Swiggy Zomato Instamart Zepto లలో బుక్ చేసిన 10 నిమిషాల్లో ఫుడ్ ఎలా డెలివరీ చేస్తారో తెలుసా?

Published : Jan 20, 2026, 11:11 PM IST

Blinkit Zepto Instamart : బ్లింకిట్, జెప్టో, ఇన్‌స్టామార్ట్ 10 నిమిషాల డెలివరీ వెనుక డార్క్ స్టోర్స్ మ్యాజిక్ ఉంది. 75 సెకన్లలో ప్యాకింగ్, ఇన్సెంటివ్స్ కోసం డెలివరీ బాయ్స్ పడే టెన్షన్ అసలు కారణాలు. టైమర్ లేకపోయినా వేగం తప్పనిసరి.

PREV
16
10 నిమిషాల్లో డెలివరీ ఎలా సాధ్యం? బ్లింకిట్, జెప్టో, ఇన్‌స్టామార్ట్ స్పీడ్ వెనుక అసలు రహస్యం ఇదే

స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో, బ్లింకిట్,  జోమాటో వంటి యాప్స్‌లో మనం ఆర్డర్ పెట్టగానే, కేవలం 10-15 నిమిషాల్లో డెలివరీ బాయ్ ఇంటి ముందు ఉంటారు. ట్రాఫిక్, సిగ్నల్స్ అన్నీ దాటుకుని ఇంత తక్కువ సమయంలో సరుకులు ఎలా వస్తున్నాయి? దీని వెనుక ఉన్న టెక్నాలజీ, ఇన్సెంటివ్స్, డార్క్ స్టోర్స్ వ్యవస్థ గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. డెలివరీ బాయ్స్ నిరసనలు, ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో, క్విక్ కామర్స్ సంస్థలు ఎలా పనిచేస్తున్నాయనే విషయాలు గమనిస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఒక డెలివరీ బాయ్ తన బైక్ మీద సిద్ధంగా ఉన్నాడు. ఫోన్ మోగగానే, అతడు విండో దగ్గరకు వెళ్లి, క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి, ఆర్డర్ తీసుకుని వెంటనే ట్రాఫిక్‌లోకి వెళ్ళిపోయాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అతడి ఫోన్ స్క్రీన్‌పై ఆర్డర్ ఎంత సేపట్లో డెలివరీ చేయాలనే కౌంట్‌డౌన్ టైమర్ లేదు. "10 నిమిషాల్లోనే ఇవ్వాలి" అని ఎవరూ చెప్పరు. కానీ, ఎక్కువ ఆర్డర్లు పూర్తి చేస్తేనే ఎక్కువ డబ్బులు వస్తాయి. త్వరగా వెళ్తేనే ఆ టార్గెట్ రీచ్ అవుతారు. అందుకే ఆటోమేటిక్‌గా వేగం పెరుగుతుందని డెలివరీ బాయ్ చెప్పాడు.

బ్లింకిట్, ఇన్‌స్టామార్ట్, టాటా బిగ్‌బాస్కెట్, ఫ్లిప్‌కార్ట్ మినిట్స్, అమెజాన్ నౌ వంటి అన్ని సంస్థల్లోనూ ఇదే పరిస్థితి. సాధారణంగా ఆర్డర్ డెలివరీ సమయం 8 నుంచి 15 నిమిషాల మధ్య ఉంటుంది. ట్రాఫిక్, ఆర్డర్ల సంఖ్యను బట్టి ఇది మారుతూ ఉంటుంది.

26
ఆర్డర్ చేయడానికి ముందే జరిగే ప్లానింగ్

క్విక్ కామర్స్‌లో వేగం అనేది కస్టమర్ ఆర్డర్ పెట్టకముందే డిజైన్ చేసి ఉంటుంది. వీటిని డార్క్ స్టోర్స్ అంటారు. ఇవి నివాస ప్రాంతాలకు చాలా దగ్గరగా ఉండే చిన్న గోడౌన్లు. ఇక్కడ పాలు, బ్రెడ్, కూరగాయలు వంటి నిత్యావసరాలను రోజుకు ఒకటి రెండు సార్లు స్టాక్ చేస్తారు.

కస్టమర్ ఆర్డర్ పెట్టగానే, బ్యాకెండ్ సిస్టమ్ ఆటోమేటిక్‌గా దగ్గర్లో ఉన్న, సరుకులు అందుబాటులో ఉన్న డార్క్ స్టోర్‌కు ఆర్డర్‌ను పంపిస్తుంది. ఈ ప్రాసెస్ అంతా కొన్ని సెకన్లలో జరిగిపోతుంది.

36
డార్క్ స్టోర్ లోపల ఏం జరుగుతుంది?

