Ravindra Jadeja: ఇంగ్లాండ్‌లో రవీంద్ర జడేజా కొత్త‌ చరిత్ర.. గ్యారీ సోబర్స్, కోహ్లీ రికార్డులు బ్రేక్

Published : Aug 02, 2025, 11:59 PM IST

Ravindra Jadeja: ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో భారత ఆల్ రౌండర్ ర‌వీంద్ర‌ జడేజా ఆరు హాఫ్ సెంచ‌రీలు కొట్టి చరిత్ర సృష్టించాడు. గ్యారీ సోబర్స్ రికార్డుతో పాటు విరాట్ కోహ్లీ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు.

PREV
15
చరిత్ర సృష్టించిన ర‌వీంద్ర‌ జడేజా

భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చ‌రిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్‌లో టెస్ట్ క్రికెట్ చరిత్రలో త‌న‌దైన‌ ముద్ర వేశాడు. ది ఓవల్‌లో జరుగుతున్న ఐదవ టెస్ట్ మ్యాచ్ లో మూడో రోజు, జడేజా మరో హాఫ్ సెంచ‌రీతో ఇన్నింగ్స్ తో ప్రత్యేకమైన ఘనత సాధించారు.

జడేజా 77 బంతుల్లో 53 పరుగులతో భార‌త్ కు విలువైన ఇన్నింగ్స్ ను ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఐదు బౌండరీలు బాదాడు. గణాంకాల ప్రకారం ఈ నాక్ తో జ‌డేజా లెజెండ‌రీ ప్లేయ‌ర్ల రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టాడు.

25
గ్యారీ సోబర్స్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన జడేజా

ఈ హాఫ్ సెంచ‌రీ ఇన్నింగ్స్‌తో ర‌వీంద్ర‌ జడేజా ఇంగ్లాండ్‌లో ఒకే టెస్ట్ సిరీస్‌లో నంబర్ 6 లేదా అంతకంటే దిగువ స్థాయిలో బ్యాటింగ్ చేస్తూ ఆరు సార్లు 50 పరుగుల కన్నా ఎక్కువ చేసిన మొట్టమొదటి బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అలాగే, వెస్టిండీస్ క్రికెట్ లెజెండ్ గ్యారీ సోబర్స్ 1966లో నెలకొల్పిన రికార్డును (ఐదు హాఫ్ సెంచ‌రీలు) అధిగమించాడు.

35
భారత క్రికెట్ రికార్డుల్లోనూ జ‌డేజా కొత్త శకం

ర‌వీంద్ర జడేజా ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు. ఇంతకు ముందు సునీల్ గావాస్కర్ (1979), విరాట్ కోహ్లీ (2018), రిషభ్ పంత్ (2025) ఇలా ముగ్గురు భారతీయులు ఇంగ్లాండ్‌లో ఒకే సిరీస్‌లో ఐదు 50+ స్కోర్లు సాధించారు. ఇప్పుడు జడేజా ఆ సంఖ్యను దాటి ఆరు హాఫ్ సెంచ‌రీలు బాదాడు.

ఇంకా, నంబర్ 6 లేదా అంతకంటే దిగువ బ్యాటింగ్ చేసి ఒకే సిరీస్‌లో 500 పరుగుల మార్కును దాటిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందాడు. జడేజా ఈ సిరీస్ లో ఇప్పటి వరకు 516 పరుగులు చేశాడు. ఈ క్రమంలో జడేజా 2002లో వెస్టిండీస్ పర్యటనలో వీవీఎస్ లక్ష్మణ్ చేసిన 474 పరుగుల రికార్డును కూడా బ‌ద్ద‌లు కొట్టాడు.

45
అంతర్జాతీయ రికార్డులతో జ‌డేజా

ఇంగ్లాండ్‌లో నంబర్ 6 లేదా దిగువ స్థాయిలో బ్యాటింగ్ చేసినప్పుడు అత్యధిక 50+ స్కోర్లు సాధించిన బ్యాట్స్‌మన్‌గా జడేజా (10) టాప్ లో నిలిచాడు. గ్యారీ సోబర్స్ (9 హాఫ్ సెంచ‌రీల‌) కంటే ఎక్కువగా ఉంది.

ఒక విదేశీ టెస్ట్ సిరీస్‌లో నంబర్ 6 లేదా దిగువ స్థాయిలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో జడేజా (516 ప‌రుగులు) మూడవ స్థానంలో ఉన్నాడు. అతని ముందు గ్యారీ సోబర్స్ (722 ప‌రుగులు), పాకిస్థాన్ ఆటగాడు వసీం రాజా (517 ప‌రుగులు) మాత్రమే ఉన్నారు.

55
టాప్ బ్యాటర్ల జాబితాలో జడేజాకు స్థానం

ఈ సిరీస్‌లో జడేజా ఒక సెంచరీతో పాటు ఐదు హాఫ్ సెంచ‌రీలు నమోదు చేశాడు. అతని అత్యధిక స్కోరు మాంచెస్టర్ టెస్టులో చేసిన అజేయ 107 ప‌రుగులు.

బ్యాట్ తోనే కాదు బాల్ తో కూడా జ‌డేజా తన సత్తా చాటాడు. ఇప్పటి వరకు ఏడు వికెట్లు తీసుకున్నాడు.

2025 ఇంగ్లాండ్ సిరీస్‌లో 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన మూడవ భారతీయుడిగా జడేజా నిలిచాడు. అతని ముందు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (754 ప‌రుగులు), కేఎల్ రాహుల్ (532 ప‌రుగులు) ఉన్నారు. ఒకే సిరీస్‌లో ముగ్గురు భారతీయులు 500+ పరుగులు చేయ‌డం ఇదే తొలిసారి.

భారత బ్యాట్స్‌మన్లు ఇంగ్లాండ్‌లో ఒకే సిరీస్‌లో అత్యధిక 50+ స్కోర్లు:

6 – రవీంద్ర జడేజా (2025)

5 – సునీల్ గావాస్కర్ (1979)

5 – విరాట్ కోహ్లీ (2018)

5 – రిషభ్ పంత్ (2025)

Read more Photos on
click me!

Recommended Stories