Montha cyclone : మొంథా తుపాను ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వేగంగా కదులుతోంది. కోనసీమ, కాకినాడ జిల్లాల్లో 12,135 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో అధికారులు అత్యవసర చర్యలు చేపట్టారు.
మొంథా తుపాను: కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొంథా తీవ్రమైన తుపానుగా కొనసాగుతోంది. వేగంగా తీరంవైపు దూసుకొస్తోంది. గడిచిన గంటలో తుపాన్ 10 కి.మీ వేగంతో ముందుకు కదిలింది. ప్రస్తుతం తుపాను మచిలీపట్నంకు 100 కి.మీ, కాకినాడకు 180 కి.మీ, విశాఖపట్ననానికి 270 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.
తీరానికి మరింత దగ్గరపడే కొద్దీ తుపాను ప్రభావం పెరుగుతుందని అధికారులు తెలిపారు. కోస్తా జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరందాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్టు హెచ్చరించారు. ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.
25
కోనసీమలో అత్యవసర సమీక్ష
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా తీర ప్రాంతాల వద్ద మంగళవారం రాత్రికి మొంథా తుపాను తీరం దాటే అవకాశాలు ఉన్నాయని జిల్లాలో తుపాను సహాయక చర్యల ప్రత్యేక అధికారి వి. విజయ రామరాజు తెలిపారు.
జిల్లా కలెక్టరేట్ నుండి గ్రామ సచివాలయం వరకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పునరావాస చర్యల పురోగతిని సమీక్షించారు. సముద్ర తీరానికి ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్న కచ్చా గృహాలలో నివసించే ప్రజలను తప్పనిసరిగా పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. పోలీసుల సహకారంతో త్వరగా తరలింపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
35
పునరావాస కేంద్రాలు, అత్యవసర వసతులు
పునరావాస కేంద్రాల్లో అవసరమైన వసతులు ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నాణ్యమైన ఆహారం, సురక్షిత త్రాగు నీరు, మందుల సరఫరాతో మెడికల్ క్యాంపులు, శుభ్రత చర్యలు వంటివి సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
తుపాను ప్రభావం నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తీరాన్ని దాటే సమయానికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు.
కాకినాడ జిల్లాలో తీర, లోతట్టు ప్రాంతాల నుంచి మొత్తం 12,135 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. జిల్లాలో 401 కేంద్రాలను గుర్తించగా, ఇప్పటివరకు 76 కేంద్రాలు ప్రారంభించారు. త్రాగునీటి కోసం 24 ట్యాంకర్లు, ఆహార సరఫరాకు 191 మంది సిబ్బంది, పాల సరఫరాకు సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. 21,513 ఆహార పొట్లాలు, 1313 వాటర్ క్యాన్లు పంపిణీ చేశారు.
గర్భిణులు 95 మంది, బాలింతలు 1400 మందిని 52 ఆసుపత్రులకు తరలించారు. 14,499 మంది విద్యార్థులను హాస్టళ్ల నుంచి ఇళ్లకు పంపించారు. బోట్లన్నిటినీ తీరానికి రప్పించారు. 4,573 బోట్లను క్రీక్‌లలో భద్రపరిచారు.
55
అత్యవసర బలగాలతో సమన్వయంతో విపత్తు నిర్వహణ చర్యలు
జిల్లాకు రెండు NDRF బృందాలు (30+24), ఒక SDRF బృందం (50 మంది) చేరాయి. గజ ఈతగాళ్లు 200 మంది, 40 బోట్లు సిద్ధంగా ఉన్నాయి. కాకినాడ అర్బన్, పిఠాపురం, తాళ్లరేవులలో హెలిపాడ్లు సిద్ధం చేశారు. 259 మెడికల్ క్యాంపులు, 185 మంది వైద్యులు, 1710 మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు. 108 ఆంబులెన్సులు 23 సిద్ధంగా ఉన్నాయి. 104 వాహనాలు 35, వీటికి తోడుగా 102 వాహనాలు 22 సిద్ధంగా ఉన్నాయి.
మొత్తం 9901 పశువులను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. మౌలిక వసతుల పునరుద్ధరణకు భారీ యంత్రాలు, విద్యుత్ సిబ్బంది అందుబాటులో ఉన్నారు. ప్రజలు కంట్రోల్ రూమ్‌లను సంప్రదించి సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.