బంగాళాఖాతంలో ఇప్పటికే ఓ అల్పపీడనం, శుక్రవారం ఇంకోటి.. భీకర వర్షాలతో ఈ ప్రాంతాల్లో ఆగమాగమే

Published : Oct 23, 2025, 02:35 PM IST

Weather Updates : తెలుగు రాష్ట్రాలను ఇప్పట్లో వర్షాలు వదిలేలా లేవు. ఇప్పటికే బంగాళాఖాతంలో ఓ అల్పపీడనం కొనసాగుతుండగా రేపు మరోటి ఏర్పడే అవకాశాలున్నాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. దీంతో వర్షాలు మరింత జోరందుకోనున్నాయి. 

PREV
18
తప్పిన వాయుగుండం గండం

IMD Rain Alert : వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారడంతో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో వర్షతీవ్రత కాస్త తక్కువగానే ఉంది... కానీ ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం కుండపోత వానలు పడుతున్నాయి. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు దంచికొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతోనే ఈ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి... ఇది మరింత బలపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఇంకా ఏ స్థాయిలో వర్షాలుంటాయోనని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అయితే తెలుగు రాష్ట్రాలకు వాయుగుండం గండం తప్పిందని వాతావరణ శాఖ వెల్లడించింది.

28
బలహీనపడుతున్న అల్పపీడనం

ఇటీవల ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడిన విషయం తెలిసిందే... ఇది తీవ్ర అల్పపీడనంగా, తర్వాత వాయుగుండానికి దారితీస్తుందని వాతావరణ శాఖ భావించింది. ఈ వాయుగుండం కూడా తీవ్ర వాయుగుండంగా మారి దక్షిణాది రాష్ట్రాల్లో అతిభారీ వర్షాలు కురిపిస్తుందని అంచనా వేశారు. ఈమేరకు హెచ్చరికలు కూడా జారీచేసి అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. అయితే బంగాళాఖాతంలో పరిస్థితులు మారడంతో వాయుగుండం దిశగా కదులుతున్న అల్పపీడనం బలహీనపడుతోందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. అంటే ఇక వాయుగుండం భయం లేదన్నమాట.

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కాస్త బలహీనపడి సాధారణ అల్పపీడనంగా కొనసాగుతోందని APSDMA తెలిపింది. ప్రస్తుతం ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ అంతర్గత కర్ణాటక ప్రాంతాల్లో కొనసాగుతోందని తెలిపింది. రాబోయే 24గంటల్లో దక్షిణ అంతర్గత కర్ణాటక దిశగా కదులుతూ మరింత బలహీనపడే అవకాశాలున్నాయని వెల్లడించింది.

38
శుక్రవారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

ఇలా వాయుగుండం గండం తప్పిందనుకుంటుండగానే APSDMA మరో షాకింగ్ ప్రకటన చేసింది. దక్షిణ అండమాన్, దాని పరిసర ప్రాంతాలలోని ఆగ్నేయ బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి సగటు 5.8 కిలోమీటర్ల ఎత్తులో మరో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఆగ్నేయ, తూర్పుమధ్య బంగాళాఖాతంలో రేపు (శుక్రవారం) మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇది తర్వాత 24 గంటల్లో అంటే అక్టోబర్ 25 (శనివారంకు) పశ్చిమ-ఉత్తర పశ్చిమ దిశగా కదులుతూ మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.  

48
ఏపీలో భారీ వర్షాలు

వాయుగుండం తప్పి అల్పపీడనం బలహీనపడుతున్నా మరో అల్పపీడనం ప్రభావంతో వర్షాలు మాత్రం కొనసాగుతాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. ఇకపై కూడా రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు కురుస్తాయని... మరీముఖ్యంగా దక్షిణ కోస్తా,రాయలసీమ ప్రాంతాల్లో వర్షతీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు,చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు సంస్థ ప్రకటించింది.

58
తీరప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు

బంగాళాఖాతంలో అల్లకల్లోల పరిస్థితులు కొనసాగుతున్నాయని... అందుకే తీరంవెంబడి గంటకు 30 నుండి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని APSDMA తెలిపింది. ఈ గాలులకు పిడుగులతో కూడిన వర్షాలు తోడయి ప్రమాదాలకు కారణమయ్యే అవకాశాలున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కాబట్టి శిథిలావస్థలో ఉన్న నిర్మాణాల్లో నివాసముండేవారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని... వర్ష సమయంలో చెట్లకింద తలదాచుకోరాదని సూచించారు. ఈ రెండుమూడు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రఖర్ జైన్ సూచించారు.

68
నెల్లూరులొ కుండపోత వానలు

ప్రస్తుతం నెల్లూరు జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి... కృష్ణపట్నం పోర్టులో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో 100 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యింది. ఈ వర్షాల వల్ల ప్రమాదాలు జరక్కుండా ఉండేందుకు ముందుజాగ్రత్తగా నిన్న, ఇవాళ (బుధ, గురువారం) రెండ్రోజులు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

78
ఏపీలో అతిభారీ వర్షాలు

ఇక కృష్ణా, పల్నాడు, బాపట్ల, గుంటూరు, అనంతపురం జిల్లాల్లోనూ అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి జిల్లాల్లో అయితే రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యింది... శ్రీకాళహస్తిలో 19 సెంటిమీటర్ల వర్షం కురిసింది. ఈ కుండపోత వర్షాలతో గోదావరి, కృష్ణాతో పాటు ఇతర నదుల్లో వరదప్రవాహం పెరిగింది.. వాగులు వంకలు చాలా ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. జలాశయాలు, చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారి జనావాసాల్లోని నీరు చేరుతోంది. ఇలా రాష్ట్రంలో వరద పరిస్థితుల నేపథ్యంలో విపత్తు నిర్వహణ సంస్థతో పాటు ఇతర విభాగాలను అప్రమత్తం చేశారు హోంమంత్రి వంగలపూడి అనిత.

భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల కలెక్టర్లతో హోంమంత్రి అనిత వీడియో కాన్పరెన్స్ ద్వారా మాట్లాడారు. భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని... అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. అత్యవసర సహయక చర్యల కోసం 1 NDRF, 4 SDRF బృందాలని ప్రభావిత జిల్లాలకు పంపించినట్లు మంత్రి తెలిపారు. పోలీసులతో పాటు విద్యుత్తు, పంచాయితీరాజ్, ఇరిగేషన్, ఆర్&బి వంటి శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని మంత్రి సూచించారు.

88
ఈ తెలంగాణ జిల్లాల్లోనూ జోరువానలు

తెలంగాణ విషయానికి వస్తే ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

Read more Photos on
click me!

Recommended Stories