లి అనారోగ్యం, పెండ్లి సంబంధాలు మానసిక బాధతో విజయలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు._

చదివారు కదా ?

మీకు ఏదైనా తేడా అనిపిస్తోందా ?

పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే తల్లి ఒంటరి అవుతుందా ?

"మా అమ్మను నా దగ్గరే ఉంచుకొంటాను . ఈ కండిషన్ కు ఒప్పుకొంటేనే పెళ్లి ".. అని చెప్పవచ్చు .

ఎంతో మంది యువకులు పెళ్లి కాకుండా ఉన్న స్థితి . ఇలాంటి కండిషన్ ను ఒప్పుకొంటారు .

పోనీ .. దగ్గర్లో కాపురం పెట్టుకొని తరచూ తల్లిని కలవవచ్చు .

పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే తల్లి ఒంటరి అయిపోతుందని ఏకంగా ఆత్మహత్య చేసుకొంది . మరి ఇప్పుడు తల్లి ఒంటరి కాలేదా ? ఎదిగిన కూతురు ఆత్మహత్య చేసుకొంటే ఆ దుఃఖాన్ని ఆమె తట్టుకోలేక ఆరోగ్యంపైకి తెచ్చుకోదా ?

ఏదో తేడా ఉంది కదా ?

ఈ న్యూస్ లో ఏదో తప్పు ఉంది .

న్యూస్ సరైనది అయితే .. ఆమె ఆలోచనల్లో తప్పు ఉంది.

నిజంగా ఏమైంది ?

తెలుసుకోవాల్సిన అవసరం మనకు లేదు .

వ్యక్తుల జీవితాల్లోకి తొంగి చూడడం ఒక రకమయిన మానసిక రోగం . అతిసమాచార రోగానికి ఇదొక పార్శ్వము .

అందుకే యూట్యూబ్ చానెల్స్ వారు .. వెబ్ సైట్స్ వారు . ఇలాంటి వాటిని వండివారుస్తుంటారు .

45
సంచలనాలు వద్దు...

ఒక సంచలన ఘటన .

వెంటనే వండి వార్పులు .

వివాదాలు .. పనీ పాటా లేకుండా చేతిలో సొల్లు ఫోన్ పట్టుకొని అదే పనిగా చూడడం .. కామెంట్స్ చెయ్యడం ..

కన్నడ శ్రీధర్ ఘటన .. అటుపై తల్లీబిడ్డల ఆత్మహత్య .. బహుశా ఇప్పుడు ఈ ఘటన .

సంచలన వార్తలతో ఒంటికి వాతలు పెట్టుకొవడమేనా ?

ఏమిరా బాలరాజు ! ఏమిరా నీ వల్ల ఉపయోగం !

ఎప్పుడూ ఏదో సంచలనంతో బుర్రను నెగటివిటీ తో నింపేస్తే .. మెదడుతో సహా మొత్తం ఒళ్ళు విషపూరితం అయిపోతుంది.

మనిషి నలుగురితో కలిసి బతకాలి .

మంచి కంటెంట్ ను బుర్రలోకి పంపాలి .

అదేపని గా నెగటివ్ విషయాలను బుర్రలోకి ఇంజెక్ట్ చేస్తే ఆలోచనలు చివరకు జీవితం గతితప్పుతుంది .

బతకడం ఎలాగో మరిస్తే ఎలా ?

ఫండమెంటల్స్ మరిస్తే జీవితం అధోగతి !

55
మీ పిల్లలకు ఇవి నేర్పించండి

!. పిల్లలకు క్రిటికల్ థింకింగ్ నేర్పండి .

2. సెల్ ఫోన్ దూరం చెయ్యండి . మీరు కూడా సెల్ ఫోన్ ను ప్రొఫెషనల్ పనులకు , పరిమితంగా పాజిటివ్ కంటెంట్ చూడ్డానికి మాత్రమే వాడండి .

3. పిల్లల చేత కథల పుస్తకాలు చదివించండి. అది వారిలో సృజనను పెంచుతుంది. రోబో యుగంలో సృజన ఉంటేనే ఉద్యోగం.

4. చుట్టూరా జరుగుతున్న ఘటనలను పిల్లల వయసు బట్టి వారితో చర్చించండి .

5. ఆలోచించమనండి. ఇంగిత జ్ఞానం, కుశాగ్ర బుద్ధి , సామాజిక తెలివితేటలు , భావోద్వేగ తెలివితేటలు, సృజన , సమష్టితత్త్వం .. లాంటి లక్షణాలు వారిలో పెంచండి .

6. మరిన్ని వివరాలు కావాలంటే నా బాలమిత్ర క్లాసులకు రండి. ఈ ఆదివారం ఉదయం ఏలూరులో మధ్యాహ్నం తిరువూరులో. జనాలు బాగా వస్తే అటుపై గుంటూరు నరసారావు పేట ఇంకా మరి కొన్ని చోట్ల లో కూడా.

7. బాలమిత్ర క్లాసులు ఒక రౌండ్ పూర్తి అయ్యింది . మొత్తం అరవై చోట్ల బాలమిత్ర క్లాసులు పెట్టా. ఉచితంగా విజ్ఞానాన్ని పంచుతున్నా .

8. జనాలు వినియోగించుకొంటున్నారు అంటే మరిన్ని చోట్ల సెకండ్ రౌండ్ బాలమిత్ర క్లాసులు ఉంటాయి.

Read more Photos on
click me!

Recommended Stories