PopCorn Review: అవికాగోర్‌ `పాప్‌కార్న్` మూవీ రివ్యూ, రేటింగ్‌

First Published Feb 9, 2023, 7:05 AM IST

`చిన్నారి పెళ్లికూతురు`గా పాపులర్‌ అయ్యింది అవికాగోర్‌. బుల్లితెర సీరియల్‌తోనే స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న ఈ క్యూట్‌ సినిమాల్లోనూ మెప్పించింది. తాజాగా `పాప్‌కార్న్` మూవీలో నటించింది. ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

`చిన్నారి పెళ్లికూతురు`గా పాపులర్‌ అయ్యింది అవికాగోర్‌(AvikaGor). బుల్లితెర సీరియల్‌తోనే స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న ఈ క్యూట్‌ సినిమాల్లోనూ మెప్పించింది. ఇటీవల ఆమె కెరీర్‌ ఆశాజనకంగా లేదు. ఈ నేపథ్యంలో మరోసారి పెద్ద తెరపై తన సత్తా చాటేందుకు విజయాలు అందుకునేందుకు ప్రయత్నిస్తుంది. తాజాగా `పాప్‌కార్న్`(PopCorn) మూవీలో నటించింది. దీనికి సహ నిర్మాతగానూ వ్యవహరించింది. సాయి రోనక్‌ హీరోగా నటించిన ఈ చిత్రం రేపు శుక్రవారం(ఫిబ్రవరి10)న విడుదల కానుంది. అంతకంటే ముందే మీడియాకి స్పెషల్‌ ప్రీమియర్‌ షో ప్రదర్శించారు. మరి సినిమా ఎలా ఉందో రివ్యూ(PopCorn Review)లో తెలుసుకుందాం. 
 

కథః
సమీరణ(అవికాగోర్‌) పెద్ద సింగర్‌ అవ్వాలనుకుంటుంది. కానీ తనకున్న అస్తమా కారణంగా ఎంత ప్రయత్నించినా పాడలేకపోతుంది. ఆడిషన్‌కి వెళ్లిన ప్రతిసారి ఫెయిల్‌ అవుతుంటుంది. దీంతో ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్‌ ప్లాన్‌ చేస్తుంది. అందుకు షాపింగ్‌ చేయడానికి మాల్‌కి వెళ్తుంది. మరోవైపు పవన్‌ మ్యూజిక్‌ అంటే ఇష్టం. గిటార్‌ వాయిస్తుంటాడు. తాత పెద్ద మ్యూజీషియన్‌. తాత అంటే తనకు ప్రాణం. రేపు అతని బర్త్ డే. ఆయనకు సర్‌ప్రైజ్‌ ఇచ్చేందుకు షాపింగ్‌ చేయడానికి మాల్‌కి వస్తాడు. సమీరణ, పవన్‌ ఒకే మాల్‌కి వస్తారు. అనుకోకుండా వీరిద్దరికి గొడవ అవుతుంది. సమీరణని కొట్టేందుకు ఆమెని ఫాలో అవుతుంటాడు పవన్‌. ఇద్దరు కలిసి మాల్‌ లిఫ్ట్ లో ఇరుక్కుంటారు. ఎంత ప్రయత్నించినా లిఫ్ట్ ఓపెన్‌ కాదు, మాల్‌ నిర్వహకులు దాన్ని పట్టించుకోరు. దీంతో మధ్యాహ్నం నుంచి ఈ ఇద్దరు లిఫ్ట్ లోనే ఇరుక్కుపోతారు. రాత్రి అయినా లిఫ్ట్ ఓపెన్‌ కాదు. లిఫ్ట్ లో చెలరేగిన మంటల కారణంగా పొగ వస్తుంది. పొగపడని అస్తమా పేషెంట్‌ అయిన సమీరణ దాన్ని ఎలా ఫేస్‌ చేసింది, రోజంతా ఈ ఇద్దరు ఆ లిఫ్ట్ లో ఏం చేశారు? ఇద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది? లిఫ్ట్ నుంచి ఎలా బయటపడ్డారు, ఈ క్రమంలో లిఫ్ట్ లో ఏం జరిగిందనేది మిగిలిన కథ. 

