
రోహిత్ శర్మకు బిగ్ షాక్ తగిలింది. శనివారం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత జట్టును ప్రకటించింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి జట్టులో వచ్చారు. కానీ, రోహిత్ శర్మకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఎందుకంటే రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించారు. ప్రపంచ నంబర్ 1 వన్డే బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్‌కు వన్డే జట్టు నాయకత్వం అప్పగించారు. దీంతో రోహిత్ శర్మ ఇప్పుడు కేవలం బ్యాట్స్‌మన్‌గా మాత్రమే కొనసాగనున్నారు.
బీసీసీఐ నిర్ణయం రోహిత్ శర్మ అభిమానులకు షాక్ కు గురిచేసింది. ఆస్ట్రేలియాతో మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో గిల్‌ను భారత జట్టుకు కెప్టెన్‌గా నియమించారు. దీంతో రోహిత్ శర్మ ఇప్పుడు ప్లేయర్ గా మాత్రమే జట్టులో కొనసాగనున్నారు. రోహిత్ ఇప్పటికే టెస్ట్, టీ20 ఫార్మాట్‌ల నుండి రిటైర్మెంట్ తీసుకున్నాడు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్ లో మాత్రమే కొనసాగుతున్నారు. రాబోయే వన్డే ప్రపంచ కప్ లో జట్టును నడిపించాలనుకున్న హిట్ మ్యాన్ కు షాక్ గా మారింది. అతను కెప్టెన్సీని కోల్పోయాడు. కాబట్టి వరల్డ్ కప్ లో కూడా దాదాపు గిల్ కెప్టెన్ గా ఉండే అవకాశముంది.
2027లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలు వేదికలుగా వన్డే ప్రపంచకప్ జరగనుంది. వన్డే ప్రపంచ కప్ ప్రణాళికల్లో భాగంగా బీసీసీఐ, సెలక్షన్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. భవిష్యత్తు నాయకుడిగా గిల్ ను తయారు చేయాలనే ఉద్దేశంలో ఇప్పుడే భారత జట్టు కెప్టెన్సీని గిల్ కు అప్పగించారు.
గిల్ తన ప్రశాంత స్వభావం, క్రమశిక్షణ, అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనలతో సెలెక్టర్ల నమ్మకాన్ని గెలుచుకున్నాడు. ఆయన ఇప్పటికే టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నారు. ఇటీవల ఆసియా కప్ 2025లో వైస్ కెప్టెన్‌గా విజయవంతంగా టీమ్ ను ముందుకు నడిపించాడు.
వన్డే సిరీస్‌లో జస్ప్రిత్ బుమ్రా విశ్రాంతి తీసుకోనున్నారు. అతను ఇటీవల ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్, ఆసియా కప్‌లో జట్టులో భాగంగా ఉన్నాడు. వర్క్ లోడ్ నేపథ్యంలో బుమ్రా స్థానంలో ప్రసిద్ధ కృష్ణ, అర్షదీప్ సింగ్‌లు వన్డే జట్టులో చోటు దక్కించుకున్నారు. అయితే టీ20 సిరీస్‌లో బుమ్రా జట్టులో కనిపించనున్నాడు.
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్‌కీపర్), అక్షర్ పటేల్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్షదీప్ సింగ్, ధ్రువ్ జురేల్ (వికెట్‌కీపర్), యశస్వీ జైస్వాల్.
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివం దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్‌కీపర్), వరుణ్ చక్రవర్తి, జస్ప్రిత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సంజూ శాంసన్(వికెట్‌కీపర్), రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్.
స్టార్ వికెట్‌కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ ను ఈ సిరీస్‌కు దూరంగా ఉంచారు. 2025 జూలైలో ఆయన చివరి మ్యాచ్ ఆడారు. మాంచెస్టర్‌లో భారత్-ఇంగ్లాండ్ నాల్గవ టెస్టులో కాలు గాయం నుంచి ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. పంత్ ఇంకా రిహ్యాబ్‌లోనే ఉన్నారు.
బీసీసీఐ అధికారులు ఆయనను తొందరగా మైదానంలోకి తీసుకురాకుండా పూర్తిగా కోలుకున్న తర్వాతనే ఆడించాలని నిర్ణయం తీసుకున్నారు. దక్షిణాఫ్రికా సిరీస్‌లో రిషబ్ పంత్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశముంది.
భారత జట్టు అక్టోబర్ 19 నుంచి మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ పర్యటనను 2027 ప్రపంచకప్ సన్నాహకాలలో భాగంగా బీసీసీఐ చూస్తోంది. గిల్ నాయకత్వంలో కొత్త ఉత్సాహంతో జట్టు ఎలాంటి ప్రదర్శన ఇస్తుందో చూడాలి.