Rain and Cold in Telugu States: బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశముంది. మళ్లీ వర్షాల హెచ్చరికలతో పాటు రాత్రివేళల్లో చలి తీవ్రత పెరుగుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు మొదలవుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. బంగాళాఖాతంలో మళ్లీ వాతావరణ మార్పులు చోటుచేసుకున్నాయి. నైరుతి బంగాళాఖాతం నుంచి కేరళ వరకు, శ్రీలంక–తమిళనాడు మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఈ ద్రోణి కారణంగా తేమ గాలులు మళ్లీ తెలుగు రాష్ట్రాల వైపు కదులుతున్నాయి. ఫలితంగా రాబోయే మూడు రోజులు కోస్తా ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. అదే సమయంలో దిగువ ట్రోపోస్థాయిలో ఉత్తర–ఈశాన్య గాలులు వీస్తుండటంతో వర్షాల తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది.
25
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజులు వర్షాలు
ఏపీలోని ఉత్తర కోస్తా జిల్లాలు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో వచ్చే రెండు రోజులు జల్లులు పడవచ్చని అంచనా వేసింది. దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు, ప్రకాశం, గుంటూరు ప్రాంతాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రివేళ వరకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
రాయలసీమ జిల్లాల్లో కూడా వర్ష ప్రభావం ఉంటుంది. అనంతపురం, కడప, చిత్తూరు, కర్నూలు ప్రాంతాల్లో జల్లులు పడతాయని తెలిపింది. ఇటీవల వరుసగా కురిసిన వర్షాల కారణంగా చాలా ప్రాంతాల్లో వరద నీరు చేరింది. మళ్లీ వర్ష ప్రభావం క్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు రైతులు పంటల సంరక్షణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
35
తెలంగాణలో చలి పంజా.. ఆరెంజ్ అలర్ట్ జారీ
మరోవైపు తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం, ప్రస్తుతం కనిష్ఠ ఉష్ణోగ్రతలు 9 నుంచి 14 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతున్నాయి. నవంబర్ 10 తరువాత చలి తీవ్రత మరింత పెరుగుతుందని ఐఎండీ ఇప్పటికే హెచ్చరించింది.
ప్రత్యేకంగా ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ కాగా, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. పలు గ్రామాల్లో తెల్లవారుజామున మంచు కురుస్తుండగా, రోడ్లపై పొగమంచు కమ్మేస్తోంది. రాత్రివేళల్లో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని పోలీసులు సూచించారు. ఇదే సమయంలో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు ఉంటాయని తెలిపారు.
చలి పెరుగుతున్న నేపథ్యంలో పెద్దలు, చిన్నపిల్లలు, రోగులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చలి పంజాతో పల్లెల్లో చలిమంటలు కనిపిస్తున్నాయి.
పశువుల సంరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు పంటలపై మంచు ప్రభావం ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా టమాటా, మిరప, పత్తి, బంగాళదుంప వంటి పంటలకు మంచు దెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
55
బంగాళాఖాతంలో ప్రకంపనలు
బంగాళాఖాతంలో వరుస తుఫాన్ల మధ్య తాజాగా భూకంపం సంభవించింది. అండమాన్ సముద్రం వద్ద రిక్టర్ స్కేల్‌పై 5.4 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. జర్మనీ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ ప్రకారం దీని తీవ్రత 6.7గా నమోదైంది. సముద్ర ఉపరితలం నుంచి 90 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది.
పోర్ట్ బ్లెయిర్, మధుబన్, వైపర్ ఐలాండ్స్, బండా ఏక్ ప్రాంతాల్లో భూమి స్వల్పంగా ప్రకంపించింది. అటు ఇండోనేసియా, మలేసియా తీర ప్రాంతాల్లోనూ తేలికపాటి ప్రకంపనలు నమోదయ్యాయి. ప్రారంభంలో సునామీ హెచ్చరికలు వస్తాయని భావించినా, ఎటువంటి సునామీ ప్రమాదం లేదని అధికారులు స్పష్టం చేశారు.