Indian Cricket Team: టీమిండియా సీనియర్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ టీ20, టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం వన్డే క్రికెట్ లో కొనసాగుతున్నాడు. అయితే, వన్డేల్లో కూడా రోహిత్ శర్మ గేమ్ ఓవర్ అయిందని మాజీ ప్లేయర్లు పేర్కొంటున్నారు.
టీ20 వరల్డ్‌కప్ 2024 ముగిసిన తర్వాత భారత క్రికెట్‌లో పెద్ద మార్పులు మొదలయ్యాయి. సీనియర్ స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా టీ20 ఫార్మాట్‌కి వీడ్కోలు చెప్పారు. అనంతరం టెస్ట్ ఫార్మాట్‌కి రోహిత్, కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ గుడ్‌బై చెప్పారు. టీ20లో సూర్యకుమార్ యాదవ్, టెస్ట్‌లో శుభ్ మన్ గిల్ నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. అయితే వన్డేలో ఇంకా రోహిత్ శర్మనే కెప్టెన్‌గా కొనసాగుతున్నా, అతని స్థానాన్ని యంగ్ కెప్టెన్‌కు ఇవ్వాలని ఆలోచనలు జరుగుతున్నాయి.
25
కెప్టెన్సీకి గిల్ సిద్ధంగా ఉన్నాడన్న కైఫ్
భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ మాట్లాడుతూ.. ఇంగ్లాండ్ పర్యటనలో శుభ్ మన్ గిల్ ప్రదర్శన ఆధారంగా వన్డే కెప్టెన్సీకి అతను సిద్ధంగా ఉన్నాడని చెప్పారు. గిల్ తన తొలి టెస్ట్ సిరీస్‌కి కెప్టెన్‌గా భారత్‌కు నాయకత్వం వహించి, 2-2తో డ్రా చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గిల్ నిలిచాడు.
35
గిల్‌పై కైఫ్ ప్రశంసలు
కైఫ్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. ‘‘గిల్ చాలా శాంతంగా నాయకత్వం వహించాడు. ఒత్తిడిలోనూ తడబడలేదు. అతనికి వన్డే కెప్టెన్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రోహిత్ ఎప్పటివరకు కెప్టెన్‌గా ఉంటాడో ఎవరికీ తెలియదు. గిల్ బాధ్యత తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. తెలివిగా బ్యాటింగ్ చేస్తాడు. కెప్టెన్‌గా ముందుండి జట్టుకు మార్గనిర్దేశనం చేశాడు’’ అని వెల్లడించారు.
రోహిత్, విరాట్, అశ్విన్ వంటి సీనియర్లు లేని సమయంలో గిల్ నేతృత్వంలో యువ జట్టు ఇంగ్లాండ్ తో సిరీస్‌ను డ్రా చేయగలదని ఎవ్వరూ ఊహించలేదు. కానీ 25 ఏళ్ల గిల్ దాన్ని సాధించాడు. ‘‘గిల్‌కు కెప్టెన్సీ ఇవ్వడంపై విమర్శలు వచ్చాయి. కానీ అతను ఒత్తిడిలోనూ తక్కువ అనుభవంతో ఉన్న జట్టుతో ఇంగ్లాండ్‌కు వెళ్లాడు. తన బ్యాటుతో సమాధానం ఇచ్చాడు. ఒక దశలో బ్రాడ్‌మాన్ రికార్డులకూ పోలికలు వచ్చాయి’’ అని కైఫ్ గుర్తు చేశారు.
55
ఇంగ్లాండ్‌లో గిల్ పరుగుల వరద
ఇంగ్లాండ్ పర్యటనలో గిల్ 10 ఇన్నింగ్స్‌లలో 75.4 సగటుతో 754 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు ఉన్నాయి. లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో గిల్ 147 పరుగులు చేశాడు. అదే మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో 8 పరుగులు చేశాడు. బర్మింగ్‌హామ్‌లో జరిగిన రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలో 269, 161 పరుగులు చేశారు. మిగిలిన ఇన్నింగ్స్‌లలో వరుసగా 16, 6, 12, 103, 21, 11 పరుగులు చేశారు.
గిల్ ప్రదర్శన, అతని శాంతమైన నాయకత్వం టీమిండియా కొత్త వన్డే కెప్టెన్‌గా మారే అవకాశాలను పెంచుతున్నాయి. గౌతమ్ గంభీర్ కోచ్‌గా, యువతను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఉన్న ఈ సమయంలో గిల్‌కి కెప్టెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.