AWARE 2.0 System : ఆంధ్ర ప్రదేశ్ లో తరచూ తుపానులు సంభవిస్తుంటాయి. అందుకే ముందస్తుగానే ఈ తుపానులను గుర్తించేందుకు చంద్రబాబు సర్కార్ సరికొత్త టెక్నాలజీతో ఏర్పాటుచేసిన వ్యవస్థే ఈ అవేర్ 2.0. ఇది ఎలా పనిచేస్తుందంటే..
Aware 2.0 : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరు చెప్పగానే ముందుగా గుర్తుకువచ్చేది టెక్నాలజీ. ఆయనకు టెక్ సీఎం అనికూడా పేరుంది... అత్యాధునిక సాంకేతికతను రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఉపయోగించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. అయితే రాష్ట్రానికి పెద్ద తలనొప్పిగా మారిన తుపానులను కూడా టెక్నాలజీతోనే సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సిద్దమయ్యారు చంద్రబాబు. ఇందుకోసం తీసుకువచ్చిందే AWARE 2.0 (ఏపీ వెదర్ ఫోర్ క్యాస్టింగ్ ఇండ్ ఎర్లీ వార్నింగ్ రీసెర్చ్ సెంటర్).
25
ఏమిటీ అవేర్ 2.0 వ్యవస్థ
బంగాళాఖాతంలో తరచూ అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడుతుంటాయి... కొన్నిసార్లు ఇవి తుపాన్లుగా మారి అతలాకుతలం చేస్తుంటాయి. ముఖ్యంగా ఈ తుపానుల ప్రభావం ఆంధ్ర ప్రదేశ్ పై ఎక్కువగా ఉంటుంది... గతంలో హుద్ హుద్ అయినా, ఇప్పుడు మొంథా అయినా రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించినవే. ఇలాంటి తుపానులను ముందుగానే గుర్తించి ప్రభుత్వం యంత్రాంగం, ప్రజలను అప్రమత్తంచేయడానికి రూపొందించిందే ఈ అవేర్ 2.0 వ్యవస్థ.
వాతావరణ మార్పులను దాదాపు వారంరోజుల ముందుగానే పసిగట్టేలా ఈ అవేర్ 2.0 వ్యవస్థ పనిచేస్తుంది. కేవలం భూమిపైనే కాదు సముద్రంలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే టెక్నాలజీ దీంతో అనుసంధానం చేశారు. దీంతో తుపానులను చాలా ముందుగానే పసిగట్టవచ్చని... తద్వారా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టి ప్రమాదాలను నివారించవచ్చని చెబుతున్నారు. ఇలా మొంథా తుపానును కూడా ఈ అవేర్ 2.0 వ్యవస్థ ద్వారా పసిగట్టి ముందస్తు సహాయక చర్యలు చేపట్టినట్లు తాజాగా రాష్ట్ర ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ తెలిపారు.
35
టెక్నాలజీ వనరుగా AWARE 2.0
అవేర్ 2.0 వ్యవస్థకు స్టేట్ డేటాలేక్ ద్వారా అన్ని విభాగాలను అనుసంధానం చేశామని... దీంతో రియల్ టైములో నిర్ణయాలు తీసుకోవడానికి వీలు కలిగిందని ఏపీ ఐటీ సెక్రటరీ తెలిపారు. కేవలం వర్షపాతమే కాదు ఈదురుగాలులు, పిడుగుల వంటి వాటిపై హెచ్చరికలు చేసేలా అవేర్-2.0 వ్యవస్థ పని చేస్తుందన్నారు. ఈ వ్యవస్థ ద్వారా విపత్తు నిర్వహణను సమర్థవంతంగా చేపట్టవచ్చని తెలిపారు.
ఈ అవేర్ 2.0 వ్యవవస్థ ద్వారా రిజర్వాయర్లలో నీటి స్థాయి, ఇన్‌ఫ్లో, ఔట్ ప్లో, భూగర్భ జలాలు, చెరువులకు సంబంధించిన రియల్ టైమ్ డేటా అందుబాటులో ఉంటుందన్నారు. దీంతో శాటిలైట్ ద్వారా వివిధ ప్రమాదాలకు సంబంధించిన హెచ్చరికలు జారీ చేసే అవకాశముందన్నారు. అవేర్-2.0 వ్యవస్థ ద్వారా వచ్చే సమాచారాన్ని క్రోడీకరించుకుని...ఏఐ ద్వారా విశ్లేషించి మొంథా తుఫాన్ కదలికలను కచ్చితంగా తెలుసుకోగలిగామని అన్నారు. తద్వారా సహాయక చర్యలను ప్రభుత్వ యంత్రాంగాలు చాలా వేగంగా చేపట్టగలిగాయని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అవేర్ 2.0 వ్యవస్థ ద్వారా చాలా ముందుగానే మొంథా తుపానును గుర్తించామని... 72 గంటల ముందే దీని కదలికల్లో వచ్చిన మార్పులను తెలుసుకున్నామన్నారు. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకున్నాం... తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను అలెర్ట్ చేయగలిగామన్నారు. గాలుల వేగాన్ని అంచనా విషయంలో ఖచ్చితమైన సమాచారం రావడంతో... ఆయా ప్రాంతాల్లో ముందస్తుగానే చర్యలు తీసుకోవడానికి అవకాశం లభించిందన్నారు. దీని ద్వారా ప్రాణనష్టం, ఆస్తి నష్టాన్ని తగ్గించగలిగామని ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ వెల్లడించారు.
రాష్ట్రంలోని నదులు, ముఖ్యమైన వాగుల ప్రవాహతీరు... వరదల సమయంలో జరిగే మార్పులను ఈ అవేర్ 2.0 ద్వారా పసిగట్టవచ్చని ప్రభుత్వం చెబుతోంది. తద్వారా వరదలు సంభవించే ప్రాంతాల్లో ప్రజలను ముందుగానే అలర్ట్ చేసే వీలుంటుందని చెబుతోంది.
ఇక వాతావరణంలో వచ్చే మార్పులు అంటే తేమ, గాలివేగం వంటివి కూడా ఈ అవేర్ 2.0 ద్వారా గుర్తించవచ్చు... సముద్రంలో ఏదైనా ప్రమాదకర పరిస్థితులు ఏర్పడితే ముందుగానే గుర్తించి మత్స్యకారులను అలర్ట్ చేయవచ్చు. అలాగే రైతులను కూడా ఈదురుగాలులు, భారీ వర్షాల సమయంలో పంటలు దెబ్బతినకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టేలా రైతులను కూడా అప్రమత్తం చేయవచ్చని ప్రభుత్వం చెబుతోంది.
55
గాలి కాలుష్యాన్ని కూడా పసిగట్టవచ్చు
గాలి నాణ్యత, కాలుష్యం కూడా అవేర్ 2.0 టెక్నాలజీ ద్వారా గుర్తించవచ్చని ప్రభుత్వం చెబుతోంది. అంటే ఎక్కడైనా వాయుకాలుష్యం పెరిగిపోతే దాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవచ్చు. ఇలా తుపానులు, వర్షాలు, పిడుగులు, ఈదురుగాలులు, నదీ ప్రవాహాలు, జలాశయాల్లో నీటినిల్వలు, ఇతర వాతావరణ పరిస్థితులన్నింటి గురించి తెలియజేసే అత్యాధునిక వ్యవస్థే చంద్రబాబు సర్కార్ ఏర్పాటుచేసిన అవేర్ 2.0 వ్యవస్థ.