Published : Nov 01, 2025, 02:10 PM ISTUpdated : Nov 01, 2025, 02:28 PM IST
Srikakulam Stampede : శ్రీకాకుళంలో తొక్కిసలాట జరిగిన వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి కీలక విషయాలు బైటికి వస్తున్నాయి. ఇది ప్రస్తుతం ప్రైవేట్ వ్యక్తుల నిర్వహణలో ఉందట.. దీన్ని ఎవరు నిర్మించారో తెలుసా?
Srikulam Stampede : శ్రీకాకుళం జిల్లాలో జరిగిన కార్తీక మాస వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. కార్తీక ఏకాదశి... అందులోనూ శనివారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి... ఇలాగే పలాస కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి కూడా భక్తులు పోటెత్తారు. అయితే ఈ ఆలయ సామర్థ్యం కేవలం రెండుమూడు వేలు మాత్రమేనట... కానీ ఏకంగా 20 నుండి 25 వేలమంది తరలిరావడంతో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది.
తొక్కిసలాటపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఇతర అధికారులు ఆలయానికి చేరుకున్నారు. ముందుగా భక్తులను కంట్రోల్ చేసి అక్కడినుండి పంపించేశారు... అనంతరం గాయపడినవారిని రక్షించి హాస్పిటల్ కు తరలించారు. తొక్కిసలాటలో మరణించినవారి మృతదేహాలను కూడా అక్కడినుండి తరలించారు.
24
ఘటనాస్థలికి చేరుకున్న అచ్చెన్నాయుడు
ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్నవెంటనే జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు ఘటనాస్థలికి చేరుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీషతో పాటు ఇతక నాయకులు, ఉన్నతాధికారులు కూడా కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి ఘటనపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.
34
కాశీబుగ్గలో ఆలయ నిర్వహకులెవరు?
ప్రస్తుతం కాశీబుగ్గలోని ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రైవేట్ వ్యక్తుల నిర్వహణలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 12 ఎకరాల్లో ఆలయ ప్రాంగణం ఉండగా... 5 ఎకరాల్లో ప్రధాన ఆలయాన్ని హరిముకుంద్ పండా అనే వ్యక్తి సొంత డబ్బుతో నిర్మించారట. ఇందుకోసం దాదాపు రూ.10 నుండి రూ.20 కోట్లవరకు ఖర్చుచేసినట్లుగా తెలుస్తోంది. గతేడాదే ఈ ఆలయాన్ని ప్రారంభించారు.
ఈ ఆలయానికి ప్రతి శనివారం 1000 మందివరకు భక్తులు వస్తారట... కార్తీకమాసం సందర్భంగా ఈ శనివారం రెండుమూడు వేలమంది వస్తారని ఆలయ నిర్వహకులు భావించి అందుకు తగినట్లు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కానీ ఒక్కసారిగా దాదాపు 20 వేలకు పైగా భక్తులు పోటెత్తడంతో ఏం చేయలేకపోయారని... వారిని కంట్రోల్ చేయడం సాధ్యంకాలేదు... దీంతో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది.
శ్రీకాకుళం తొక్కిసలాటపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. తొక్కిసలాట ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని... భక్తుల మరణం గురించి తెలిసి ఆవేదనకు గురయ్యానని అన్నారు. మృతి చెందినవారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను... క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని... విచారణ చేపట్టి తొక్కిసలాటకు గల కారణాలేంటో తెలుసుకుంటామని అన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరక్కుండా చూడాలని అధికారులను పవన్ కల్యాణ్ ఆదేశించారు.
కార్తీక మాసంలో రాష్ట్రంలోని శైవ క్షేత్రాలతోపాటు, ప్రముఖ ఆలయాలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది... కాబట్టి క్యూ లైన్ల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని దేవాదాయ శాఖ అధికారులకు సూచించారు పవన్ కల్యాణ్. మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఆలయ ప్రాంగణాల్లో తగిన రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనాకు వచ్చినప్పుడు పోలీసు బందోబస్తుతోపాటు, మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు.