
School Holidays : భారీ వర్షాల కారణంగా ఇప్పటికే తెలంగాణ విద్యార్థులకు ఊహించని విధంగా సెలవులు వస్తున్నాయి. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో కుండపోత వానలు, వరద పరిస్థితుల కారణంగా నిన్న (జూలై 30) సెలవులు ఇచ్చారు… ఇవాళ కూడా కొన్నిచోట్ల సెలవు ఉంది. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో పెద్దగా వర్షాలే లేవు... అయినా కొన్ని జిల్లాల విద్యార్థులకు వరుసగా రెండ్రోజులు సెలవులు వస్తున్నాయి... ఆదివారంతో కలిపి మూడ్రోజులు. సడన్ గా వరుస సెలవులేందుకు వస్తున్నాయి? ఏఏ జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవులున్నాయి? అనేది ఇక్కడ తెలుసుకుందాం.
ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రధాన నగరాల్లో విశాఖపట్నం ఒకటి. ఈ బీచ్ సిటీ రోజురోజుకు మరింత విస్తరిస్తూ అభివృద్ధి విస్తరిస్తోంది... ఇందుకు తగినట్లుగా గ్లోబల్ స్థాయి సదుపాయాలతో, అత్యాధునిక టెక్నాలజీతో ఇంటర్నేషనల్ విమానాశ్రయం నిర్మించింది ప్రభుత్వం. విశాఖపట్నం శివారులో విజయనగరం జిల్లా భోగాపురంలో జిఎంఆర్ గ్రూప్ ఈ కొత్త విమానాశ్రయాన్ని నిర్మించింది... ఈ ఎయిర్ పోర్టుకు స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టారు.
ఇప్పటికే ఈ అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం మొదటి దశ నిర్మాణం పూర్తయ్యింది... ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా ఆగస్ట్ 1న దీన్ని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఇందుకోసం కూటమి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది... లక్షలాది మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసింది. ఈ క్రమంలోనే విద్యార్థులు ఇబ్బందులు పడకుండా రెండ్రోజులు సెలవులు ప్రకటించింది.
భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవం నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ప్రైవేట్ విద్యాసంస్థలన్నింటికి సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. ఈ మేరకు ఇప్పటికే సంబంధిత అధికారుల నుండి విద్యాసంస్థలకు ఆదేశాలు అందాయి. జనసమీకరణ కోసం విద్యాసంస్థల బస్సులు వాడుకుంటోంది ప్రభుత్వం... అందుకోసమే విద్యార్థులకు సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రైవేట్ స్కూల్స్ కి మాత్రమే సెలవు... ప్రభుత్వ పాఠశాలలు యధావిధిగా పనిచేస్తాయి.
భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం, ప్రధాని మోదీ పర్యటన కోసం ఇప్పటికే ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు (ఆగస్ట్1, శనివారం) ఉదయం ప్రధాని విమానాశ్రయానికి చేరుకుంటారు. విమానాశ్రయాన్ని ప్రారంభించి బహిరంగ సభలో పాల్గొంటారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుండి భారీగా ప్రజలను ఈ బహిరంగ సభకు తరలించనున్నారు... ఇందుకోసమే ఈ రెండు జిల్లాల్లోని ప్రైవేట్ విద్యాసంస్థలకు ఇవాళ, రేపు (శుక్ర, శనివారం) సెలవులు ప్రకటించారు. ప్రైవేట్ స్కూల్ బస్సులను విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం ఉపయోగించనున్నారు.
రెండ్రోజులు (శుక్రవారం, శనివారం) ప్రభుత్వమే విద్యాసంస్థలకు అధికారికంగా సెలవు ఇస్తోంది... ఆదివారం ఎలాగూ సాధారణ సెలవే. అంటే రెండ్రోజులు కాదు వరుసగా మూడ్రోజులు సెలవులు వస్తున్నాయి. ఇలా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో చదువుకునే విద్యార్థులకు ఊహించని విధంగా వరుస సెలవులు వస్తున్నాయి... వీకెండ్ కాస్త లాంగ్ వీకెండ్ గా మారింది. తిరిగి సోమవారమే ఈ రెండు జిల్లాల్లోని ప్రైవేట్ విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి.
భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన షెడ్యూల్ ఖరారయ్యింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ఆయన పర్యటన ఎలా సాగుతుందంటే…
ఆగస్ట్ 1 (శనివారం) ఉదయం 10:45 గంటలకు – ప్రత్యేక విమానంలో దిల్లీ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు.
10:45 – 10:50 – గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర-రాష్ట్ర మంత్రులు ప్రధానికి స్వాగతం పలుకుతారు.
10:50 – 10:55 – కారులో ప్రయాణికుల టెర్మినల్ భవనానికి చేరుకుంటారు.
10:55 – 10:58 – 200 మంది విద్యార్థుల కూచిపూడి నృత్యంతో ఘన స్వాగతం.
11:00 – 11:15 – భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులను పరిశీలిస్తారు.
11:17 – 11:25 – టెర్మినల్ భవనం నుంచి ఓపెన్‌టాప్ జీప్‌లో బహిరంగ సభాస్థలానికి చేరుకుంటారు.
11:30 – 12:55 – విమానాశ్రయ ప్రారంభోత్సవం, శిలాఫలక ఆవిష్కరణ, అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం, బహిరంగ సభలో ప్రసంగం.
మధ్యాహ్నం 1:05 – 1:10 – భోగాపురం నుంచి ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణం.
మొత్తం పర్యటన వ్యవధి సుమారు 2 గంటల 25 నిమిషాలు మాత్రమే.