
భారత్ లో క్రికెట్ కు ఉన్న క్రేజే వేరు.. టెస్టు, వన్డే, టీ20.. ఇలా ఫార్మాట్ ఏదైనా సరే భారత్ లో చాలా మంది క్రికెట్ ను ఎంజాయ్ చేస్తారు. అయితే, క్రికెట్ లో టెస్టు మ్యాచ్ లు ప్రత్యేకం అని చెప్పాలి. ప్రతీ మ్యాచ్‌లో కొత్త రికార్డులు పుట్టుకొస్తుంటాయి.
టెస్ట్ క్రికెట్‌లో సాధారణంగా ఆట సమయం ఎక్కువగా ఉండేలా కనిపించినా, కొంతమంది భారత బ్యాటర్లు మాత్రం అద్భుతమైన ఆటతో ధనాధన్ ఇన్నింగ్స్ లను ఆడారు. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలను కూడా బాదారు. వారిలో లెజెండరీ ప్లేయర్ల నుంచి ప్రస్తుతం ఆడుతున్న యంగ్ ప్లేయర్లు కూడా ఉన్నారు.
భారత వికెట్ కీపర్, డాషింగ్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ఈ లిస్ట్‌లో మొదటి స్థానంలో ఉన్నాడు. రిషబ్ పంత్ టెస్టు క్రికెట్ లో అనేక అద్భుతమైన ఇన్నింగ్స్ లను ఆడాడు. ప్రస్తుతం జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ 2025 లో కూడా దుమ్మురేపే బ్యాటింగ్ తో అదరగొట్టాడు. అయితే, మాంచెస్టర్ లో గాయం కారణంగా ఓవల్ టెస్టుకు దూరం అయ్యాడు.
రిషబ్ పంత్ 2022లో శ్రీలంకపై ఆడిన మ్యాచ్‌లో కేవలం 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. ఆ తర్వాత 2025లో ఆస్ట్రేలియాతో సిడ్నీ టెస్ట్ లోనూ పంత్ 29 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఇవి టెస్ట్ ఫార్మాట్‌లో సాధించిన వేగవంతమైన హాఫ్ సెంచరీలలో ఒకటిగా నిలిచాయి.
భారత లెజెండరీ ప్లేయర్, స్టార్ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. భారత్ కు తొలి ప్రపంచ కప్ ను అందించారు. ఎంతో మంది క్రికెటర్లకు ఆదర్శంగా నిలిచారు.
భారత క్రికెట్‌కు పునాది వేసిన గొప్ప ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. 1982 లో పాకిస్థాన్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఆయన కేవలం 30 బంతుల్లో 50 పరుగుల నాక్ ఆడారు. మొత్తంగా 53 బంతుల్లో 73 పరుగుల ఇన్నింగ్స్ తో భారత్ ను పోటీలో బలంగా నిలబెట్టారు.
శార్దూల్ ఠాకూర్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. 2021లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో అతను 31 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించారు. ధనాధన్ ఇన్నింగ్స్ తో దుమ్మురేపాడు. మొదటి ఇన్నింగ్స్‌లో మొత్తం 36 బంతుల్లో 57 పరుగులు ఇన్నింగ్స్ ను ఆడాడు. శార్దూల్ ఠాకూర్ స్ట్రైక్ రేట్ టెస్ట్‌కి అసాధారణంగా ఉండటం విశేషం.
టీమిండియా యంగ్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్ దుమ్మురేపే ఇన్నింగ్స్ లతో అదరగొడుతున్నాడు. భయంలేని బ్యాటింగ్ తో ప్రత్యర్థులకు చెమటలు పట్టించే సునామీ ఇన్నింగ్స్ లను ఆడుతున్నాడు. 2024లో సూపర్ నాక్ తో మెరిశాడు.
జైస్వాల్ తనదైన శైలిలో 2024లో బంగ్లాదేశ్‌పై మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 31 బంతుల్లో 50 పరుగులు చేసి తన ప్రతిభను చాటాడు. మొత్తం 51 బంతుల్లో 72 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ తో భారత్ బలంగా నిలిచింది.
జైస్వాల్ ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో కూడా అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొడుతున్నాడు. వరుస వికెట్లు పడుతున్న క్రమంలో ఓవల్ లో ఎంతో విలువైన పరుగులతో సెంచరీ బాదాడు.
టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ గ్రౌండ్ లో ఉన్నాడంటే చాలు ప్రత్యర్థి బౌలర్ ఎవరైనా సరే చెడుగుడు ఆడుకుంటారు. సునామీ బ్యాటింగ్ తో ఉన్నంత సేపు పరుగుల వర్షం కురిపిస్తారు. ఎన్నో మెరుపు ఇన్నింగ్స్ లతో భారత్ కు అనేక విజయాలు అందించారు.
2008లో ఇంగ్లాండ్‌తో చెన్నైలో జరిగిన టెస్ట్‌లో 32 బంతుల్లోనే సెహ్వాగ్ హాఫ్ సెంచరీ సాధించారు. మొత్తంగా 68 బంతుల్లో 83 పరుగులు నాక్ ఆడాడు. తన ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. వీరు టెస్ట్ క్రికెట్‌ను కూడా వన్‌డేలా మార్చే సామర్థ్యం ఉన్న ఆటగాడిగా గుర్తింపు పొందాడు.