సాధారణంగా బ్యాంకు అకౌంట్ తీసుకున్న ప్రతి ఒక్కరూ డెబిట్ వాడుతుంటారు కదా.. డెబిట్ కార్డు వాడే ప్రతి ఒక్కరికీ యాక్సిడెంటల్ పాలసీ వర్తిస్తుంది. అయితే ఇది ఆయా బ్యాంకుల రూల్స్ కి అనుగుణంగా ఉంటుంది. చాలా బ్యాంకులు తమ కస్టమర్లకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ ఇస్తాయి. కాని ఈ విషయం వారికి కూడా తెలియకపోవచ్చు. ఎందుకంటే చాలా బ్యాంకులు ఈ విషయాన్ని కస్టమర్లకు చెప్పడాన్ని పెద్ద విషయంగా చూడవు. అనుకోకుండా యాక్సిడెంట్ జరిగితే బాధితులు ఆ బాధలో ఉంటారు తప్ప.. బ్యాంకులు ఇచ్చే బీమా పాలసీల గురించి ఆలోచించలేరు.
బ్యాంకులు ఇచ్చే ప్రమాద బీమా కవరేజ్ కూడా ఒక్కో బ్యాంకుకు ఒక్కోలా ఉంటుంది. ప్రమాదం జరిగి వ్యక్తి మృతి చెందినా, లేదా వైకల్యం ఏర్పడినా ఈ కవరేజీ లభిస్తుంది. ఈ ప్రమాద బీమా పాలసీ అమౌంట్ బ్యాంకు బట్టి మారుతుంటుంది. చాలా బ్యాంకులు రూ. 2 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు కవరేజీ ఇస్తాయి. ముఖ్యంగా SBI, HDFC Bankలు రూ. 2 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు కవరేజీ ఇస్తున్నాయి. అదే ICICI బ్యాంకు అయితే రూ. 2 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు ప్రమాద బీమా ఇస్తోంది. Axis Bank రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షల వరకు యాక్సిడెంటల్ పాలసీ అందిస్తోంది.
ప్రమాద బీమా పాలసీ కవరేజ్ వివిధ రకాల డెబిట్ కార్డ్ లకు వేర్వేరుగా ఉంటుంది. అంటే రెగ్యులర్ డెబిట్ కార్డు అయితే ఒకలా, ప్రీమియం, ప్లాటినం కార్డ్ అయితే కొంచెం ఎక్కువ ప్రమాద బీమా కవర్ అవుతుంది. ప్రమాద బీమా పొందాలంటే పాలసీ షరతులు, కవరేజీ, క్లెయిమ్ ప్రాసెస్ గురించి మీరు ముందే అవగాహన కలిగి ఉండటం మంచిది. ప్రతి ఒక్క బ్యాంకు పాలసీ కవరేజీ, క్లెయిమ్ ప్రాసెస్‌లో తేడాలు ఉంటాయి కాబట్టి ఈ వివరాలు కచ్చితంగా తెలుసుకోవడం ముఖ్యం.
డెబిట్ కార్డ్ ద్వారా యాక్సిడెంటల్ పాలసీ పొందడానికి కొన్ని కండీషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా డెబిట్ కార్డ్ యాక్టివ్‌గా ఉండాలి. అంటే గడచిన 3 నెలల్లో ఈ డెబిట్ కార్డు ద్వారా కనీసం ఒక ట్రాన్సాక్షన్ అయినా చేసి ఉండాలి. ఈ పాలసీ పొందడానికి ప్రత్యేకంగా డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. డెబిట్ కార్డు రెగ్యులర్ గా వాడుతుంటే
చాలు ఆ పాలసీ వర్తిస్తుంది.
అంతేకాకుండా అకౌంట్ ఉన్న బ్యాంకు రూల్స్ ప్రకారం మినిమం బాలెన్స్ మెయింటెయిన్ చేస్తూ ఉండాలి.
అకౌంట్ హోల్డర్ యాక్సిడెంట్ లో చనిపోయారన్న విషయాన్ని ఒక నెలలోపు ఆ బ్యాంకు అధికారులకు తెలియజేయాలి. వారిచ్చిన దరఖాస్తు ఫిల్ చేసి అవసరమైన డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలి. బ్యాంకు వాళ్లు అడిగిన డాక్యుమెంట్లు, ఆధారాలు 60 రోజుల్లోపే బ్యాంకుకు ఇవ్వాలి. టైమ్ దాటిన తర్వాత ఇస్తే బ్యాంకులు రిజక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది.
సాధారణంగా బ్యాంకులు అడిగే డాక్యుమెంట్లు ఏంటంటే.. పోలీస్ కంప్లైంట్ లేదా FIR కాపీ, హాస్పిటల్ బిల్స్, ఓపీ, డెబిట్ కార్డ్ జిరాక్స్ కాపీ, బ్యాంక్ స్టేట్‌మెంట్, డెత్ సర్టిఫికేట్. ఇవన్నీ ముందుగానే సిద్ధం చేసుకొని బ్యాంకుకు సకాలంలో అందిస్తే మీరు పాలసీ క్లెయిమ్ కి అప్లై చేసిన 14 రోజుల్లోనే మీ అప్లికేషన్ ప్రాసెస్ జరిగి పాలసీ అమౌంట్ యాక్సిడెంట్ లో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి అందుతుంది.