రీమేక్‌ స్టార్ల కొంప ముంచుతున్న ఓటీటీలు.. ఆందోళనలో చిరు, వెంకీ, పవన్‌ వంటి హీరోలు..

First Published Nov 27, 2022, 1:58 PM IST

చిరంజీవి, వెంకటేష్‌, పవన్‌ కళ్యాణ్‌ తోపాటు మరికొందరు హీరోలు రీమేక్‌ సినిమాలతో విజయాలను అందుకుని స్టార్లుగా ఎదిగారు. కానీ వీరిని ఇప్పుడు ఓటీటీలు దెబ్బకొడుతున్నాయి. కెరీర్‌ని ఆందోళనలో పడేస్తున్నాయి. 

సినిమాల్లో థియేటర్‌కి రీప్లేస్‌మెంట్‌ మరేదీ లేదంటారు. టీవీలొచ్చినప్పుడు చాలా భయపడ్డారు. కానీ దాని ప్రభావం పెద్దగా లేదు. ఇప్పుడు ఓటీటీ(డిజిటల్‌ స్ట్రీమింగ్‌)(OTT) లు మాత్రం గట్టిగా దెబ్బ తీస్తున్నాయి. స్టార్‌ హీరోల సినిమాల నుంచి తక్కువ బడ్జెట్‌ సినిమాల వరకు అన్నింటిపై ఓటీటీల ప్రభావం చాలా ఉంది. దీంతో ఇప్పుడు థియేటర్‌కి సవాళ్లు మొదలయ్యాయి. 

చిరంజీవి(Chiranjeevi), వెంకటేష్‌(Venkatesh), పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan) తన కెరీర్‌లో ఎక్కువగా రీమేక్‌ సినిమాలే చేశారు. రీమేక్‌లతోనే విజయాలు అందుకున్నారు. కెరీర్‌లో మైల్‌ స్టోన్‌ చిత్రాలు, బ్లాక్‌ బస్టర్‌ మూవీస్‌ లో చాలా వరకు రీమేక్‌లే ఉండటం విశేషం. ప్రస్తుతం కూడా రీమేక్‌లు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. కెరీర్‌ పరంగా దూసుకుపోతున్నారు. 
 

అయితే ప్రస్తుతం ఈ ట్రెండ్‌ మారింది. కరోనా పుణ్యామా? అని ఓటీటీలు ఊపందుకున్నాయి. ఇవి ఆడియెన్స్‌ బాగా దగ్గరయ్యాయి. సినిమా విడుదలైన నెల రోజుల లోపే ఓటీటీలో సినిమా వస్తుండటంతో ఆడియెన్స్ థియేటర్ కి రావడం తగ్గించేశారు. ఆహా, ఓహో ఉన్న సినిమాలనే చూస్తున్నారు. భారీ సినిమాల్లోనూ థ్రిల్లింగ్‌ ఎలిమెంట్లు, భారీ యాక్షన్‌ ఎపిసోడ్లతోపాటు బలమైన కంటెంట్‌, జెన్యూస్‌ సెంటిమెంట్లు, కొంత ఆధ్యాత్మిక కోణం ఉన్న చిత్రాలకు ఆదరణ పెరుగుతుంది. రొటీన్‌ సినిమాలను, రొటీన్‌ ఫ్యామిలీ డ్రామాలు,  రొటీన్‌ లవ్‌ స్టోరీలకు కాలం చెల్లిందని ఇటీవల వచ్చిన సినిమాల ఫలితాలు తేల్చి చెబుతున్నాయి. 

ఊహించని ఎలిమెంట్లు, ట్విస్టులు, సమాజంలో నెలకొన్న సందేశాలు, రా రస్టిక్‌ కథలకు ఆదరణ ఉంది. ఏదైనా వెండితెరపై మ్యాజిక్‌గా అనిపించిన చిత్రాలే ఆదరణ పొందుతున్నాయి. లేదంటే ఆడియెన్స్ లైట్‌ తీసుకుంటున్నారు. పాజిటివ్‌ టాక్ వచ్చినా కొన్ని సినిమాలకు ఆడియెన్స్ రావడం లేదు, కొన్నింటికి మొదట పెద్దగా ఆదరణ లేకపోయినా నెమ్మదిగా పుంజుకుంటున్నాయి. అదే సమయంలో సినిమాకు భాషభేదం లేదు. బాగున్నా సినిమాలను ఏ భాషలోనైనా ఆదిస్తున్నారు. 
 

