
india olympic dream 2036: ఒలింపిక్స్ 2036 నిర్వహణకు భారత్ వేసే బిడ్‌పై తొలి అడుగు పడింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)తో “కాంటిన్యూయస్ డైలాగ్” ప్రక్రియలో భాగంగా భారత ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం లుసానేలో ఉన్న ఐఓసీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది.
ఈ ప్రతినిధి బృందంలో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ. ఉషా, గుజరాత్ రాష్ట్ర క్రీడా మంత్రి హర్ష్ రమేష్‌భాయ్ సంఘ్వీ, కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ, గుజరాత్ ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
2023లో ముంబయిలో జరిగిన ఐఓసీ సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ 2036 ఒలింపిక్స్‌ను భారత్‌లో నిర్వహించాలన్న ఆశయాన్ని వెల్లడించారు.
దానికి అనుసంధానంగా అదే ఏడాది అక్టోబరులో భారత్ అధికారికంగా లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను సమర్పించింది. తాజాగా లుసానేలో జరిగిన చర్చలు ఆ ప్రయత్నానికి కీలక మలుపుగా నిలిచాయి.
ఈ ప్రతినిధి బృందంలో గుజరాత్ క్రీడాశాఖ ప్రధాన కార్యదర్శి అశ్విని కుమార్, నగరాభివృద్ధి శాఖ కార్యదర్శి థెన్నరసన్, క్రీడా అసోసియేషన్ కార్యదర్శి హరిరంజన్ రావ్ లాంటి అధికారులు కూడా ఉన్నారు.
ఈ చర్చల్లో భారత ప్రతినిధులు 2036 ఒలింపిక్స్‌ను అహ్మదాబాద్‌లో నిర్వహించాలన్న తమ దృష్టిని ఐఓసీ ముందు ఉంచారని సమాచారం. “ఈ పరస్పర మార్పిడి భారత బృందానికి తమ దృష్టిని మరింత ముందుకు తీసుకువచ్చే అవకాశంగా ఉంది. ఇది వికసిత భారత్ 2047 దిశగా భారత్ అడుగులు వేస్తున్న సమయంలో కీలక అనుసంధానంగా ఉంది” అని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.
ఒలింపిక్స్‌కు అహ్మదాబాద్ నగరాన్ని బిడ్ చేయడంపై మూడు ప్రధాన విషయాలు ఉన్నాయని ప్రతినిధులు వివరించారు:
1. భారత యువతకు తమ మట్టి మీద ఒలింపిక్స్‌ను ప్రత్యక్షంగా చూసే మొదటి అవకాశం కల్పించడం.
2. సామాజిక-ఆర్థిక అభివృద్ధి, విద్య, ఆవిష్కరణల ద్వారా సమాజాన్ని ముందుకు నడిపించడం.
3. భారతీయ తత్వం ‘వసుధైవ కుటుంబకం’ను ప్రతిబింబించే విధంగా, ప్రపంచాన్ని ఒక కుటుంబంగా ఆహ్వానించడం.
గుజరాత్ రాష్ట్ర క్రీడా మంత్రి హర్ష్ సంఘ్వీ మాట్లాడుతూ, “గుజరాత్‌కు ఇది చారిత్రకమైన అవకాశంగా నిలుస్తుంది. క్రీడలపై మేము తీసుకుంటున్న చర్యలు, ఒలింపిక్ మూవ్‌మెంట్‌పై మా నిబద్ధత ఇందుకు ఉదాహరణ. ఇది రాష్ట్రానికి, దేశానికి ప్రగతికి మార్గదర్శకంగా ఉంటుంది” అన్నారు. అలాగే ఐఓసీతో మద్దతుగా పనిచేయడానికి తమ రాష్ట్రం సిద్ధంగా ఉందని తెలిపారు.
ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ. ఉషా మాట్లాడుతూ, “ఒలింపిక్ మూవ్‌మెంట్‌తో భారత్ నేడు ఒక మార్పు దశలో ఉంది. క్రీడల ద్వారా శాంతి, విద్య, సంస్కృతుల పరస్పర మార్పిడి లాంటి ఒలింపిసిజం స్ఫూర్తిని అంగీకరించడమే మా దృష్టి. భారత్‌లో ఒలింపిక్స్ జరగడం ఒక అద్భుత కార్యక్రమమే కాకుండా, రాబోయే తరాలకు మార్గనిర్దేశకంగా నిలుస్తుంది” అని వివరించారు.
గతంలో భారత్ ఢిల్లీలో ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ లాంటి అంతర్జాతీయ ఈవెంట్లు నిర్వహించిన అనుభవం ఉంది. ఇప్పుడు ఒలింపిక్స్ నిర్వహణను సిద్ధమవుతోంది. కేంద్రం, గుజరాత్ ప్రభుత్వాలు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.
ఇప్పటికే అహ్మదాబాద్‌లో కొత్త స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ను నిర్మించే పనులు ప్రారంభమయ్యాయని ప్రభుత్వం వర్గాలు పేర్కొంటున్నాయి. ఐఓసీ సభ్యురాలు నీతా అంబానీ కూడా భారత్ తరపున అహ్మదాబాద్ బిడ్‌కు మద్దతు తెలుపుతున్నారు.
ఒలింపిక్స్ నిర్వహణ కోసం దరఖాస్తు చేసే దేశాలకు ఐఓసీ ప్రాథమికంగా చర్చలు జరుపుతుంది. ఈ క్రమంలో భారత్ ప్రతినిధుల లుసానే పర్యటనను ఒక ముందడుగుగా పరిగణించవచ్చు.
ఒలింపిక్స్ 2036పై అధికారిక నిర్ణయం తేలడానికి ఇంకా సమయం ఉన్నా, భారత్ చేసే ప్రణాళికలు, విశ్వసనీయత, మౌలిక వసతులు ప్రధాన పాత్ర పోషించనున్నాయి.
భారత్‌కు ఇది క్రీడల చరిత్రలో ఒక మైలురాయి కావచ్చు. పెద్ద సంఖ్యలో ఉన్న దేశ యువతకు ఇది శక్తివంతమైన ప్రేరణగా కూడా మారవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.