ICC Test Rankings : ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టాప్‌లో కొనసాగుతున్నాడు. సిరాజ్ 12 స్థానాలు ఎగబాకి 15వ స్థానానికి చేరాడు.
ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ 2-2తో ముగిసింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేని టీమిండియా ఈ సిరీస్‌లో యువ ఆటగాళ్లతోనే అద్భుతంగా రాణించింది. శుభ్‌మన్ గిల్, ముహమ్మద్ సిరాజ్, యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్, ఆకాశ్‌దీప్‌లు తమ ఆటతీరుతో అదరగొట్టారు.
ఈ సిరీస్ లో తమ అద్భుతమైన ప్రదర్శనతో తాజాగా విడుదలైన ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో జోరు కొనసాగించారు. ప్రత్యేకించి ముహమ్మద్ సిరాజ్, జైస్వాల్‌లు తమ కెరీర్‌లో అత్యుత్తమ స్థాయికి చేరారు.
DID YOU KNOW ?
ఇండియా-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ 2025లో పరుగుల వరద
ఇండియా-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో మొత్తం 7187 పరుగులు నమోదయ్యాయి. 5 టెస్టుల్లో రికార్డు ఇది. భారత్ 3807 పరుగులు చేసింది.
25
టాప్ లో జో రూట్.. 5వ స్థానంలోకి జైస్వాల్
ఇంగ్లాండ్ సీనియర్ స్టార్ ప్లేయర్ జో రూట్ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. అతనికి 908 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. భారత్‌తో సిరీస్‌లో 537 పరుగులు చేశాడు. మరో సారి తన బ్యాట్ పవర్ ను చూపించాడు.
భారత యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మూడు స్థానాలు ఎగబాకి 5వ స్థానానికి చేరాడు. అతనికి 792 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. కేన్ విలియమ్సన్ 858 పాయింట్లతో 3వ స్థానం, స్టీవ్ స్మిత్ 816 పాయింట్లతో 4వ స్థానం, హ్యారీ బ్రూక్ 868 పాయింట్లతో రెండవ స్థానంలో ఉన్నారు.
భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 13వ స్థానంలో ఉన్నాడు. గాయంతో ఓవల్ టెస్ట్‌కు దూరమైన రిషబ్ పంత్ 768 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచాడు.
35
బౌలింగ్‌లో సిరాజ్ దూకుడు
ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో భారత పేసర్ సిరాజ్ అద్భుతమైన బౌలింగ్ తో అదరగొట్టాడు. 23 వికెట్లు తీసిన మహమ్మద్ సిరాజ్ 12 స్థానాలు ఎగబాకి తన కెరీర్‌లో తొలిసారి 15వ స్థానానికి చేరాడు. అలాగే, ప్రసిద్ధ్ కృష్ణ 25 స్థానాలు మెరుగుపరచుకొని 59వ స్థానం సాధించాడు. ఇండియాకి చెందిన మరో టాప్ బౌలర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌లు మొదటి 30 స్థానాల్లో నిలిచారు.
జస్ప్రీత్ బుమ్రా టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. తన అద్భుతమైన ప్రదర్శనతో టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడ రెండవ స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మూడవ స్థానంలో కొనసాగుతున్నాడు. బుమ్రా స్థిరమైన ప్రదర్శనలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాడు.
55
జట్టుగా మెరుగైన ప్రదర్శన ఇచ్చిన భారత్
ఇంగ్లాండ్ సిరీస్ లో భారత జట్టు అద్భుతమైన పోరాటాన్ని చూపించింది. బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొట్టింది. దీంతో ఈసారి టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత్ తరఫున యువ ఆటగాళ్లు ఎక్కువగా మెరిశారు. జైస్వాల్ బ్యాటింగ్‌లో, సిరాజ్ బౌలింగ్‌లో చక్కటి ప్రదర్శనతో ర్యాంకింగ్స్‌ను మెరుగుపర్చారు.
సీనియర్ ఆటగాళ్లు లేని పరిస్థితుల్లో యంగ్ ప్లేయర్లు తమ ప్రతిభను నిరూపించారు.ఇది భవిష్యత్తులో భారత క్రికెట్ బలంగా నిలవడానికి బాటలు వేస్తోంది.