Andhra spinner Sree Charani : విశాఖపట్నంలో మహిళా వరల్డ్ కప్ సందడి మొదలైంది. గురువారం సౌతాఫ్రికాతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ లో తెలుగు ప్లేయర్ ఎన్. శ్రీచరణి ప్రదర్శనపై ఆంధ్ర క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.
విశాఖపట్నం ఏసీఏ వీడీసీఏ స్టేడియం వద్ద మహిళా ప్రపంచ కప్ సందడి మొదలైంది. గురువారం భారత మహిళా జట్టు దక్షిణాఫ్రికాతో తలపడనుంది. అలాగే, ఆదివారం ఆస్ట్రేలియాతో పోటీ పడనుంది. ఈ మ్యాచ్ లతో పాటు ఆంధ్ర అభిమానుల ఆనందానికి మరో కారణం శ్రీచరణి.. కడప జిల్లాలోని చిన్న గ్రామం నుంచి తన ప్రయాణం మొదలుపెట్టి నేడు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మహిళా ప్రపంచ కప్ లో తన సొంత రాష్ట్రంలో ఆడబోతున్నారు.
25
ఆంధ్ర క్రికెట్‌కు గర్వ కారణం శ్రీచరణి
భారత మాజీ ప్రధాన సెలెక్టర్ ఎంఎస్‌కే ప్రసాద్ ఒక ఛానెల్ తో మాట్లాడుతూ.. “మా రాష్ట్రం నుంచి వచ్చిన అమ్మాయి వరల్డ్ కప్‌లో, అది కూడా మన మైదానంలో ఆడటానికి సిద్ధంగా ఉంది. ఇది ఆంధ్ర క్రికెట్‌కు గర్వకారణం. ఆమె ప్రదర్శన, ఎదుగుదల మాకు ఎంతో ఆనందం కలిగిస్తోంది” అని తెలిపారు. అలాగే, “ఇది కేవలం ఆట కాదు, ఇది ఒక స్ఫూర్తి కథ. ఆమెలా గ్రామాల నుంచి వస్తున్న ఎంతో మంది మహిళా క్రీడాకారిణులను ప్రేరేపిస్తున్నారు” అని చెప్పారు.
35
చిన్న గ్రామం నుంచి వరల్డ్ కప్ వరకు శ్రీచరణి క్రికెట్ కెరీర్
శ్రీచరణి కడప జిల్లాలో జన్మించింది. చిన్నప్పటి నుంచి ఆమెకు క్రీడలంటే ఇష్టం. “నేను ఖోఖో, కబడ్డీ అన్నీ ఆడేదాన్ని. కానీ మా మామ కిషోర్ కుమార్ రెడ్డి కారణంగానే క్రికెట్ ఆడటం మొదలుపెట్టాను” అని ఆమె గతంలో బీసీసీఐకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
ఆమె మొదట ఫాస్ట్ బౌలర్‌గా కెరీర్ ను మొదలుపెట్టింది. అయితే, పెద్దగా ఫలితం రాకపోవడంతో స్పిన్ బౌలింగ్ నేర్చుకుంది. అదే ఆమెకు టర్నింగ్ పాయింట్ అయింది. అథ్లెటిక్స్ మీట్‌లో పాల్గొన్న తర్వాత ఆమె తల్లికి “ఇక నేను క్రికెట్ మాత్రమే ఆడతాను” అని చెప్పింది. శ్రీచరణి నిర్ణయానికి ఆమె వెంటనే ఒకే చెప్పినా.. తండ్రిని ఒప్పించడానికి కొంత సమయం పట్టిందని తెలిపారు.
ఆంధ్ర మహిళా జట్టు ప్రధాన కోచ్ శ్రీనివాస్ రెడ్డి, శ్రీచరణి ప్రతిభను చిన్న వయసులోనే గుర్తించారు. “17-18 ఏళ్ల వయసులోనే ఆమె ఫీల్డింగ్ నన్ను ఆకట్టుకుంది. అథ్లెటిక్స్ నేపథ్యం ఉండటంతో ఆమె చాలా వేగంగా కదిలేది. తరువాత స్పిన్ బౌలింగ్‌పై దృష్టి పెట్టింది” అని చెప్పారు. అలాగే, “మేము ప్రాక్టీస్ ఆపిన తర్వాత కూడా ఆమె ‘సర్, ఇంకో సారి బాల్ వేస్తాను’ అని అడిగేది. కష్టపడి పని చేసే స్వభావం.. అదే ఆమె ప్రత్యేకత” అని అన్నారు.
2021లో జరిగిన అండర్ 19 మహిళా ఛాలెంజర్ ట్రోఫీలో శ్రీచరణి అద్బుత ప్రదర్శనతో మెరిశారు. ఆమె ఆడిన ఇండియా బీ జట్టు, కోచ్ రెడ్డి మార్గదర్శకత్వంలో టైటిల్ గెలిచింది. అదే ఆమె కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ గా మారింది. “అప్పటి నుంచి ఆమె వెనక్కి తిరిగి చూడలేదు. ప్రతి క్యాంప్‌కూ ముందుగా వచ్చి చివరగా వెళ్లేది. ఆ పట్టుదలనే ఆమెను ఈ స్థాయికి తీసుకువచ్చింది” అని తెలిపారు.
సొంతగడ్డపై శ్రీచరణి అదరగొడుతుందా?
విశాఖలో జరిగే దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మ్యాచ్‌ల్లో శ్రీచరణి ఆడే అవకాశం ఉంది. రెడ్డి మాట్లాడుతూ, “మేము ఆమెను ఎక్కువగా డిస్ట్రబ్ చేయం. కానీ ఆమెకు వేగం, హై-ఆర్మ్ యాక్షన్ ఉన్నందున బాట్స్‌వుమెన్‌కు సవాలుగా మారనుంది” అని పేర్కొన్నారు.
శ్రీచరణి కథ ఆంధ్రలోనే కాదు దేశంలోని ఎంతో మంది గ్రామీణ బాలికలకు ఒక స్ఫూర్తి. ఎర్రమల కొండల నుంచి ప్రపంచ వేదికపై నిలవగలమని ఆమె నిరూపించింది. విశాఖలో జరిగే ఈ మ్యాచ్‌లతో ఆంధ్ర క్రికెట్ చరిత్రలో ఆమె పేరు ప్రత్యేకంగా నిలవనుంది.