AP Investments: ఆంధ్ర‌ప్ర‌దేశ్ యువ‌తకు పండ‌గ‌లాంటి వార్త‌.. తైవాన్ కంపెనీలు భారీగా పెట్టుబ‌డులు

Published : Jul 30, 2026, 09:38 PM IST

AP Investments: ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌, సెమీకండక్టర్ల తయారీ కేంద్రంగా మార‌నుంది. ఈ క్రమంలో తైవాన్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామిక సంస్థల ప్రతినిధి బృందం అమరావతిలో సీఎం చంద్ర‌బాబుతో స‌మావేశ‌మైంది.

PREV
14
ఎలక్ట్రానిక్స్‌, సెమీకండక్టర్ల రంగంపై తైవాన్ కంపెనీల దృష్టి

తైవాన్‌కు చెందిన ప్రముఖ కంపెనీల ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్‌, సెమీకండక్టర్లు, ఐటీ, అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్‌, ఎగుమతి ఆధారిత పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలపై రాష్ట్ర ప్రభుత్వంతో విస్తృతంగా చర్చించారు. తయారీ రంగంలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని ఇరుపక్షాలు అభిప్రాయపడ్డాయి.

24
పెట్టుబడిదారులకు పూర్తి సహకారం: సీఎం చంద్రబాబు

సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూలంగా అమలు చేస్తున్న విధానాలను వివరించారు. పెట్టుబడిదారులకు పారదర్శక విధానాలు, వేగవంతమైన అనుమతులు, స్థిరమైన పారిశ్రామిక వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పోర్టులు, విమానాశ్రయాలు, జాతీయ రహదారులు, రైల్వే అనుసంధానం వంటి బలమైన మౌలిక వసతులు రాష్ట్రానికి ప్రధాన బలమని చెప్పారు. ఎలక్ట్రానిక్స్‌, సెమీకండక్టర్లతో పాటు అధునాతన తయారీ రంగాలను ప్రోత్సహించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

34
లోకేశ్‌తో నైపుణ్యాభివృద్ధి, విద్యపై కీలక చర్చలు

ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌తో జరిగిన ప్రత్యేక సమావేశంలో యువతకు అవసరమైన నైపుణ్యాల అభివృద్ధిపై ప్రధానంగా చర్చించారు. ఎలక్ట్రానిక్స్‌, సెమీకండక్టర్లు, ప్రిసిషన్ ఇంజినీరింగ్‌, ఇండస్ట్రియల్ ఆటోమేషన్‌, హెల్త్‌కేర్ వంటి హై-స్కిల్ రంగాల్లో శిక్షణ కార్యక్రమాలు చేపట్టే అంశాన్ని పరిశీలించారు. అలాగే మాండరిన్ భాష శిక్షణ, పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన సర్టిఫికేషన్ కోర్సులు, ఇంటర్న్‌షిప్‌లు, విద్యార్థి-అధ్యాపకుల మార్పిడి కార్యక్రమాలు, సంయుక్త పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఇరుపక్షాలు అభిప్రాయపడ్డాయి.

44
ఏపీ పారిశ్రామికాభివృద్ధికి కొత్త అవకాశాలు

ఈ సమావేశాల్లో డెల్టా ఎలక్ట్రానిక్స్‌, బెన్‌క్యూ, సీబీటీసీ బ్యాంక్‌, డైమెర్కో, మాస్టర్ హిల్‌, నాన్ పావో రెసిన్స్‌, ఎవర్ క్లియర్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్‌, కేఎస్ టెర్మినల్స్‌, శాండ్ సన్‌, జిలీ కన్‌స్ట్రక్షన్స్‌ అండ్ ఇంజినీరింగ్‌ తదితర ప్రముఖ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. భారత్‌లో ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న తైవాన్ కంపెనీలు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో విస్తరణ అవకాశాలను పరిశీలించడం రాష్ట్రానికి సానుకూల సంకేతంగా భావిస్తున్నారు. ఈ భాగస్వామ్యంతో పెట్టుబడులు పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధికి కూడా కొత్త దారులు తెరుచుకునే అవకాశం ఉందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories