
సొంత ఇల్లు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మన ఇంట్లో మనం స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఉండవచ్చని అనుకుంటారు. అద్దెంట్లో ఉంటే ఎలాంటి పరిస్థితి ఉంటుందో చాలా మందికి తెలిసే ఉంటుంది కాబట్టి. చిన్నదో, పెద్దదో.. ఊరిలోనో, సిటీలోనో ఏదో ఒక చోట మనకంటూ ఒక ఇల్లు ఉంటే.. చాలని చాలామంది అనుకుంటారు. అందుకోసం కష్టపడతారు. పైసా పైసా కూడబెడతారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సొంతిల్లు కట్టుకోవాలంటే వారిపై కుజుడి అనుగ్రహం ఉండాలట. సాధారణంగా కొన్ని ఆలయాలు దర్శిస్తే జాతకంలో దోషాలు తొలగిపోతాయని చెబుతుంటారు. అలాగే కొన్ని ఆలయాలు దర్శిస్తే.. సొంత ఇంటి కల నేరవేరుతుందట. ఆ ఆలయాలకు వెళ్లి మనసారా ప్రార్థిస్తే కోరికలు నెరవేరుతాయట. ముఖ్యంగా సొంతింటి యోగం కలుగుతుందట. దానికోసం ఏ ఆలయాలు దర్శించాలో ఇక్కడ చూద్దాం.
కుజుడి అనుగ్రహం ఉంటే సొంతింటి కల నేరవేరుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. జాతకంలో కుజుడు బలంగా ఉంటే సొంతింటి యోగం ఖాయమంటున్నారు. కుజుడు బలహీనంగా ఉంటే పరిహారాలు చేసి బలపరచుకోవాలని సూచిస్తున్నారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు గణపతి భక్తుడు. కుజుడి భక్తికి మెచ్చి నవగ్రహ స్థానం ఇచ్చాడట గణపతి. అంతేకాదు అంగారక చతుర్థి రోజున తనను పూజిస్తే కోరికలు తీరుస్తానని చెప్పాడట. అందుకే సొంతింటి కోసం కుజుడి అనుగ్రహం కోరేవారు అంగారక చతుర్థి రోజున వినాయకుడి ఆలయాలు దర్శిస్తే మంచి ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
పిళ్లయార్ పట్టి అనేది పురాతన పుణ్యక్షేత్రం. ఇది తమిళనాడులోని శివగంగై జిల్లాలో ఉంది. ఇక్కడ కర్పగ వినాయగర్ ఆలయం ఉంది. ఇల్లు కావాలనుకునేవారు పిళ్లయార్‌పట్టి కర్పగ గణపతిని పూజించాలి. ఇక్కడ గణపతి రెండు చేతులతో.. అంకుశ-పాశం లేకుండా దర్శనమిస్తాడు. తొండం కుడివైపు తిరిగి ఉండటం విశేషం. అంగారక చతుర్థి రోజున కుటుంబంతో వెళ్లి గణపతిని పూజిస్తే సొంతింటి యోగం కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
తిరుచ్చి దగ్గర మణచనల్లూరులో ఉన్న భూమినాథర్ ఆలయం ఇల్లు-స్థలం కొనే యోగాన్ని ఇస్తుంది. శివుడి నుదుటి నుంచి పడిన చెమట బొట్టు నుంచి పుట్టిన శివగణం.. శివుడి ఆదేశం మేరకు ఇల్లు, కట్టడాలు కట్టుకునేవారికి సహాయంగా ఉంటుందట. అందుకే ఇప్పటికీ ఇల్లు-స్థలం కొనే యోగాన్ని ఇస్తోంది ఆ శివగణం. సొంతింటి కోసం ఇక్కడ ప్రత్యేక పూజలు చేయించుకుంటే మంచిదని పండితులు సూచిస్తున్నారు.
చెన్నై సమీపంలోని తిరువళ్లూరు జిల్లాలో ఉన్న సిరువాపురి బాలసుబ్రమణ్య స్వామి ఆలయంలోని మురుగన్.. సొంతింటి కలను నేరవేరుస్తాడని నమ్మకం. ఇక్కడ రాముడు, లవకుశుల మధ్య యుద్ధం జరిగిందని చెబుతారు. అరుణగిరి నాథుడు కీర్తించిన ఆలయం ఇది. సొంతింటి కోసం సిరువాపురి మురుగన్ ను దర్శించి.. అర్చన చేసి, మనసారా ప్రార్థిస్తే కోరిక నెరవేరుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి నుంచి పోదత్తూర్‌పేట వెళ్లే దారిలో మేల్‌పోదత్తూర్ ఉంది. ఇక్కడ భూదేవి సమేతంగా ధరణి వరాహమూర్తి కొలువై ఉన్నాడు. 11 శనివారాలు ఇక్కడికి వచ్చి, నెయ్యి దీపం వెలిగించి, వరాహమూర్తిని పూజిస్తే భూమికి సంబంధించిన సమస్యలు తీరతాయట. శనిదోష నివారణ కలుగుతుందట. పెళ్లికి ఉన్న ఆటంకాలు కూడా తొలగిపోతాయట.
చెన్నై నుంచి పుదుచ్చేరి వెళ్లే ఈస్ట్ కోస్ట్ రోడ్డులో ఉన్న మరక్కానంలోని భూమీశ్వరుడు.. సొంతింటి యోగాన్ని ఇస్తాడట. ఒక శివభక్తుడి భక్తికి మెచ్చి, మరక్కాల్ పాత్రలో ఉండి మాయమై, తర్వాత భూమి నుంచి బయటకు వచ్చాడట ఈ స్వామి. అందుకే భూమీశ్వరుడిని పూజిస్తే భూమికి సంబంధించిన సమస్యలు తీరి సొంతింటి యోగం కలుగుతుందని నమ్మకం.
పిచ్చనూర్ దగ్గర ఒత్తక్కాల్ మండపం ఉంది. ఇక్కడ బాలగణపతి, పాత్రకాళి అమ్మవారు కొలువై ఉన్నారు. పెళ్లి, పిల్లలు కావాలనుకునేవారు ఇక్కడ మనసారా ప్రార్థిస్తే కోరికలు నెరవేరుతాయట. అలాగే ఇటుకలు పేర్చి ప్రార్థిస్తే సొంతింటి యోగం కలుగుతుందని నమ్మకం.