Published : Sep 30, 2025, 11:53 PM ISTUpdated : Oct 01, 2025, 12:07 AM IST
ICC Womens World Cup 2025 : వరల్డ్ కప్ 2025 తొలి మ్యాచ్‌లో భారత్ మహిళలు శ్రీలంకపై 58 పరుగుల తేడాతో విజయం సాధించారు. అమన్‌జోత్ కౌర్, దీప్తి శర్మలు ఈ విజయంలో కీలక పాత్ర పోషించారు.
గెలుపుతో వరల్డ్ కప్ 2025 ప్రయాణం మొదలుపెట్టిన భారత్
ఐసీసీ మహిళా వరల్డ్ కప్ 2025ని భారత్ విజయంతో ప్రారంభించింది. గౌహతిలోని బార్సాపారా క్రికెట్ స్టేడియంలో భారత్, శ్రీలంక జట్లు ఈ మెగా టోర్నీ తొలి మ్యాచ్ లో తలపడ్డాయి. వర్షం కారణంగా మ్యాచ్ 47 ఓవర్లకు కుదించారు. భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 269/8 పరుగులు చేసింది. డిఎల్ఎస్ పద్ధతి ప్రకారం శ్రీలంకకు 271 పరుగుల లక్ష్యం ఉంచగా, శ్రీలంక 211 పరుగులకు ఆలౌట్ అయింది.
25
తడబడిన భారత బ్యాటింగ్
భారత్ బ్యాటింగ్ ఆరంభంలోనే షాకులు ఎదుర్కొంది. మంచి ఫామ్ లో ఉన్న స్మృతి మంధానా ఈ మ్యాచ్ లో కేవలం 8 పరుగులకే ఔటయ్యారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 21 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. హర్లీన్ డియోల్ 48, ప్రతికా రావల్ 37 పరుగులతో కొంత సమయం క్రీజులో ఉన్నారు. వీరి తర్వాత వరుసగా వికెట్లు కోల్పోవడంతో భారత జట్టు 124/6 స్కోరుతో ఒత్తిడిలో పడింది. శ్రీలంక తరఫున ఇనోకా రనవీరా అద్భుతంగా బౌలింగ్ చేసి నాలుగు వికెట్లు తీశారు.
35
దీప్తి శర్మ-అమన్‌జోత్ భాగస్వామ్యం
కష్ట సమయంలో దీప్తి శర్మ, అమన్‌జోత్ కౌర్ జట్టును కాపాడారు. ఈ జంట ఏడో వికెట్‌కి 103 పరుగుల కీలక భాగస్వామ్యం అందించింది. అమన్‌జోత్ కౌర్ 65 బంతుల్లో 57 పరుగులు చేశారు. దీప్తి శర్మ 53 బంతుల్లో 53 పరుగుల హాఫ్ సెంచరీ నాక్ ఆడారు. స్నేహ్ రాణా కూడా 15 బంతుల్లో 28 పరుగులు చేయడంతో భారత్ 269 పరుగులు చేసింది.
271 పరుగుల లక్ష్యంతో శ్రీలంక ఇన్నింగ్స్ ఆరంభించింది. మంచి ఆరంభం లభించింది కానీ భారత బౌలర్లు అద్భుతమైన కమ్ బ్యాక్ తో లంక బ్యాటర్లను వరుసగా పెవిలియన్ కు పంపారు. కెప్టెన్ చమారి అటపట్టు 43 పరుగులు చేశారు. హర్షిత సమరవిక్రమ 29, నిలాక్షి డి సిల్వా 35 పరుగులతో పోరాడారు. కానీ, శ్రీలంక జట్టు 45.4 ఓవర్లలో 211 పరుగులకే ఆలౌట్ అయింది.
55
భారత్ vs శ్రీలంక మ్యాచ్ లో బౌలర్ల ఆధిపత్యం
ఈ మ్యాచ్ లో బౌలర్ల ఆధిపత్యం కనిపించింది. భారత్ బౌలర్లలో దీప్తి శర్మ 10 ఓవర్లలో 54 పరుగులిచ్చి 3 వికెట్లు తీశారు. స్నేహ్ రాణా 2 వికెట్లు తీసి ప్రత్యర్థిని ఇబ్బందిపెట్టారు. శ్రీ చరణి 2 వికెట్లు, ప్రతికా రావల్ 1 వికెట్ తీశారు. శ్రీలంక తరఫున ఇనోకా రనవీరా 4 వికెట్లు తీసి ఆకట్టుకున్నారు.
ఈ విజయంతో భారత్ మహిళల జట్టు వరల్డ్ కప్ 2025ను విజయవంతంగా ఆరంభించింది. 124/6 పరిస్థితి నుంచి తిరిగి నిలబడి, ఆ తర్వాత బౌలర్ల అద్భుత ప్రదర్శనతో 58 పరుగుల తేడాతో గెలిచింది. అమన్‌జోత్ కౌర్, దీప్తి శర్మ బ్యాటింగ్‌లో కీలక పాత్ర పోషించగా, బౌలర్లలో దీప్తి, స్నేహ్ రాణాలు మెరిశారు.