ఆల్‌రౌండర్‌కు షాకిచ్చిన శ్రీలంక.. ఏడాది పాటు నిషేధం.. కారణమిదే..

First Published Nov 24, 2022, 1:42 PM IST

ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్ లో గ్రూప్  స్టేజ్ లోనే నిష్క్రమించిన  శ్రీలంక జట్టుకు వరుస షాకులు తాకుతున్నాయి. ఇప్పటికే ఆ జట్టు  బ్యాటర్ ధనుష్క గుణతిలక రేప్ కేసులో ఇరుక్కోగా తాజాగా మరో స్టార్ ఆల్ రౌండర్ కూడా.. 

లంక ఆల్ రౌండర్ చమీక కరుణరత్నెకు శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్‌సీ)  షాకిచ్చింది.  అతడిపై ఏడాది పాటు నిషేధం విధిస్తూ  సంచలన నిర్ణయం తీసుకుంది. టెస్టు, వన్డే, టీ20లతో పాటు దేశవాళీ క్రికెట్ కూడా ఆడకుండా అతడిపై నిషేధం విధించింది.  

ఇటీవలే ప్రపంచకప్ ఆడేందుకు వెళ్లిన కరుణరత్నె.. అక్కడ  ఎస్ఎల్‌సీ నిబంధనలను ఉల్లంఘించడమే  దీనికి కారణం.  నిబంధలను బేఖాతరు  చేసినందుకు గాను  కరుణరత్నెను నిషేధించడమే గాక   అతడిపై ఐదు వేల యూఎస్ డాలర్ల  (భారత కరెన్సీలో  సుమారు రూ. 4 లక్షలు) జరిమానా కూడా విధించింది. 

ఇదే విషయమై ఎస్ఎల్‌సీ  ఓ ప్రకటనలో స్పందిస్తూ.. ‘ఇటీవల ముగిసిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ సందర్భంగా కాంట్రాక్టులోని నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను  కరుణరత్నె పై ఏడాది పాటు నిషేధం విధించాం. కరుణరత్నెపై వచ్చిన ఆరోపణలపై  ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని  నియమించాం. 

ఈ కమిటీలో  కరుణరత్నె  తన నేరాన్ని ఒప్పుకున్నాడు.  ఇది నిబంధనలను ఉల్లంఘించడం కిందికే వస్తుంది.  అందుకే అతడిపై  ఏడాది బ్యాన్ విధించాం. అంతేగాక మళ్లీ ఇలాంటి తప్పులు చేయకూడదని  గట్టిగా మందలించాం.  ఈ ఏడాదికాలంలో కరుణరత్నె  ఏ ఫార్మాట్ క్రికెట్ కూడా ఆడటానికి వీళ్లేదు. ఏడాది తర్వాత నిషేధం ఎత్తివేస్తాం..’అని తెలిపింది. 
 

అయితే కరుణరత్నె ఏం  నేరం చేశాడనే విషయాన్ని ఎస్ఎల్‌సీ వెల్లడించలేదు. కానీ పలు రిపోర్టుల ప్రకారం.. టీ20 ప్రపంచకప్ లో భాగంగా అక్కడికి వెళ్లిన కరుణరత్నె బ్రిస్బేన్ లో ఓ క్యాసినోలో కొంతమందితో గొడవపడ్డట్టు తెలుస్తున్నది. దీంతో  ఎస్ఎల్‌సీ అతడిపై చర్యలకు ఉపక్రమించింది. 

కరుణరత్నె కంటే ముందు మరో లంక క్రికెటర్ ధనుష్క గుణతిలక ప్రపంచకప్ ఆడేందుకు ఆసీస్ కు వెళ్లి అక్కడ ఓ యువతిని రేప్ చేసిన కేసులో జైలుకెళ్లిన విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితమే అతడికి బెయిల్ దొరికినా దేశం దాటి వెళ్లడానికి వీళ్లేదని గుణతిలకకు సిడ్నీ లోని స్థానిక కోర్టు ఆదేశించింది. 

click me!