విశ్లేషణః 
ఓ చిన్న పాయింట్‌తో రూపొందిన చిత్రం `పాప్‌కార్న్`. మరి చిన్న పాయింట్‌తో దర్శకులు, నిర్మాతలు, అవికాగోర్‌తో పాటు టీమ్‌ అంతా పెద్ద సాహసమే చేశారని చెప్పొచ్చు. ఫస్ట్ ఇలాంటి పాయింట్‌తో సినిమా చేయడానికి ముందుకొచ్చిన నిర్మాతలకు దెండం పెట్టాల్సిందే. ఈ కథతో నిర్మాతలను, నటీనటులను ఒప్పించిన దర్శకుడు మురళి గంధం గట్స్ కి హ్యాట్సాఫ్‌. ఈ సినిమాలో ఓ కథ లేదు, సోల్‌ లేదు, ఎమోషన్స్ అంతకన్నా, కామెడీ వెతికా దొరకదు. టైటిల్‌కి సినిమాకి సంబంధమే లేదు. సినిమా మొత్తం ఒక లిఫ్ట్ లోనే సాగుతుంది. రెండు గంటలు లిఫ్ట్ లోనే సినిమా నడిపించడం గమనార్హం. గొడవ కారణంగా లిఫ్ట్ లో ఇరుక్కున్న ఈ జంట ఆ కోపం నుంచి నెమ్మదిగా బయటపడి, ఆ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుని, ఆ తర్వాత వారి అభిరుచులు, డ్రీమ్స్ తెలుసుకుని, వాటిని లిఫ్ట్ లోనే ఫుల్‌ఫిల్‌ చేసుకుని, చివరికి ఓ ఉత్కంఠభరిత, నాటకీయ పరిణామాల మధ్య, అపాయ స్థితి నుంచి బయటపడటమే ఈ సినిమా. 
 

క్లైమాక్స్ లో చివరి పది నిమిషాలు తప్ప సినిమాలో ఏం లేదు. లిఫ్ట్ లో హీరోహీరోయిన్ల మధ్య జరిగే కన్వర్జేషన్‌, సన్నివేశాలన్నీ బోర్‌ తెప్పిస్తాయి. థియేటర్లలో కూర్చొన్న ఆడియెన్స్ చుక్కలు చూపిస్తుంటాయి. ఊ అంటే పాట, గిటార్‌ వాయిస్తూ ఇద్దరు చేసిన రచ్చ థియేటర్లలో ఆడియెన్స్ ఓపికని పరీక్షిస్తుంటాయి. లిఫ్ట్ లో హీరోహీరోయిన్ల మధ్య కన్వర్జేషన్‌, ఫ్రస్టేషన్‌ తో ఫన్‌ జనరేట్‌ అవుతుందని దర్శకుడు చేసిన ప్రయత్నం విఫలమయ్యింది. ఫన్‌ కాదు కదా, చిరాకు పుట్టిస్తుంది. అయితే బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌, పాటలు కాస్త రిలీఫ్‌ ఇచ్చే అంశం. చివరి క్లైమాక్స్ ఆడియెన్స్ ని ఉత్కంఠకి గురిచేస్తుంది. సినిమా మొత్తం బోర్‌ ఫీలైన ఆడియెన్స్ ని కాస్త ఎంగేజ్‌ చేస్తుంది. ఎమోషనల్‌గా మార్చేస్తుంది. అస్తమా కారణంగా హీరోయిన్‌ పడే బాధ, ఆమెని కాపాడేందుకు హీరో చేసే ప్రయత్నాలు మనల్ని కూడా అయ్యో అనిపిస్తాయి. అక్కడ మాత్రమే ఆడియెన్స్ సినిమాతో కనెక్ట్ అవుతారు. కొన్ని సీన్లు మరీ నాసిరకంగా, విసుగు మీద విసుగు తెప్పించేలా, ఆడియెన్స్ సహనాన్ని పరీక్షించేలా ఉండటం గమనార్హం.
 

నటీనటులుః
అవికాగోర్‌ కి సెకండ్‌ ఇన్నింగ్స్ లో సక్సెస్‌ లు లేవు. ఆమె ఈ చిత్రంతో నిర్మాతగానూ మారింది. కానీ హీరోయిన్‌గానే కాదు, నిర్మాతగానూ ఆమెకిది రాంగ్‌ ఛాయిస్‌. ఇక నటిగా ఫర్వాలేదని చెప్పొచ్చు. భిన్న ఎమోషన్స్ పలికించి ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. పవన్‌గా సాయిరోనక్‌ బాగానే మెప్పించాడు. ఫన్నీగా, కాస్త హుందాగా, ఎమోషన్స్‌ సీన్లలోనే మెప్పించాడు. ఈ ఇద్దరు తప్ప సినిమాలో చెప్పుకోదగ్గ మరే పాత్ర లేదు. లిఫ్ట్ లో వీరిద్దరి మధ్యే సినిమా మొత్తం సాగడంతో మూడో పాత్ర ప్రయారిటీకి స్కోప్‌ లేదు. అయితే వీరిద్దరి నుంచి దర్శకుడు ఆశించిన నటన రాబట్టుకోలేకపోయాడని మాత్రం చెప్పొచ్చు. 
 

