ఆ సినిమాల కోసం నయా పైసా తీసుకోకుండా పాటలు రాసిన సిరివెన్నెల... సీతారామశాస్త్రి పాటల ప్రస్తానంలో...

First Published Nov 30, 2021, 5:24 PM IST

తెలుగు సినీ ప్రపంచం మరో లెజెండ్‌ను కోల్పోయింది. దాదాపు 3 వేల పాటలతో తెలుగు సినిమాకి సాహితీ విలువలు నేర్పిన గేయ రచయిత, ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి... కలం మూగబోయింది... తన పాటలతో తెలుగు ప్రేక్షకులను జోలలాడించి,  ఆలోచింపచేసిన గేయం.. విధాత తనువులో కలిసిపోయింది..

‘కళా తపస్వి’ కె విశ్వనాథ్ రూపొందించిన ‘సిరి వెన్నెల’ సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సీతారామశాస్త్రి, నిజానికి ‘జననీ జన్మభూమీ’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు సీతారామశాస్త్రి. 

‘సిరివెన్నెల’ సినిమాలో సాహిత్య విలువలతో ఆయన రాసిన పాటలు, ఇప్పటికీ ప్రతీ తెలుగింట్లోనూ వినిపిస్తూనే ఉన్నాయి. అందుకే ఆ సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్నారు సీతారామశాస్త్రి...  

దర్శకుడు తివిక్రమ్ శ్రీనివాస్ చెప్పినట్టుగా సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసే పాటలు, సాహిత్యం తెలిసిన వారికే కాదు, అసలు అక్షరం ముక్కైన రాని వారికి కూడా ఆలోచింపచేసేలా ఉంటాయి...

‘గాయం’లో ‘ఈ సిగ్గులేని సమాజాన్ని నిగ్గదీసి అడగమని’ చూసే ప్రేక్షకులను ఆవేశంతో  ఊగిపోయేలా చేసిన సిరివెన్నెల కలం... ‘అర్థశతాబ్దపు అజ్ఞానాన్ని స్వాతంత్య్రమంటామా’ అంటూ ఆలోచనల్లో పడదోసింది...

‘సిరివెన్నెల’తో పాటు ‘శృతిలయలు’, ‘స్వర్ణ కమలం’, ‘గాయం’, ‘శుభలగ్నం’, ‘శ్రీకారం’, ‘సింధూరం’, ‘ప్రేమకథ’, ‘చక్రం’, ‘గమ్యం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి సినిమాలకు రాసిన పాటల ద్వారా నంది అవార్డులను అందుకున్న సీతారామశాస్త్రి... ‘ఉత్తమ గేయ రచయిత’గా నాలుగుసార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను కూడా అందుకున్నారు. 

‘విలువలు లేకుండా నేనెప్పుడూ పాట రాయను. మహిళలను కించపరుస్తూ లేదా మహిళ మాతృత్వ భాగాలను తక్కువ చేస్తూ అసభ్యంగా, అశ్లీలత ఒట్టిపడేలా పాటలు రాయలేనని దర్శక నిర్మాతలకు నిర్మొహమాటంగా చెప్పేసేవాడిని...’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు సీతారామశాస్త్రి...

‘నా దగ్గరికి వచ్చే దర్శకులు... పాట వచ్చే సందర్భం గురించి, కథ గురించి చెబుతారు. నేను ప్రేక్షకుడిగా ఫీల్ అయ్యి, పాటను రాసుకుంటూ పోతాను...

కొన్నిసార్లు దర్శకులు చెప్పిన సీన్స్‌ని మార్చేయమని చెప్పాను. కొన్ని సార్లయితే పాట వచ్చే సందర్భాలను కూడా మార్చేసేవాడిని. నా పాటకు విలువ నిచ్చినవాళ్లు, ఆ మార్పులు చేసేవాళ్లు...

చాలామంది నేను సాధించినదానికి గర్వపడుతుండొచ్చని, నాకు అహంకారం, పొగరు ఎక్కువని అనుకుంటారు. కానీ నా సాహిత్యం, నేను రాసిన అక్షరాలు ఆలోచనలుగా మారి, ప్రేక్షకుడి మనసుని తాకినప్పుడే నాకు గర్వంగా అనిపిస్తుంది...

చాలామంది దర్శక నిర్మాతలు నా దగ్గరికి వచ్చి, వాళ్ల పరిస్థితిని చెప్పుకుంటారు, వారి కష్టాలను వెళ్లబోసుకుంటారు. అలాంటప్పుడు నేను డబ్బులు తీసుకోకుండా పాటలు రాసి ఇచ్చాను...

నేను ఎంతమందికి ఫ్రీగా రాసి ఇచ్చాను, ఆ సినిమాలేంటనేవి చెప్పను. ఎందుకంటే నాకు డబ్బులు ముఖ్యం కాదు, నన్ను కదిలించే సన్నివేశం, కథ ఉంటే నా కలానికి, నాకు సంతృప్తిగా ఉంటుంది...’ అనేవారు సీతారామశాస్త్రి...

click me!