AP News: తప్పు చేసిన వారెవరూ తప్పించుకోలేరు, శిక్షపడే కాలం పెరుగుతుంది అంతే.. ఇది ఒక సినిమాలోని డైలాగ్. తాజాగా కాకినాడ జిల్లాలో జరిగిన ఓ ఉదంతం దీనికి సరిగ్గా సరిపోతుంది.
కాకినాడ జిల్లా తునిలో జరిగిన ఒక దారుణ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. స్థానికంగా ఉన్న జగన్నాథగిరి గురుకుల బాలికల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న మైనర్ బాలికను ఆమె బంధువని చెప్పుకున్న తాటిక నారాయణరావు (62) అనే వ్యక్తి మోసం చేసి బయటికి తీసుకెళ్లాడు. “ఆసుపత్రికి తీసుకెళ్తా” అనే నెపంతో ఆమెను స్కూల్ నుంచి స్కూటీపై తీసుకెళ్లి, తొండంగి మండలం పైడికొండ గ్రామ శివార్లలోని సపోటా తోటకు తీసుకెళ్లాడు. అక్కడ అసభ్యకరంగా ప్రవర్తించి అత్యాచారానికి యత్నించాడు.
25
ఎలా వెలుగులోకి వచ్చిందంటే.?
బాలిక కేకలు విన్న తోటమాలి అక్కడికి చేరుకుని నారాయణరావును నిలదీశాడు. తాను ఆ బాలికకు తాతయ్య వరుస అవుతానని చెప్పి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అనంతరం స్కూటీపై బాలికను ఎక్కించుకుని హాస్టల్‌కి చేరి ఆమెను దింపి వెళ్లిపోయాడు. కానీ తోటలో జరిగిన ఈ ఘోరానికి సంబంధించిన వీడియో ఒక వ్యక్తి గుప్తంగా చిత్రీకరించాడు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.
35
పోలీసులకు అప్పగింత
వీడియో బయటపడిన వెంటనే గ్రామస్థులు, బాధితురాలి కుటుంబ సభ్యులు ఆగ్రహించారు. నిందితుడు నారాయణరావును పట్టుకుని బహిరంగంగా దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం, అత్యాచారం, కిడ్నాప్ తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే, ఈ ఘటన రాజకీయ కోణం తీసుకోవడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొంతమంది కేసును వేరే దారిలో మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులు హెచ్చరించారు.
అరెస్ట్ అయిన నారాయణరావును మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి తీసుకెళ్తుండగా, మధ్యలో వాష్‌రూమ్ అవసరమని చెప్పి పోలీసు వాహనం నుంచి దిగాడు. తునిలోని కోమటి చెరువు వద్దకు వెళ్లి నీటిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు వెంటనే గజఈతగాళ్లతో గాలింపు ప్రారంభించారు. అనంతరం అతని మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటనపై డీఎస్పీ శ్రీహరిరాజు స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. ఈ విషయం తెలిసిన ప్రజలు తప్పు చేసిన వారికి ఆ దేవుడు ఇలాంటి సరైన గుణపాఠం చెబుతారంటూ అభిప్రాయపడుతున్నారు.
55
రాజకీయ ప్రతిస్పందనలు
ఈ కేసుపై రాష్ట్ర రాజకీయ వర్గాలు కూడా స్పందించాయి. మంత్రి నారా లోకేశ్ బాధితురాలికి ధైర్యం చెప్పి, ప్రభుత్వం అన్ని విధాల సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ ఈ కేసును సుమోటోగా స్వీకరించి, దర్యాప్తును వేగవంతం చేయాలని ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో వైసీపీ ఈ ఘటనపై ట్వీట్ చేస్తూ “టీడీపీ నేతల చేతిలో ఆడబిడ్డలు సురక్షితం కాదని” ఆరోపించింది. దీనికి ప్రతిస్పందనగా టీడీపీ అధికారిక ప్రకటన విడుదల చేస్తూ “నారాయణరావుకు ప్రస్తుతం పార్టీలో ఎలాంటి పదవీ లేదు, తప్పు చేసినవారు ఎవరివారైనా శిక్ష తప్పదు” అని స్పష్టం చేసింది.