Facts: సాధారణంగా ఒకే గదిలో పురుషులు, మహిళలు ఉన్నప్పుడు మహిళలు తమకు చలిగా ఉందని ఎక్కువగా చెబుతుంటారు. పురుషులకు సాధారణంగా అనిపించే ఉష్ణోగ్రతలోనే మహిళలు చలిని ఎక్కువగా అనుభవిస్తుంటారు. దీనికి కారణం ఏంటంటే.?
మన శరీరంలో వేడిని ఉత్పత్తి చేయడంలో కండరాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మనం నడుస్తున్నప్పుడు, వ్యాయామం చేస్తున్నప్పుడు మాత్రమే కాకుండా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కూడా కండరాలు కొంత వేడిని ఉత్పత్తి చేస్తాయి. సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళల్లో కండరాల పరిమాణం, కండరాల బరువు తక్కువగా ఉంటాయి. దీంతో వారి శరీరం ఉత్పత్తి చేసే మొత్తం వేడి కూడా కొంత తక్కువగా ఉండవచ్చు. అందుకే చల్లని వాతావరణంలో మహిళలు త్వరగా చలిని అనుభవించే అవకాశం ఉంటుంది.
24
హార్మోన్ల ప్రభావం
మహిళల శరీరంలో ఉండే ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్లు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా ఈ హార్మోన్ల స్థాయిలు నెలసరి సమయంలో మారుతూ ఉంటాయి. ప్రొజెస్టెరాన్ హార్మోన్ ప్రభావంతో శరీర ఉష్ణోగ్రతలో మార్పులు రావచ్చు. అలాగే ఈస్ట్రోజన్ రక్తనాళాలపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా చేతులు, కాళ్లలోని రక్తనాళాలు కుంచించుకుపోతే అక్కడికి రక్తప్రసరణ తగ్గుతుంది. దీంతో చేతులు, పాదాలు చల్లగా అనిపిస్తాయి. ఈ కారణంగా మహిళలు చలిని ఎక్కువగా అనుభవించవచ్చు.
34
జీవక్రియ వేగం తక్కువగా ఉండటం
మన శరీరానికి అవసరమైన శక్తిని ఆహారం నుంచి అందించే ప్రక్రియను జీవక్రియ (మెటబాలిజం) అంటారు. ఈ ప్రక్రియలో శరీరానికి అవసరమైన శక్తితో పాటు వేడి కూడా ఉత్పత్తి అవుతుంది. సాధారణంగా పురుషుల్లో కండరాల పరిమాణం ఎక్కువగా ఉండటం వల్ల విశ్రాంతి సమయంలో కూడా శక్తి వినియోగం ఎక్కువగా ఉంటుంది. మహిళల్లో ఈ శక్తి వినియోగం కొంత తక్కువగా ఉండవచ్చు. ఫలితంగా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు వారి శరీరంలో ఉత్పత్తి అయ్యే వేడి కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే ఒకే ఉష్ణోగ్రతలో ఉన్నప్పటికీ మహిళలకు ఎక్కువగా చలి వేయవచ్చు.
శరీరంలో వేడి ఉత్పత్తి కావడానికి థైరాయిడ్ హార్మోన్లు కూడా చాలా అవసరం. ఇవి జీవక్రియ వేగాన్ని నియంత్రిస్తాయి. థైరాయిడ్ గ్రంథి తక్కువగా పనిచేస్తే జీవక్రియ నెమ్మదిస్తుంది. దీంతో శరీరంలో వేడి ఉత్పత్తి తగ్గి ఎక్కువగా చలి అనిపించవచ్చు. మహిళల్లో థైరాయిడ్ సమస్యలు పురుషులతో పోలిస్తే ఎక్కువగా కనిపిస్తాయి. అందువల్ల తరచుగా చలిగా అనిపించడం, అలసట, బరువు పెరగడం వంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు. అవసరమైతే వైద్యులను సంప్రదించి థైరాయిడ్ పరీక్షలు చేయించుకోవాలి.
గమనిక: పైన తెలిపిన విషయాలను కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే మంచిది.