రాష్ట్ర ప్రభుత్వం ఈ తుపాను ప్రభావాన్ని తగ్గించేందుకు ముందస్తు చర్యలు చేపట్టిందని అధికారులు వివరించారు. బుడమేరుపై వచ్చిన గత అనుభవం ఆధారంగా ఈసారి 680 డ్రోన్లను ఉపయోగించి వర్షపాతం, వరదల పరిస్థితులను పర్యవేక్షించారు.
అక్టోబర్ 27 నుంచి 29 వరకు 82.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందనీ, ఇది సాధారణ వర్షాల కంటే తొమ్మిది రెట్లు ఎక్కువని వెల్లడించారు. 443 మండలాలు ఈ తుపాన్ ప్రభావానికి లోనయ్యాయి. ఈ విపత్తులో 3 మంది మరణించగా, 9,960 ఇళ్లు నీటమునిగాయి, 1,11,402 మంది నిరాశ్రయులయ్యారు.
సహాయక చర్యలలో 12 ఎన్డీఆర్‌ఎఫ్, 13 ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు, 1,702 వాహనాలు, 110 ఈతగాళ్లు పాల్గొన్నారు. 22 జిల్లాల్లో 2,471 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 1.92 లక్షల మందికి ఆశ్రయం కల్పించారని అధికారులు తెలిపారు.