Rain Alert: నైరుతి రుతుపవనాల కారణంగా రాష్ట్రంలో వర్షాలు దంచికొట్టాయి. ముఖ్యంగా ఏపీతో పాటు తెలంగాణలో వరణుడు ప్రతాపం చూపాడు. అయితే ఇప్పుడు ఈశాన్య గాలుల ప్రభావంతో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు కొనసాగనున్నాయి. విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు భారీ వర్షాలు, ఈదురు గాలుల హెచ్చరికలు జారీ చేశారు. తమిళనాడు తీరప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయిందని తెలిపారు. ఈ ప్రభావంతో కోస్తా ఆంధ్ర నుంచి ఉత్తరాంధ్ర వరకు విస్తృతంగా వర్షాలు పడే అవకాశం ఉందని సూచించారు.
26
వర్షపాతం ఎక్కువగా ఉండే జిల్లాలు
వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణ కోస్తా నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా తిరుపతి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కోనసీమ, NTR, శ్రీకాకుళం, అల్లూరి సీతారామ రాజు, ఏలూరు జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా పడవచ్చని అంచనా వేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు వెనుదిరుగుతున్న సమయంలో ఈశాన్య గాలులు ప్రవేశించడంతో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
36
ఈదురు గాలులు, సముద్ర అలజడి
తీరప్రాంతాల్లో గాలుల వేగం గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వరకు పెరగవచ్చని అధికారులు హెచ్చరించారు. సముద్రం అలజడిగా మారే అవకాశం ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. కృష్ణా, బాపట్ల, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఈదురు గాలులు ఉధృతంగా వీస్తాయని చెప్పారు. రాయలసీమ జిల్లాలైన కర్నూలు, నంద్యాల, చిత్తూరు, కడప ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
దేశం మొత్తం మీద నైరుతి రుతుపవనాలు నిష్క్రమించే దశలో ఉన్నాయి. గురువారం నాటికి అవి పూర్తిగా వైదొలగనున్నాయి. అదే సమయంలో బంగాళాఖాతం వైపు నుంచి ఈశాన్య గాలులు దక్షిణాది రాష్ట్రాల వైపు వీస్తున్నాయి. వాతావరణ శాఖ ప్రకారం, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఈ గాలుల ప్రభావంతో వచ్చే రెండు రోజుల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
56
సముద్రంలో అల్పపీడనం – తుఫాన్‌గా మారే అవకాశాలు
వాతావరణ నిపుణుల అంచనాల ప్రకారం, అరేబియా సముద్రం ఆగ్నేయ ప్రాంతంలో అక్టోబర్ 19న అల్పపీడనం ఏర్పడుతుంది. ఇది బలపడి 20 నుంచి 22వ తేదీల మధ్య వాయుగుండంగా మారే అవకాశం ఉంది. 26వ తేదీ నాటికి తుఫాన్‌గా మారవచ్చని అంచనా. అదే సమయంలో బంగాళాఖాతం దక్షిణ భాగంలో అక్టోబర్ 21 తర్వాత మరో అల్పపీడనం ఏర్పడి, అది ఉత్తరాంధ్ర–ఒడిశా తీరాలకు చేరి తర్వాత బంగ్లాదేశ్ వైపు మళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
66
సూచనలు
వాతావరణ శాఖ ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తూ, తీరప్రాంతాల్లో అవసరం అయితే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించింది. వర్షాలు, గాలులు ఉధృతంగా ఉండే అవకాశం ఉన్నందున రైతులు, మత్స్యకారులు, పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఈ వర్షాలు పంటలకు కొంత ఉపశమనం ఇవ్వవచ్చని రైతులు భావిస్తున్నప్పటికీ, మత్స్యకారులు మాత్రం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.