టెక్నీషియన్లుః
దర్శకుడు మురళీగంధం ఓ ఓటీటీ పాయింట్‌తో సినిమాని తెరకెక్కించడం దాన్ని థియేటర్లోకి తీసుకురావడం గొప్ప విషయం. లిఫ్ట్ లోనే రెండు గంటల సినిమా నడిపించాలనే ఆలోచనకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఈ విషయంలో ఆయన ప్రతిభకి అభినందించాల్సిందే, కానీ మేకింగ్‌ పరంగా ఆయన మాత్రం పూర్తి విఫలమయ్యాడని చెప్పొచ్చు. సినిమాని ఏమాత్రం ఆసక్తికరంగా, ఎంటర్‌టైనింగ్‌గా తెరకెక్కించలేకపోయాడు. దీంతో ఈ చిత్రం ఆత్మ లేని శరీరంలా సీన్లకే పరిమితమయ్యింది. ఇక సినిమాలో తన ప్రతిభని చూపించింది కెమెరామెన్‌, మ్యూజిక్‌ డైరెక్టర్. లిఫ్ట్ లో కెమెరాని పెట్టి షూట్‌ చేయడం కెమెరామెన్‌ ఎం ఎన్‌ బాల్‌రెడ్డి టాలెంట్‌కి నిదర్శనం. చాలా బాగా చేశారు. సినిమాకి ఆయనొక పిల్లర్‌గా నిలిచారు. అలాగే శ్రవణ్‌ భరద్వాజ్‌ పాటలు, ఆర్‌ఆర్‌ అదిరిపోయింది. అంతో ఇంతో సినిమాలో ఆకట్టుకున్న పాయింట్‌ ఏదైనా ఉందంటే పాటలు, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ మాత్రమే. ఇక ఈ సినిమా విషయంలో ఎడిటర్‌ కె ఎస్‌ ఆర్‌ నిస్సాహయుడిగానే మిగిలిపోయాడు. సినిమాలో ఒకటి రెండు బయట జరిగే సీన్లు తప్ప మిగిలినదంతా లిఫ్ట్ లోనే కావడంతో పెద్దగా బడ్జెట్‌ అయ్యేందుకు ఛాన్స్ లేదు. ఉన్నంతో ఫర్వాలేదు. అయితే అవికా గోర్ తాను నిర్మాతగా మారేంతగా ఈ సినిమాలో ఆమెకి ఏం నచ్చిందో మిలియన్‌ డాలర్ల ప్రశ్న. 
 

ఫైనల్‌గాః `పాప్‌కార్న్‌` ఆడియెన్స్ సహనానికి పరీక్ష.
రేటింగ్‌ః 2.25


స‌మ‌ర్ప‌ణ‌: ఎం.ఎస్‌.చ‌ల‌ప‌తి రాజు, బ్యాన‌ర్స్‌:  ఆచార్య క్రియేష‌న్స్, అవికా స్క్రీన్ క్రియేష‌న్స్ ,నిర్మాత‌:  భోగేంద్ర గుప్తా, కాన్సెప్ట్ - స్టోరి - డైలాగ్స్ - స్క్రీన్ ప్లే - ద‌ర్శ‌క‌త్వం:  ముర‌ళి గంధం, కో ప్రొడ్యూస‌ర్స్‌:  అవికా గోర్‌, ఎం.ఎస్‌.చ‌ల‌ప‌తి రాజు, శేషు బాబు పెద్దింటి, సినిమాటోగ్ర‌ఫీ:  ఎం.ఎన్‌.బాల్ రెడ్డి, మ్యూజిక్:  శ్ర‌వ‌ణ్ భ‌ర‌ద్వాజ్‌, ఎడిట‌ర్‌:  కె.ఎస్‌.ఆర్‌, ఆర్ట్ డైరెక్ట‌ర్‌:  భాస్క‌ర్ ముదావ‌త్‌, కొరియోగ్ర‌ఫీ:  అజ‌య్ సాయి, ఫ్యాష‌న్ డిజైన‌ర్‌:  మ‌నోహ‌ర్ పంజా, పి.ఆర్.ఓ:  నాయుడు సురేంద్ర‌, ఫణి (బియాండ్ మీడియా), పోస్ట‌ర్స్‌, లిరిక‌ల్స్‌:  నియో స్టూడియోస్‌, డిజిటల్ మార్కెటింగ్‌:  మ్యాంగో మీడియా, మ్యూజిక్‌: ఆదిత్య మ్యూజిక్‌.
 

click me!