
ఓవల్‌లో జరుగుతున్న ఐదవ టెస్టు మ్యాచ్‌లో మూడవ రోజు భారత జట్టు ఆధిపత్యాన్ని కొనసాగించింది. యశస్వి జైస్వాల్ సెంచరీ, వాషింగ్టన్ సుందర్ చివరలో దూకుడు బ్యాటింగ్ ప్రదర్శనతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో మొత్తం 396 పరుగులు చేసింది. ఫలితంగా ఇంగ్లాండ్ ముందు 374 పరుగుల భారీ టార్గెట్ ను ఉంచింది.
ఇంతవరకు ఓవల్‌లో టెస్ట్ మ్యాచ్‌లో 263 పరుగులకంటే ఎక్కువ విజయలక్ష్యం ఎవరూ ఛేదించలేదు. ఆ రికార్డు 1902లో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ ఒక్క వికెట్ తేడాతో గెలిచింది.
భారత జట్టు యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఓవల్ లో సెంచరీతో దుమ్మురేపాడు. 164 బంతుల్లో 118 పరుగులు నాక్ ఆడాడు. ఇది ఈ సిరీస్‌లో ఆయనకు రెండో సెంచరీ కావడం విశేషం. తొలి టెస్టులో హెడ్డింగ్లీలో సెంచరీ చేసిన జైస్వాల్, ఈ మ్యాచ్‌లోనూ కఠిన పరిస్థితుల్లో తన స్థిరమైన ఆటతీరుతో జట్టును ముందుకు నడిపించాడు.
జైస్వాల్‌కు నైట్ వాచ్ మన్ గా వచ్చిన ఆకాష్ దీప్ అద్భుత మద్దతు ఇచ్చాడు. ఆకాష్ దీప్ తన మొదటి టెస్టు హాఫ్ సెంచరీ నమోదు చేస్తూ 66 పరుగుల ఇన్నింగ్స్ ను ఆడాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 107 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
భారత ఇన్నింగ్స్ చివరలో వాషింగ్టన్ సుందర్ మెరుపు ఇన్నింగ్స్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 46 బంతుల్లోనే 53 పరుగుల నాక్ ఆడాడు. ఈ హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సులు కొట్టాడు. జోష్ టంగ్ ఓవర్లో మూడు సిక్సులతో దుమ్మురేపాడు. సుందర్ 39 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు.
ఆఖరి వికెట్‌కు ప్రసిద్ధ్ కృష్ణతో కలిసి సుందర్ 39 పరుగులు జోడించాడు. ఈ భాగస్వామ్యంలో కృష్ణ ఖాతా తెరవకపోయినా, సుందర్ దూకుడుతో స్కోరు 396 పరుగులకు చేరింది.
ఇంగ్లాండ్ ను ఫీల్డింగ్ దెబ్బకొట్టింది. మొత్తం ఆరు క్యాచ్‌లు వదిలేయడం మ్యాచ్‌పై తీవ్ర ప్రభావం చూపింది. వాటిలో మూడు సెంచరీ హీరో యశస్వి జైస్వాల్‌కు చెందినవే. శుక్రవారం రెండు అవకాశాలు వదిలిన ఇంగ్లాండ్.. మూడవ రోజు మరోసారి అతనికి లైఫ్ ఇచ్చింది. ఇంగ్లాండ్ ఫీల్డింగ్ తప్పులతో లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ జైస్వాల్ సెంచరీ బాదాడు.
అలాగే, క్రిస్ వోక్స్ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో ఇంగ్లాండ్ బౌలింగ్‌లో నష్టపోయింది. జోష్ టంగ్ (5/125) ఐదు వికెట్లు తీసినా, మిగిలిన బౌలర్లు, ఫీల్డర్లు సహకరించకపోవడం అతని ప్రయత్నాలను దెబ్బకొట్టాయి.
రవీంద్ర జడేజా మరోసారి కీలకంగా నిలిచాడు. హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ తో మెరిశాడు. ఇది ఆయనకు సిరీస్‌లో ఐదవ హాఫ్ సెంచరీ. 77 బంతుల్లో 53 పరుగులు చేసిన జడేజా, జట్టుకు మద్దతుగా నిలిచాడు. ఆకాష్ దీప్ కూడా 66 పరుగులతో జట్టుకు విలువైన మద్దతు ఇచ్చాడు. జాక్ క్రాలీ ఒక సులభమైన క్యాచ్ వదిలేయడంతో లభించిన లైఫ్ ను ఉపయోగించుకుని భారత్ కు విలువైన పరుగులు చేశాడు.
ఇప్పటివరకు ఓవల్‌లో 263 పరుగుల టార్గెట్ ను మాత్రమే ఛేదించారు. కానీ ఇప్పుడు ఇంగ్లాండ్ ముందు 374 పరుగుల లక్ష్యం ఉండటంతో వారి ముందున్న సవాలు ఎంతో భారీగా ఉంది. ఇది కేవలం మ్యాచ్ గెలుపు మాత్రమే కాదు, సిరీస్‌ను 3-1తో ముగించే అవకాశంగా కూడా ఉంది. అయితే ఆ లక్ష్యం చేరుకోవడం ఇంగ్లాండ్ కు అంత ఈజీ కాదు. టార్గెట్ ను అందుకుంటే ఇది కొత్త చరిత్ర అవుతుంది.
ఈ మ్యాచ్‌లో ప్రస్తుతం భారత్ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ఇక ఇంగ్లాండ్ అద్భుత ప్రదర్శన చేస్తే తప్ప గెలిచే అవకాశాలు లేవు. భారత్ గెలిస్తే సిరీస్ 2-2తో సమం అవుతుంది.