New Rules From January 1 : ఐటీఆర్ నుంచి ఎల్‌పీజీ వరకు... న్యూ ఇయర్‌లో మారనున్న 7 కీలక రూల్స్ ఇవే !

Published : Dec 31, 2025, 03:44 PM IST

New Rules From January 1 2026 : జనవరి 1, 2026 నుంచి 8వ వేతన సంఘం, ఐటీఆర్, ఎల్‌పీజీ, కార్ల ధరలు, డిజిటల్ పేమెంట్స్ సహా పలు నిబంధనలు మారుతున్నాయి. ఇవి మీ జేబుపై ఎలా ప్రభావం చూపుతాయో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
18
జనవరి 1 నుంచి మారనున్న 8 కీలక నిబంధనలు

2026 సంవత్సరం తనతో పాటు అనేక మార్పులను తీసుకువస్తోంది. ఈ మార్పులన్నీ నేరుగా సామాన్యుల ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, సేవింగ్స్, పన్నులకు సంబంధించిన అంశాలలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. వీటితో పాటు ఎల్‌పీజీ గ్యాస్ ధరలు, 8వ వేతన సంఘం వంటి అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. 

కొత్త సంవత్సరం ప్రారంభంతో పాటే కొన్ని నిబంధనలు మారుతున్నాయి. ఇందులో పోస్టాఫీసు పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు, ఎల్‌పీజీ సిలిండర్ ధర, ఐటీఆర్ ఆలస్య రుసుము, ఆధార్-పాన్ లింక్, డిజిటల్ పేమెంట్స్ వంటివి ఉన్నాయి. ఈ మార్పుల పూర్తి వివరాలు గమనిస్తే..

28
చిన్న మొత్తాల పొదుపు పథకాలు

కేంద్ర ప్రభుత్వం పీపీఎఫ్ (PPF), సుకన్యా సమృద్ధి యోజన (SSY), ఎన్‌ఎస్‌సీ (NSC) వంటి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తుంది. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటులో 0.25 శాతాన్ని తగ్గించింది. ఆర్బీఐ నిర్ణయం తర్వాత బాండ్ ఈల్డ్స్‌లో తగ్గుదల కనిపించింది.

ఇక జనవరి 1 నుంచి  పోస్టాఫీసు పొదుపు పథకాల వడ్డీ రేట్లలో కోత విధించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. అయితే, గత త్రైమాసికంలో ప్రభుత్వం వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇప్పుడు రెపో రేటు తగ్గిన నేపథ్యంలో వడ్డీ రేట్ల సవరణపై అందరి దృష్టి నెలకొంది.

38
ఐటీఆర్ ఆలస్య రుసుము

2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రివైజ్డ్, బిలేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేయడానికి డిసెంబర్ 31 చివరి తేదీ. ఒకవేళ మీరు డిసెంబర్ 31లోపు మీ రివైజ్డ్ ఐటీఆర్ ఫైల్ చేయకపోతే, మీ ట్యాక్స్ రీఫండ్ నిలిచిపోయే ప్రమాదం ఉంది.

గడువు ముగిసిన తర్వాత మీరు ఐటీఆర్ దాఖలు చేయాలంటే అప్‌డేటెడ్ రిటర్న్ విధానాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. దీనికి భారీగా పెనాల్టీ చెల్లించాల్సి రావచ్చు. అప్‌డేటెడ్ రిటర్న్‌ను అసెస్మెంట్ ఇయర్ ముగిసిన 48 నెలల వరకు దాఖలు చేసే వెసులుబాటు ఉంది. అయితే ఇందులో పాత నష్టాలను క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉండదు. పైగా దీనిపై అదనపు పెనాల్టీ పన్ను కూడా చెల్లించాల్సి ఉంటుంది.

48
ఆధార్-పాన్ లింక్ డెడ్‌లైన్

పాన్ కార్డ్, ఆధార్ కార్డును లింక్ చేయడానికి కేంద్రం విధించిన కొత్త గడువు డిసెంబర్ 31తో ముగుస్తుంది. అయితే ఈ గడువు అందరికీ వర్తించదు. కేవలం పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఆధార్ నంబర్‌కు బదులుగా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీని లేదా ఇతర ఐడీలను ఉపయోగించిన వారికి మాత్రమే ఈ గడువు వర్తిస్తుంది.