స్టోర్ లోపల ప్రతి వస్తువు డిజిటల్ మ్యాపింగ్ చేసి ఉంటుంది. ఆర్డర్ ప్యాక్ చేసే వ్యక్తి ఎక్కడికి వెళ్లాలో సిస్టమ్ రూట్ మ్యాప్ ఇస్తుంది. పెద్ద ఆర్డర్ అయితే ఇద్దరు వ్యక్తులు చెరో వైపు నుంచి సరుకులు తీస్తారు.

ఈ విషయంపై పరిశ్రమకు చెందిన ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతూ, "చాలా వరకు ఆర్డర్లు ప్యాక్ చేయడానికి 2 నిమిషాల కంటే తక్కువ సమయం పడుతుంది. సగటున 75 సెకన్లలోపే ప్యాకింగ్ పూర్తవుతుంది. ప్యాకింగ్ అవ్వకముందే డెలివరీ బాయ్‌ని అసైన్ చేస్తారు" అని తెలిపారు.

46
డెలివరీ పార్ట్‌నర్‌కు అప్పగింత

ఆర్డర్ ప్యాక్ కాగానే ఒక నిర్ణీత ప్రదేశంలో ఉంచుతారు. బ్లింకిట్ వంటి యాప్స్‌లో రైడర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి, జెప్టోలో యాప్‌లో లాగిన్ అవ్వాలి. ప్యాకింగ్ పూర్తయ్యాక ఆర్డర్ తీసుకుని రైడర్ బయలుదేరతాడు. అప్పుడే నావిగేషన్ ఆన్ అవుతుంది. ట్రాఫిక్, వాతావరణ పరిస్థితులను బట్టి యాప్ షార్ట్ రూట్‌ను చూపిస్తుంది. రైడర్లకు డెలివరీ టైమ్ టార్గెట్ చూపించకపోయినా, షిఫ్ట్‌లో ఎన్ని ఆర్డర్లు చేశారో చూపిస్తుంది.

56
లాస్ట్ మైల్ డెలివరీ ఎందుకు ఇంత తక్కువ దూరం?

క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు డెలివరీ పరిధిని 1 నుంచి 2 కిలోమీటర్లకే పరిమితం చేస్తాయి. చాలా అరుదుగా 3 కిలోమీటర్ల వరకు వెళ్తాయి. అందుకే ప్యాకింగ్ చేయడానికి పట్టే సమయం కంటే, డెలివరీ చేయడానికి పట్టే సమయం తక్కువగా ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లో 5 నిమిషాల ప్రయాణ సమయంతో, మొత్తం 8-12 నిమిషాల్లో ఆర్డర్ కస్టమర్ చేతికి అందుతుంది. కస్టమర్లు ఇప్పుడు వేగంగా సరుకులు పొందడానికి అలవాటు పడ్డారు.. ఇప్పుడు వారిని మళ్లీ 30 నిమిషాల డెలివరీకి మార్చడం కష్టమని ఈ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

66
ఇన్సెంటివ్స్, ఒత్తిడితో కూడిన వాస్తవ పరిస్థితులు

డెలివరీ బాయ్స్ ఆదాయం కేవలం బేస్ పే మీద మాత్రమే కాకుండా, ఇన్సెంటివ్స్ మీద ఆధారపడి ఉంటుంది. పీక్ అవర్స్‌లో ఎక్కువ ఆర్డర్లు చేస్తేనే మంచి ఆదాయం వస్తుంది. డెలివరీ ఆలస్యమైతే ఇన్సెంటివ్స్ కట్ అవుతాయని, రేటింగ్ తగ్గుతుందని బ్లింకిట్ డెలివరీ పార్ట్నర్ ఒకరు తెలిపారు.

ఆర్డర్లు రిజెక్ట్ చేస్తే యాప్ వార్నింగ్ ఇస్తుంది. మరీ ఎక్కువసార్లు రిజెక్ట్ చేస్తే ఐడీని కొన్ని గంటల పాటు లేదా శాశ్వతంగా బ్లాక్ చేసే ప్రమాదం ఉందని వర్కర్లు చెబుతున్నారు. టైమర్ లేకపోయినా, ఆదాయం కోసం వేగంగా వెళ్లక తప్పని పరిస్థితి వారిది.

ఇటీవల ప్రభుత్వం 10 నిమిషాల డెలివరీ అనే క్లెయిమ్‌లను ప్రకటనల నుంచి తొలగించాలని ఆదేశించింది. కంపెనీలు దాన్ని పాటించాయి. కానీ, క్షేత్రస్థాయిలో డెలివరీ బాయ్స్ పనిలో మాత్రం ఏ మార్పూ రాలేదు. "మాకు ఎవరూ ఏమీ చెప్పలేదు, ఆర్డర్లు వస్తున్నాయి, ఇన్సెంటివ్స్ కోసం మేము వేగంగా డెలివరీ చేస్తున్నాం" అని ఒక డెలివరీ పర్సన్ తెలిపారు. మొత్తానికి, 10 నిమిషాల అనే పదం ప్రకటనల్లో మాయమైనా, సిస్టమ్ మాత్రం అదే వేగంతో నడుస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories