ఏపీలో నిరుద్యోగుల‌కు పండ‌గ‌లాంటి వార్త‌.. 10,060 పోస్టుల భ‌ర్తీకి గ్రీన్ సిగ్న‌ల్

Published : Aug 19, 2026, 10:07 AM IST

Andhra pradesh: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగ‌ళ‌వారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప‌లు అంశాల‌పై నిర్ణ‌యాలు తీసుకున్నారు. వాటికి సంబంధించిన పూర్తి వివ‌రాలు.

PREV
14
10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ

రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 10,060 పోస్టులను భర్తీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. 2026-27 జాబ్‌ క్యాలెండర్‌లో భాగంగా ఈ నియామకాలు చేపట్టనున్నారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు భారీగా అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. అలాగే పట్టణ స్థానిక సంస్థల్లో రహదారులు, కాల్వలు, విద్యుత్‌ సదుపాయాలు, పార్కుల అభివృద్ధి కోసం హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌ (HAM) కింద రూ.7,469.46 కోట్ల పనులకు పరిపాలనా అనుమతి ఇచ్చింది. హంద్రీ-నీవా సుజల స్రవంతి (HNSS) ఫేజ్‌-2 పనులకు రూ.1,323.75 కోట్లను కేటాయించింది. శ్రీసత్యసాయి జిల్లాలో మెయిన్‌ కెనాల్‌ సీసీ లైనింగ్‌ పనులకు రూ.750.07 కోట్లు, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మెయిన్‌ కెనాల్‌ పనులకు రూ.573.68 కోట్లు కేటాయించింది.

24
భారీ డేటా సెంటర్లు.. వేల కోట్ల పెట్టుబడులు

విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం జగన్నాథపురం వద్ద 486 మెగావాట్ల సామర్థ్యంతో హైపర్‌స్కేల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు చేయడానికి డేటా సెంటర్‌ హోల్డింగ్స్‌ ఇండియాకు 200 ఎకరాలు కేటాయించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. సంస్థకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వడానికి కూడా అనుమతించింది. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం వద్ద 1,000 మెగావాట్ల హైపర్‌స్కేల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటుకు రెన్యూ ఏపీ గ్రీన్‌ డేటా సెంటర్‌ లిమిటెడ్‌కు 433.30 ఎకరాలు కేటాయించనున్నారు. ఈ ప్రాజెక్టులో రూ.85,200 కోట్ల పెట్టుబడి పెట్టడంతో పాటు 1,880 మందికి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యం ఉంది. విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం అమనం వద్ద 512 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్‌ ఏర్పాటు చేయనున్నారు. రూ.31,387 కోట్ల పెట్టుబడితో చేపట్టే ఈ ప్రాజెక్టు ద్వారా 1,000 మందికి ఉపాధి లభించనుంది. ఈ ప్రాజెక్టుకు ఆర్థిక, ఆర్థికేతర ప్రోత్సాహకాలు ఇవ్వడానికి కేబినెట్‌ అంగీకరించింది.

34
బ్యాటరీ, ఎలక్ట్రానిక్స్, సోలార్‌ రంగాలకు ఊతం

తిరుపతిలో మునోత్‌ లిథియం బ్యాటరీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.500 కోట్ల పెట్టుబడితో లిథియం అయాన్‌ సెల్‌ తయారీ ప్లాంట్‌ ఏర్పాటు చేయడానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రంలో బ్యాటరీ తయారీ రంగానికి మరింత ప్రోత్సాహం లభించనుంది. వైఎస్సార్‌ ఈఎంసీ కొప్పర్తిలో ఏఐఎల్‌ డిక్సన్‌ టెక్నాలజీస్‌ ఆధ్వర్యంలో రూ.450 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రానిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 7 వేల మందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యం ఉంది.

కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుట్టపాడు వద్ద అగస్త్య గ్రీన్‌ ఎనర్జీ ఆధ్వర్యంలో 12 గిగావాట్ల ఇంటిగ్రేటెడ్‌ సదుపాయంతో ఎస్‌ఐ ఇంగోట్‌, వేఫర్‌ తయారీ ప్లాంట్‌ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం 143.26 ఎకరాల భూమిని ఎకరాకు రూ.10 లక్షల చొప్పున కేటాయించనున్నారు. విశాఖ పరవాడ పారిశ్రామికవాడలో అక్షత్‌ గ్రీన్‌టెక్‌ 3.6 గిగావాట్ల టాప్‌కాన్‌ సోలార్‌ సెల్‌, మాడ్యూల్‌ తయారీ ప్లాంట్‌ ఏర్పాటుకు కూడా ఆమోదం లభించింది. చిత్తూరు జిల్లా కుప్పం మండలం ఏకర్లపల్లి వద్ద అల్యూమినియం ఎక్స్‌ట్రూజన్‌ ప్రాజెక్టును విస్తరించేందుకు హిందాల్కో ఇండస్ట్రీస్‌కు 60 ఎకరాలు కేటాయించనున్నారు.

44
అమరావతిలో రైల్వే లైన్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్‌

రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించి కూడా కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఎర్రుబాలెం-నంబూరు నూతన బ్రాడ్‌గేజ్‌ రైల్వే లైన్‌ నిర్మాణంతో పాటు ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ కోసం గుంటూరు జిల్లా తాడికొండ మండలం మోతడకలో 2,344.12 ఎకరాల భూమిని భూసమీకరణ విధానంలో తీసుకోనున్నారు. రైల్వే లైన్‌కు ఇరువైపులా 50 మీటర్ల చొప్పున బఫర్‌ ప్రాంతాన్ని కలుపుకుని మొత్తం 100 మీటర్ల పరిధిలో భూమి అవసరం కానుంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను చేపట్టేందుకు సీఆర్‌డీఏ కమిషనర్‌కు అధికారాలు కల్పిస్తూ మంత్రివర్గం తీర్మానం చేసింది.

అలాగే రెండో విడత భూసమీకరణలో భాగంగా గుంటూరు జిల్లా వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి గ్రామాల్లోని దేవాదాయ భూముల వివాదాలను పరిష్కరించేందుకు దేవాదాయ శాఖకు రూ.159.45 కోట్ల పరిహారం చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. రైత్వారీ పట్టాలు ఉన్న రైతులకు భూసమీకరణ ప్రయోజనాలు కల్పించే ప్రతిపాదనకు కూడా కేబినెట్‌ అంగీకరించింది. మొత్తంగా ఉద్యోగాల భర్తీ, సాగునీటి ప్రాజెక్టులు, పారిశ్రామిక పెట్టుబడులు, డేటా సెంటర్లు, అమరావతి నిర్మాణం వంటి పలు రంగాలకు ఈ కేబినెట్‌ నిర్ణయాలు ప్రాధాన్యం ఇచ్చాయి.

Read more Photos on
click me!

Recommended Stories