
యూజ్డ్ కార్ కొనడానికి చాాలామంది ఉత్సాహం చూపిస్తారు... కానీ ఇది కొంచెం కఠినమైన పని. ముఖ్యంగా ఫైనాన్స్ విషయంలో ఇబ్బందులు వుండొచ్చు. మీరు కారును మార్చుతున్నా, కొత్తగా సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నా తక్కువ వడ్డీతో రుణం పొందడం కష్టతరమైన పని. కానీ ఇలా తక్కువ వడ్డీ రేటుతో లోన్ పొందటం ద్వారా మీరు మీ నెలసరి చెల్లింపులు తగ్గించుకోవడమే కాకుండా వడ్డీ మొత్తాన్ని కూడా తగ్గించవచ్చు. అయితే మీరు ఉత్తమమైన రుణాన్ని పొందేందుకు ఎలా ముందుకు వెళ్లాలి? మీ కలల కారును ఎలాంటి ఆర్థిక ఒత్తిడులు లేకుండా పొందడానికి ఈ చిట్కాలు ఉపయోగపడతాయి.
ఈ సూచనలు తక్కువ వడ్డీరేటుతో యూజ్డ్ కారు రుణాలు ఎలా పొందేందుకు ఉపయోగపడతాయి. అలాగే మనం ఎంత రుణం పొందే అవకాశం వుంటుంది? తిరిగి చెల్లించే ప్రక్రియ ఎలా వుంటుంది? తదితర వివరాలు తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఎక్కువ వడ్డీలు కట్టకుండా త్వరగా రుణం చెల్లించేందుకు ఈ చిట్కాలు ఉపయోగపడతాయి.
మీరు తక్కువ వడ్డీ రేటుతో యూజ్డ్ కారు లోన్ కావాలనుకుంటున్నారా? ఈ విషయంలో క్రెడిట్ స్కోరు మీకు ఓ స్నేహితుడిలా ఉపయోగపడుతుంది. క్రెడిట్ స్కోర్ మీకు తక్కువ వడ్డీ రేటును పొందడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మీకు ఎక్కువ క్రెడిట్ స్కోర్ (700 కంటే ఎక్కువ) ఉన్నప్పుడు రుణదాతలు మీకు తక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేస్తారు. క్రెడిట్ ఎక్కువగా వుండటం మీపై రుణదాతలకు నమ్మకాన్ని పెంచుతుంది... కాబట్టి తమ డబ్బులకు తక్కువ రిస్క్ వుంటుందని తక్కువ వడ్డీకే రుణం ఇస్తారు. కాబట్టి మీరు కారు తీసుకునేముందు క్రెడిస్ స్కోర్ చెక్ చేసుకొండి.
ఒకవేళ మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే దాన్ని మెరుగుపర్చేందుకు ప్రయత్నించండి. క్రెడిట్ కార్డ్ బిల్లులు సమయానికి కట్టడం, ఇతర రుణాలను సమయానికి చెల్లించడం ద్వారా మీ క్రెడిట్ స్కోర్ మెరుగుపడుతుంది. ఇలా మీ క్రెడిట్ స్కోర్ మెరుగుపర్చుకుంటే యూజ్డ్ కారు ప్రీ-అప్రూవల్ లోన్ పొందవచ్చు, ఇది రుణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది.
మీరు డౌన్ పేమెంట్ ఎక్కువ కట్టడంద్వారా నెలనెలా ఈఎంఐ చెల్లింపు తక్కువగా వుంటుంది, వడ్డీ కూడా తగ్గుతుంది. ముఖ్యంగా తక్కువ వడ్డీతో రుణం పొందేందుకు ఉత్తమ మార్గం ఎక్కువ డౌన్ పేమెంట్ చెల్లించడం. మీరు ముందుగానే ఎక్కువమొత్తం చెల్లించడం ద్వారా చాలా తక్కువ రుణాన్ని పొందుతారు... కాబట్టి రుణదాతకు రిస్క్ తగ్గుతుంది. మీరు డౌన్ పేమెంట్ ఎక్కువగా చెల్లించడం ద్వారా రుణదాత మిమ్మల్ని ఆర్థిక బాధ్యత కలిగివున్నారని, కారు కొనే విషయంలో సీరియస్ గా వున్నారని రుణదాతకు అర్థమవుతుంది. కాబట్టి తక్కువ వడ్డితో వెంటనే రుణం ఇవ్వడానికి ఇష్టపడతారు.