నిర్దేశిత గడువులోపు లింక్ చేయకపోతే మీ పాన్ కార్డ్ నిరుపయోగంగా మారుతుంది. దీనివల్ల మీరు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయలేరు. అంతేకాకుండా మీ ఆదాయంపై ఎక్కువ టీడీఎస్ కట్ అవుతుంది. పెట్టుబడులు, కేవైసీ, ఫిక్స్‌డ్ డిపాజిట్లకు సంబంధించిన దరఖాస్తులు కూడా తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది.

58
డిజిటల్ పేమెంట్ నిబంధనలలో మార్పులు

జనవరి 1, 2026 నుంచి డిజిటల్ లావాదేవీలకు సంబంధించిన నిబంధనలు మరింత కఠినం కానున్నాయి. దేశంలో పెరుగుతున్న డిజిటల్ మోసాలు, బ్యాంకింగ్ ఫ్రాడ్స్‌ను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

గూగుల్ పే, ఫోన్ పే, వాట్సాప్ వంటి యూపీఐ ప్లాట్‌ఫారమ్‌లు ఇకపై కఠినమైన కేవైసీ ప్రక్రియను పాటించాలని ప్రభుత్వం, ఆర్బీఐ ఆదేశించాయి. కొత్త నిబంధనల ప్రకారం, మొబైల్ నంబర్ వెరిఫికేషన్, బ్యాంక్ ఖాతా లింకింగ్ ప్రక్రియలో అదనపు భద్రతా లేయర్‌ను జోడించనున్నారు. దీనివల్ల నకిలీ ఖాతాలను అరికట్టడం సులభమవుతుంది.

68
ఎల్‌పీజీ గ్యాస్ ధరలు

జనవరి 1, 2026 నుంచి సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరల్లో యూనిట్‌కు 2 నుంచి 3 రూపాయల వరకు తగ్గించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇదే సమయంలో ఎల్‌పీజీ సిలిండర్ వినియోగదారులకు కూడా శుభవార్త అందే అవకాశం ఉంది.

ప్రభుత్వ చమురు సంస్థలు ప్రతి నెల ఒకటో తేదీన ఎల్‌పీజీ సిలిండర్ ధరలను సమీక్షిస్తాయి. ఈ సంవత్సరం కమర్షియల్ సిలిండర్ ధరల్లో భారీగా కోత విధించినప్పటికీ, గృహ అవసరాలకు వాడే 14.2 కిలోల సిలిండర్ ధరలో మార్పు రాలేదు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బాగా తగ్గాయి. బ్యారెల్ ధర సుమారు 62 డాలర్ల వద్ద ఉంది. ఇది 2021 తర్వాత అత్యల్ప స్థాయి. కాబట్టి గ్యాస్ ధరలు తగ్గే అవకాశం ఉంది.

78
8వ వేతన సంఘం అమలు

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 8వ వేతన సంఘం ఏర్పాటును ప్రకటించింది. దీని సిఫార్సులు రావడానికి కొంత సమయం పట్టవచ్చు. కానీ ఈ సిఫార్సులు జనవరి 1, 2026 నుంచే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

కేంద్ర కేబినెట్ అక్టోబర్‌లో విడుదల చేసిన నోటిఫికేషన్‌లో 8వ కేంద్ర వేతన సంఘం సిఫార్సులు జనవరి 1, 2026 నుంచి వర్తిస్తాయని పేర్కొంది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఏరియర్స్ రూపంలో భారీ మొత్తంలో డబ్బు లభించే అవకాశం ఉంది.

88
కార్ల ధరల పెంపు

కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే జనవరి 1, 2026 నుంచి ధరలు పెరగనున్నాయి. పలు కార్ల తయారీ సంస్థలు తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. నిస్సాన్, బీఎండబ్ల్యూ, జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్, రెనాల్ట్, ఏథర్ ఎనర్జీ వంటి కంపెనీలు తమ వాహనాలపై 3 శాతం వరకు ధరలు పెంచనున్నాయి.

టాటా మోటార్స్, హోండా వంటి ప్రముఖ కంపెనీలు కూడా ధరల పెంపుపై సంకేతాలు ఇచ్చాయి. ముడి సరుకుల ధరలు పెరగడం వల్ల తమ మార్జిన్‌పై ఒత్తిడి పెరిగిందని, అందుకే ధరలు పెంచక తప్పడం లేదని కంపెనీలు చెబుతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories