ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం, వాయుగుండం మూడూ ముంచుకొస్తున్నాయి.. ఇక భారీ వర్షాలతో అల్లకల్లోలమే

Published : Oct 19, 2025, 06:40 AM IST

Weather Updates : ఇప్పటికే కురిసిన భారీ వర్షాలతో తెలుగు ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. ఇవి చాలవన్నట్లు మరోసారి భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. 

PREV
17
ఇకపై వానలే వానలు

IMD Rain Alert : నైరుతి రుతుపవనాల ఎంట్రీతో వర్షాకాలం మొదలైనట్లు... ఎగ్జిట్ తో పూర్తయినట్లు. ఈ లెక్కన భారతదేశంలో ప్రస్తుతం వర్షాకాలం పూర్తయినట్లే... కానీ వర్షాలు మాత్రం వదల బొమ్మాళి వదల అంటున్నాయి. కాలంతో పనిలేదు... ఇష్టమొచ్చినప్పుడు ఇరగదీస్తానంటున్నాడు వరుణుడు. ఇలా అక్టోబర్ చివరికి చేరుకుంటున్నకొద్ది వానల తీవ్రత పెరుగుతూ ఉంటుందని... రాబోయే రోజుల్లో మరోసారి కుండపోత తప్పదని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

27
మారుతున్న వాతావరణంతో డేంజర్ బెల్స్

ఆగస్ట్, సెప్టెంబర్ లో కురిసిన భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. అక్టోబర్ లో ఆ బాధ లేదని అనుకుంటున్న సమయంలో వాతావరణ శాఖ పిడుగులాంటి ప్రకటన చేసింది. బంగాళాఖాతంలో భారీ వర్షాలకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని... ఇకపై మెల్లిగా మొదలయ్యే వర్షాలు ఊపందుకుని కుండపోతగా మారతాయని హెచ్చరిస్తోంది. తెలుగు రాష్ట్రాలకు వరదలు సంభవించే స్థాయిలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలు ప్రజలను కంగారుపెడుతున్నాయి.

37
బంగాళాఖాతంలో వాయుగుండం

 ఇప్పటికే బంగాళాఖాతంలో ఓ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది... దీని ప్రభావంతో మంగళవారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్ర ప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది మరింత బలపడుతూ గురువారం నాటికి దక్షిణమధ్య, పశ్చిమమధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇలా ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా... ఇది వాయుగుండంగా మారే ప్రాసెస్ లోనే అంటే వచ్చే బుధవారం (అక్టోబర్ 22) నుండే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన ప్రకటించారు. 

47
ఆదివారం ఏపీలో జోరువానలు

ఇక ఇవాళ (అక్టోబర్ 19, ఆదివారం) శ్రీకాకుళం, విజయనగరం, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. పిడుగులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు...కొన్నిచోట్ల చిరుజల్లులు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేప్పుడు ప్రజలు చెట్ల క్రింద నిలబడరాదని.. చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

57
నిన్న అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలివే

నిన్న(శనివారం) ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. సాయంత్రం 5 గంటలవరకు విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 49.7మిల్లిమీటర్లు, కృష్ణా జిల్లా ఘంటసాలలో 44.7మిల్లిమీటర్లు, తిరుపతిలో 27.7మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైందని APSDMA వెల్లడించింది.

67
నేడు ఈ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు

తెలంగాణ విషయానికి వస్తే ఇవాళ (అక్టోబర్ 19, ఆదివారం) భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ జిల్లాల్లో కొన్నిచోట్ల ఉరుములు మెరుపులు, ఈదురుగాలుల(గంటకు 30-40 కిలోమీటర్ల వేగం) తో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

77
దీపావళి పండగపూటా వానలే

సోమవారం (అక్టోబర్ 19) దీపావళి పండగరోజు పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది వాతావరణ శాఖ. పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలతో ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

Read more Photos on
click me!

Recommended Stories