Rain Alert: భారీ వర్షాల కారణంగా గోదావరి నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయానికి భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 49.8 అడుగులకు చేరుకుంది. కూనవరం వద్ద 16.35 మీటర్లు, పోలవరం వద్ద 10.26 మీటర్ల నీటి మట్టం నమోదైంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో రెండూ 5,39,934 క్యూసెక్కులుగా ఉన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే శుక్రవారం రాత్రి మొదటి ప్రమాద హెచ్చరిక, శనివారం రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
25
ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు
వరద ప్రభావం ఉండే అవకాశం ఉన్న తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, పశ్చిమగోదావరి, ఏలూరు, పోలవరం ప్రాంతాల అధికారులను ఇప్పటికే అప్రమత్తం చేశారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, లంక గ్రామాల్లో నివసించే ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాలకు తరలించాలని జిల్లా యంత్రాంగానికి సూచనలు ఇచ్చారు.
35
సహాయక చర్యలకు సిద్ధంగా NDRF, SDRF బృందాలు
అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అమలాపురం, రాజమహేంద్రవరం, చింతూరు, వీఆర్‌పురం, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో మూడు NDRF, మూడు SDRF బృందాలను సిద్ధంగా ఉంచారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి వచ్చినా వెంటనే స్పందించేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అత్యవసర సహాయం లేదా సమాచారం కోసం 112, 1070, 1800 425 0101 టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాలని ప్రజలను కోరింది.
వరదల సమయంలో ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, కల్వర్టులు, కాజ్‌వేల మీదుగా ప్రయాణాలు చేయకూడదని అధికారులు హెచ్చరించారు. అలాగే గోదావరి నదిలో స్నానం చేయడం, ఈత కొట్టడం, చేపల వేటకు వెళ్లడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.
55
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
ఆగస్టు 1 (శనివారం) మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం పరిసరాలు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. ఈ జిల్లాల ప్రజలు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.