ఇటీవల వచ్చిన `కాంతార`, `సీతారామం`, `పుష్ప`, `కార్తికేయ 2`, `ది కాశ్మీర్‌ ఫైల్స్`, `విక్రాంత్‌ రోణా`, `విక్రమ్‌`, `జై భీమ్‌`,m వంటి చిత్రాలు ఎంతటి సంచలనాలు సృష్టించాయో తెలిసిందే. మొదట వీటికి పెద్దగా ఆదరణ దక్కలేదు. కానీ నెమ్మదిగా పుంజుకున్నాయి. సంచలన విజయాలను సాధించాయి. ఈ ఏడాది ఇండియన్‌ బ్లాక్‌ బస్టర్స్ గా నిలిచిన `కేజీఎఫ్‌2`, `ఆర్‌ఆర్‌ఆర్‌` సైతం బలమైన కంటెంట్‌తోనే ఆదరపొందాయి. 
 

అదే సమయంలో రీమేక్‌(Remakes)లకు కాలం చెల్లింది. ప్లాన్‌ ఇండియా సినిమా ట్రెండ్‌ `రీమేక్‌` ట్రెండ్‌ని కిల్‌ చేస్తున్నాయి. సినిమా బాగుండటంతో భాషలకు అతీతంగా చూసేస్తున్నారు. థియేటర్లలో కాకపోతే ఓటీటీలో చూస్తున్నారు. దీంతో ఇక రీమేక్‌లపై ఆసక్తి తగ్గిపోయింది. ఓటీటీలో ఆల్‌రెడీ మంచి సినిమాలను చూసేస్తున్న నేపథ్యంలో వాటిని పెద్ద హీరోలు చేసినా పెద్దగా పట్టించుకోవడం లేదు ఆడియెన్స్. అందుకే ఇటీవల రీమేక్‌ చిత్రాలకు పాజిటివ్‌ టాక్‌ వచ్చినా పెద్దగా థియేటర్లలో ఆదరణ దక్కలేదు. 
 

చిరంజీవి నటించిన `గాడ్‌ ఫాదర్‌`కి పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. కానీ దాన్ని జనం పెద్దగా చూడలేదు. అప్పటికే మాతృక `లూసీఫర్‌` సౌత్‌ ఆడియెన్స్ మొత్తం చూసేశారు. ఈ కారణంగా చిరంజీవి నటించినప్పటికీ దానికి ఆదరణ దక్కలేదు. అలాగే వెంకటేష్‌ నటించిన `నారప్ప`, `దృశ్యం 2` చిత్రాలకు కూడా అదే పరిస్థితి. పవన్‌ `భీమ్లా నాయక్‌` బాగుందన్నా, కలెక్షన్ల పరంగా సత్తాచాటలేకపోయింది. అంతకు ముందు `వకీల్‌ సాబ్‌` కూడా యావరేజ్‌గానే నిలిచింది. సినిమా బాగుందనే టాక్‌ వచ్చినా, అప్పటికే ఓటీటీలో వాటిని చూడటంతో థియేటర్లలో చూసేందుకు ఆసక్తి చూపలేదు. 
 

వీటితోపాటు ఇటీవల అల్లు శిరీష్‌ నటించిన `ఊర్వశివో రాక్షసివో`, హిందీలో `జెర్సీ`, `విక్రమ్‌ వేదా`, `హిట్‌`, `గద్దల కొండ గణేష్‌`, `లాల్‌ సింగ్‌ చద్దా` వంటి రీమేక్‌ సినిమాలు బాలీవుడ్‌లో డిజాస్టర్‌గా నిలిచాయి. వాటిని ఓటీటీలో చూసేయడంతో థియేటర్లలో చూసేందుకు ఆసక్తి చూపించలేదనే టాక్‌ క్రిటిక్స్ నుంచి వినిపించింది.

ఈ లెక్కన ఇప్పుడు రీమేక్‌ స్టార్ల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది ఓటీటీ. కేవలం ఒరిజినల్‌ కంటెంట్‌కే ప్రయారిటీ పెరుగుతుంది. రీమేక్‌ చేస్తే పరాజయం తప్పదనే సంకేతాలనిస్తుంది. మొత్తంగా ఓటీటీలు సైలెంట్‌గా రీమేక్‌ హీరోలకు, థియేటర్లకి పెను ముప్పుగానూ మారబోతుందనే వాదన ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు, సినీ విశ్లేషకులు, ట్రేడ్‌ వర్గాల నుంచి వినిపిస్తుంది. మరి ఇది ఇలానే కొనసాగుతుందా? ఈ ట్రెండ్ లో మార్పు ఏమైనా ఉంటుందా? అనేది చూడాలి. 
 

click me!