మీరు రుణదాతను ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్తగా వుండాలి. మొదట వెళ్లినవారి వద్దే ఫైనాన్స్ తీసుకోకండి. మార్కెట్ లో మంచి ఆఫర్లు ఇచ్చే వారిని గుర్తించండి. తక్కువ వడ్డీతో యూజ్డ్ కారు లోన్స్ ఎవరు ఇస్తారో పరిశీలించండి. బ్యాంకులు, ఆన్‌లైన్ రుణదాతలు, క్రెడిట్ యూనియన్లు అందించే వడ్డీ రేట్లు, నిబంధనలు భిన్నంగా ఉంటాయి. వివిధ ఆఫర్లను పోల్చడం ద్వారా మీకు అనుకూలమైన లోన్ పొందండి... డబ్బులు ఆదా చేసుకొండి.
ఆన్ లైన్ లో కూడా యూజ్డ్ కార్లకు లోన్ అందించే సంస్థలకు మరిచిపోకండి. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలతో పోలిస్తే ఆన్ లైన్ లో చాలా తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తుంటాయి కొన్ని సంస్థలు. కాబట్టి అన్నింటిని పరిశీలించి మంచి డీల్ సెట్ చేసుకొండి. తక్కువ వడ్డీ రేటుతో మనకు తగినంత రుణం ఇచ్చేవారికి ఎంచుకొండి.
మీరు ఎంచుకునే కారు రుణ నిబంధనలను ప్రభావితం చేస్తుంది... అందువల్ల జాగ్రత్తగా ఎంపిక చేసుకోండి. ప్రతి యూజ్డ్ కార్ ఒకేలా ఉండదు... రుణదాతలు కార్ మోడల్, తయారీ, తయారయిన ఏడాది, కండీషన్ ఆధారంగా వడ్డీ రేట్లను మార్చగలరు. కొత్తగా వుండేవి, తక్కువ మైలేజ్ గల కార్లు తక్కువ రిస్క్‌గా పరిగణించబడి, తక్కువ వడ్డీ రేట్లను అందిస్తాయి. పాత కార్లు లేదా అధిక మైలేజ్ గల వాహనాలు ఎక్కువ వడ్డీ రేట్లకు అవకాశం కల్పిస్తాయి. ఎందుకంటే అవి ఎక్కువ రిస్క్‌గా పరిగణించబడతాయి. కాబట్టి మంచి స్థితిలో ఉన్న కారును ఎంచుకోండి. కారు కండీషన్, రీసేల్ విలువ మంచిగా ఉంటే రుణ నిబంధనలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి.
తక్కువ రుణ వ్యవధులు తక్కువ వడ్డీ రేట్లను కలిగి ఉంటాయి... కానీ నెలసరి చెల్లింపులు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ కాలం రుణాలకు చెల్లించాల్సిన మొత్తం, వడ్డీ మొత్తాన్ని పెంచుతాయి. మీరు రుణం, వడ్డీ మొత్తాన్ని తగ్గించుకోవాలనుకుంటే తక్కువ కాలానికే తిరిగి చెల్లించడాన్ని ఎంచుకోవడమే ఉత్తమం. తక్కువ వడ్డీతో యూజ్డ్ కార్ లోన్ పొందడంలో విజయాన్ని సాధించవచ్చు.
మీ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరచడం, డౌన్ పేమెంట్ కోసం పొదుపు చేయడం, మంచి రుణదాతలను ఎంచుకోవడం, మీ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవడం ద్వారా మంచి రుణాన్ని పొందొచ్చు.
మీ క్రెడిట్ స్కోర్‌ను తనిఖీ చేయండి, డౌన్ పేమెంట్ కోసం పొదుపు ప్రారంభించండి,మీకు సరైన కారును వెతకడం ప్రారంభించండి. సరైన ఫైనాన్స్‌తో మీరు మీ కలల కారును పొందవచ్చు... వడ్డీ రేట్ల టెన్షన్ లేకుండా హాయిగా వుండవచ్చు.