Weather Update: ఆగస్టు 20న ఏపీలో అల్పపీడన ప్రభావంతో వర్షాలు పడనున్నాయి. అలాగే, తెలంగాణలోని 13 జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన ఉరుముల హెచ్చరికను భారత వాతావరణ శాఖ జారీ చేసింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం: ఏపీ, తెలంగాణలో నేటి వాతావరణం ఎలా ఉండబోతోందంటే?
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారింది . ఆగస్టు 20 నాటికి తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితుల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయని ఐఎండీ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తాజా అల్పపీడన ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించిన సమాచారం ప్రకారం, రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటాయి. ఒకవైపు కోస్తాంధ్రలో వర్షాల ప్రభావం కనిపిస్తుండగా, మరోవైపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలుల హెచ్చరికలు జారీ అయ్యాయి.
24
తెలంగాణలోని 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం వేగంగా మారుతోంది. ఉత్తర, తూర్పు తెలంగాణలోని 13 జిల్లాలకు వాతావరణ శాఖ ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి ప్రాంతాల్లో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతాల్లో గంటకు బలమైన గాలులు వీచే సూచనలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
34
హైదరాబాద్ నగరంలో వాతావరణం ఎలా ఉంది?
రాష్ట్ర రాజధాని హైదరాబాద్, పరిసర ప్రాంతాలలో రోజంతా ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. పగటి సమయం ప్రశాంతంగా గడిచినా, సాయంత్రం లేదా రాత్రి వేళల్లో వాతావరణం చల్లబడే అవకాశం ఉంది. నగరంలోని పలు ప్రాంతాలలో తేలికపాటి వర్షం లేదా చెదురుమదురుగా జల్లులు కురిసే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్‌గాను, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్‌గాను నమోదయ్యే అవకాశం ఉంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల రాబోయే రోజుల్లో ఏపీలోని పలు తీరప్రాంత జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌తో పాటు గోదావరి జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయి. రాజధాని అమరావతి - విజయవాడ ప్రాంతాల్లో ఆకాశం ఎక్కువగా మేఘావృతమై ఉండి, తేలికపాటి నుండి మోస్తరు జల్లులు కురిసే అవకాశాలు ఉన్నాయి.
రాయలసీమ ప్రాంతంలో ఆకాశం పాక్షికంగా లేదా పూర్తిగా మేఘావృతమై ఉంటుంది. కొన్ని చోట్ల స్థానికంగా తేలికపాటి జల్లులు కురుస్తాయి. ఈ ప్రాంతంలో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 31°C నుండి 34°C వరకు, కనిష్ట ఉష్ణోగ్రతలు 23°C నుండి 25°C వరకు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తీరప్రాంత ప్రజలు, రైతులు వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.